logo

రాయితీ విత్తనాల ఊసేలేదు

ఎరువులు, పురుగు మందులతోపాటు రాయితీపై విత్తనాలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు.

Updated : 08 Dec 2022 04:32 IST

న్యూస్‌టుడే, సీతానగరం

గోకవరంలో మొక్కజొన్న సాగు

ఎరువులు, పురుగు మందులతోపాటు రాయితీపై విత్తనాలు ఇస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్బీకేలు నామమాత్రంగా మారాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ వరి పంట కోతలు కోసి ధాన్యం ఒబ్బిడి చేస్తూనే రబీ సాగు ప్రారంభించారు. వాస్తవానికి ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు అందించాల్సి ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో వరి, మొక్కజొన్న, తెల్లజొన్న, మినుము, పెసర విత్తనాలు అందిస్తామని చెప్పినా అందుబాటులో ఉంచలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల వద్దనే అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

రబీలోనూ అంతే విస్తీర్ణం..

డివిజన్‌ పరిధిలోని రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, అనపర్తి నియోజకవర్గాలతోపాటు గోకవరం, కడియం మండలాల్లో ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.42 లక్షల ఎకరాలుగా ఉంది. రబీలో దాదాపుగా 85 ఎకరాల్లో వరి, మొక్కజొన్న అపరాలు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వ్యవసాయశాఖ నివేదికల ప్రకారం అత్యధికంగా మొక్కజొన్న, వరి, అపరాలు ఉన్నాయి. గతంలో వరితోపాటు మొక్కజొన్న, అపరాలకు రాయితీ ఉండేది. రైతులకు అందుబాటులోకి తెచ్చిన కియోస్కో పరికరాలు, డి.కృషి యాప్‌లు నిరుపయోగంగా మారాయి. వీటిల్లో నమోదు చేసుకుంటే చాలు రైతులకు విత్తనాలు ఇస్తామనే ప్రచారం నిలిచిపోయింది. రూ.లక్షలు విలువ చేసే పరికరాలు పలు ఆర్బీకేల్లో మూలకు చేరాయి.


నీరు అందుబాటులో ఉంటే..

వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు బీకే మల్లికార్జునరావు

రబీ సాగు సమయంలో ఎత్తిపోతల నుంచి సాగునీటి సరఫరా ఉండదు. భూగర్భ జలం అందుబాటులో ఉండి, వ్యవసాయ బోర్లు, ఆయిల్‌ ఇంజిన్లు ఉన్న రైతులంతా రబీలో మొక్కజొన్న, తెల్లజొన్న విత్తుతున్నారు. నీరు అందదేమో అని భావించేవారు మినుము, పెసర అపరాలు వేసేలా భూములను సిద్ధం చేసుకున్నారు. కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లో అత్యధికంగా మొక్కజొన్న సాగు చేస్తారు. గతేడాది రబీలో వేసిన మొక్కజొన్నకు క్వింటాకు రూ.2వేలకు పైబడి ధర వచ్చింది. ఈ ఏడాది చాలా మంది రైతులు దాన్నే నమ్ముకున్నారు. 40వేల ఎకరాలకు పైబడి మొక్కజొన్న, తెల్లజొన్న సాగు ఉంటుంది. ప్రభుత్వం నుంచి రాయితీ విత్తనాలు రావడం లేదని తెలిసిన ప్రైవేటు వ్యాపారులు మొక్కజొన్న విత్తనాల ధరలు పెంచి అమ్ముతున్నారు. 4 కేజీల ప్యాకెట్‌ ధర రూ.1200-1500 మధ్య ఉంది. గతేడాది కంటే రూ.300 పెంచినట్లు రైతులు చెబుతున్నారు. గతంలో మొక్క జొన్న కిలోకు రూ.80 చొప్పున, అపరాలకు 50 శాతం రాయితీ ఉండేది. వరి, మొక్కజొన్న విత్తనాలు రాయితీపై లేవని అపరాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కోరుకొండ వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు బీకే మల్లికార్జునరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని