logo

జయహో బాలిక... భయమే లేదిక!

అవనిలో సగం ఆమె అయినప్పటికీ అడుగడుగునా అభద్రత. తమ చుట్టూ ఉన్న వారిలో ఎవరు స్నేహితులు.. ఎవరు ఆప్తులు అనేది తెలుసుకోవడంలో తడబాటు.

Published : 08 Dec 2022 03:58 IST

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

బాలికకు శానిటరీ నాప్‌కిన్లు అందిస్తున్న జయశ్రీ తదితరులు

అవనిలో సగం ఆమె అయినప్పటికీ అడుగడుగునా అభద్రత. తమ చుట్టూ ఉన్న వారిలో ఎవరు స్నేహితులు.. ఎవరు ఆప్తులు అనేది తెలుసుకోవడంలో తడబాటు. తనను తాకిన చేతి స్పర్శలోని మంచి, చెడుల తారతమ్యం తెలియక తికమక. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు అమ్మాయిలకు విజ్ఞానం కచ్చితంగా అవసరం. లయన్స్‌ క్లబ్‌ సేవల్లో భాగంగా ‘జయహో మహిళ’ పేరుతో (ఉమెన్‌ సింపోజియం) జిల్లా ఛైర్‌పర్సన్‌ నేరెళ్ల జయశ్రీ, పలువురు సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల్లోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు.
జయహో మహిళ కార్యక్రమంలో భాగంగా.. అమ్మాయిలు చదువుకునే చోట ఎదురయ్యే సమస్యలు గురించి సంబంధిత రంగాల్లో నిష్ణాతులతో అవగాహన కల్పిస్తారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో బంధువులు, స్నేహితులు, ప్రేమ పేరుతో జరిగిన వంచనలను ఉదాహరణగా వివరిస్తారు. విద్యాలయాలకు వెళ్లే దారిలో ఆకతాయిలతో ఇబ్బందులు ఎదురైతే తక్షణం ఎవరిని సంప్రదించాలో చెబుతారు. సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌, సచివాలయం, గ్రామపెద్దలు, వాలంటీర్లు వంటి ప్రభుత్వ అధికారుల సహకారం ఎలా పొందాలి... భయంతో విషయం దాచకుండా ఇంట్లో తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి వంటివి చెబుతారు.

పిల్లలకు అవగాహన కల్పిస్తున్న సీనియర్‌ న్యాయవాది పద్మావతి

విద్యాలయాలే వేదికగా...

జిల్లాలోని పి.వెంకటాపురంలోని బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకులంలో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వారికి అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఏజెన్సీలో గంగవరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలలో యుక్తవయసు బాలికలు స్వీయ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మనోవికాసం, న్యాయం, వైద్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బొమ్మూరు అంబేడ్కర్‌ పాఠశాల, పిడింగొయ్యి పాఠశాల, పండూరు ఆశ్రమ పాఠశాల, జిల్లాలోని పలు వసతి గృహాలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతినెలా రెండుచోట్ల క్లబ్‌ సభ్యులు ఓ బృందంగా వెళ్లి కార్యక్రమాలు చేపట్టి పిల్లల్లో ధైర్యం నింపుతారు.


విద్యతోనే భవిత..

- బి.పద్మావతి, సీనియర్‌ న్యాయవాది

అమ్మాయిలు విద్యలో రాణించి చక్కని భవితకు బాటలు వేసుకోవాలి. తల్లిదండ్రుల ఇష్టాలను గౌరవిస్తూ ఇష్టమైన రంగంలో విజయం సాధించేందుకు కృషి చేయాలి. క్రమశిక్షణతో ముందుకు సాగడం ద్వారా అనుకున్న గమ్యం చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమస్యలు ఎదురైనపుడు ధైర్యంగా వాటిని కన్నవారి సాయంతో అధిగమించాలి.


భద్రత అవసరం తెలుపుతూ..

- నేరెళ్ల జయశ్రీ, జిల్లా లయన్స్‌ ఉమెన్‌ సింపోజియం ఛైర్‌పర్సన్‌

మోసం చేసేవారు ప్రతి చోటా ఉంటారు. బాలికల నుంచి మహిళల వరకు ప్రతి దశలో భద్రత అవసరత ఉంటుంది. అందుకే చిన్నతనం నుంచి వారిలో ఆత్మస్థైర్యం నింపాలి. ఇంట్లో కన్నవారి నుంచి మొదలైన బాధ్యత విద్యాలయాల్లో గురువుల వరకు తీసుకోవాలి. ఈ ఏడాది మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో న్యాయవాదులు, విజ్ఞానవంతుల ద్వారా సదస్సులు నిర్వహించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని