logo

సభకు రైట్‌ రైట్‌.. ప్రయాణికులకు హోల్డాన్‌!

ఆర్టీసీ బస్సుల కోసం బుధవారం గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్లలో నిరీక్షించక తప్పలేదు. కొన్ని రూట్లలో సర్వీసుల కుదింపుతో రాకపోకలకు అవస్థలు పడ్డారు.

Published : 08 Dec 2022 03:58 IST

రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల నిరీక్షణ

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): ఆర్టీసీ బస్సుల కోసం బుధవారం గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్లలో నిరీక్షించక తప్పలేదు. కొన్ని రూట్లలో సర్వీసుల కుదింపుతో రాకపోకలకు అవస్థలు పడ్డారు. విజయవాడలో బుధవారం జరిగిన వైకాపా జయహో బీసీ మహా సభకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 34 బస్సులు పంపడంతో కొన్ని రూట్లలో షెడ్యూల్‌ సర్వీసులను కుదించి ఉన్నవి సర్దుబాటు చేసి నడిపారు. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద క్యూలో ప్రయాణికులు

కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి ఈ జిల్లాకు వచ్చే సర్వీసులు కూడా తగ్గడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరలేని పరిస్థితి నెల్కొనడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ సర్వీసులు కుదింపుతో రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, తుని, కాకినాడ నుంచి ద్వారపూడి మీదుగా రాజమహేంద్రవరం వచ్చే బస్సుల కోసం రాజమహేంద్రవరం కాంప్లెక్స్‌లో ప్రయాణికులు ఎక్కువ సమయం పడిగాపులు పడాల్సి వచ్చింది. ఆర్టీసీ అధికారులు మాత్రం షెడ్యూల్‌ సర్వీసులు తగ్గించలేదని, అదనంగా ఉన్న బస్సులనే విజయవాడకు పంపించామని చెప్పడం విశేషం.


గంటపాటు ఎదురుచూసినా...

-ఆనందరావు

తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం బస్సులో వచ్చా. ఇక్కడ బస్సు మారి తుని వెళ్లాలి. గంటపాటు ఎదురుచూశా. తాడేపల్లిగూడెంలోనూ వెంటనే బస్సు దొరకలేదు. ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి.  


ఇబ్బంది పెట్టడం సరికాదు...

- కృష్ణ

సామాన్య ప్రజల రాకపోకలకు ఆర్టీసీ బస్సులే ఆధారం. ఆర్టీసీ బస్సులను పార్టీ సభలకు పంపించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదు. సకాలంలో బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నేను ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లేందుకు గంటకు పైగా నిరీక్షించా. ఇంజిన్‌ సమస్యతో బస్సు ఆగిపోవడంతో ఇంకొక బస్సు సర్వీసు వరకు వేచిఉండాల్సి వచ్చింది.


చాలాసేపు క్యూలోనే...

- రాజు

రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లడానికి నాన్‌స్టాప్‌ కౌంటర్‌లో టికెట్‌ తీసుకునేందుకు క్యూలైనులో చాలాసేపు నిరీక్షించా. కొన్ని బస్సులు తగ్గిపోవడంతో ఏ నంబరు సర్వీసు బస్సు వస్తుందో తెలియక అది వచ్చే వరకు టికెట్లు ఇవ్వని పరిస్థితి. దీంతో కౌంటర్‌ వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తే రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్న విషయం తెెలుసుకోవాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని