logo

‘వైకాపా పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదు’

వైకాపా పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు.

Published : 08 Dec 2022 03:58 IST

మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కొండబాబు, వర్మ తదితరుల నిరసన

కాకినాడ నగరం: వైకాపా పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద బుధవారం తెదేపా పిలుపు మేరకు ‘ఇదేం ఖర్మ మన బీసీలకు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు తప్ప, వైకాపా పాలనలో బీసీలకు ఏం న్యాయం జరిగిందని ప్రశ్నించారు. తెదేపా హయాంలో బీసీ కార్పొరేషన్ల ద్వారా 3.75 లక్షల మందికి వ్యక్తిగత, బృంద రుణాలు అందించారని గుర్తుచేశారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ వైకాపా మూడున్నరేళ్ల పాలనలో రూ.34 వేల కోట్ల బీసీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లించారన్నారు. స్థానిక సంస్థల్లో 10 శాతం బీసీ పదవులకు కోత విధించారన్నారు. తరువాత ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ మాట్లాడుతూ వైకాపా పాలనలో ఎనిమిది వేల ఎకరాల బీసీల అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఆదరణ పథకాన్ని రద్దు చేశారని, బీసీలకు పెళ్లి కానుక దూరం చేశారని, విదేశీ విద్య అందకుండా చేశారని దుయ్యబట్టారు. బీసీ గర్జన పెట్టే హక్కు, అర్హత వైకాపాకు లేదన్నారు. అనంతరం వారు డీఆర్‌వో శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుని తెదేపా ఇన్‌ఛార్జి యనమల కృష్ణుడు, వీవై దాసు, పేరాబత్తుల రాజశేఖర్‌, పైలా సాంబశివరావు, కాకినాడ రామారావు, సీతయ్యదొర, కోడా వెంకటరమణ, వనపర్తి భద్రి, ఏవీడీ మెంటారావు, చలపతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని