logo

Sasikala: శశి‘కల’ చెదిరి..

విశాఖపట్నం పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బోగీ - ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలైన అన్నవరం యువతి ఎం.శశికళ (22) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం తీవ్ర విషాదం నింపింది.

Updated : 09 Dec 2022 10:29 IST

ఒక్కగానొక్క బిడ్డ..
ఆ పలుకే అపురూపం

ఆటపాటల్లో చురుకు..
అక్షర పథంలో మెరుపు..

మేటిగా చదవాలనే కాంక్ష..
దీటుగా ఎదగాలనే తపన..

వెళ్లి రమ్మని వెన్ను తట్టారు..
మేమున్నామని వెంటే నిలిచారు..

తడబడిన అడుగు...
తనువంతా కుదుపు...

ఘడియఘడియకూ వేదన..
గంటన్నర నరక యాతన..

బతకాలనే ఆరాటం...
బతికించాలనే పోరాటం

కర్కశ విధి.. కరుణించని క్షణమిది
అయినోళ్ల రోదన.. ఆప్తులకు వేదన

శశి‘కల’ చెదిరింది..
చదువులమ్మ కుమిలింది..

అన్నవరం, న్యూస్‌టుడే: విశాఖపట్నం పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బోగీ - ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలైన అన్నవరం యువతి ఎం.శశికళ (22) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. దువ్వాడలో ఎంసీఏ చదువుతున్న ఆమె అన్నవరం నుంచి గుంటూరు - రాయగడ రైల్లో బుధవారం ఉదయం బయల్దేరి దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దిగే క్రమంలో ప్రమాదం జరిగింది. రైల్వే రెస్క్యూ బృందం ప్లాట్‌ఫామ్‌పై దిమ్మలు తొలగించి.. ఆమెను బయటకు తీసి.. వెనువెంటనే ఆసుపత్రికి తరలించింది.

సమాచారం అందుకున్న తండ్రి కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. తన కుమార్తె పరిస్థితి చూసి గుండెలవిసేలా రోదించారు. తన కుమార్తె త్వరగా కోలుకోవాలనీ... క్షేమంగా ఇంటికి రావాలనీ... చలాకీగా ఉన్నత చదువుకు వెళ్లాలని తల్లిదండ్రులే కాదు.. కుటుంబసభ్యులు.. స్నేహితులు.. గ్రామస్థులు.. దుర్ఘటనను టీవీల్లో.. సామాజిక మాధ్యమాల్లో చూసిన వారంతా భగవంతుడిని వేడుకున్నారు. విధి చిన్న చూపు చూసింది.. ఆమెను మృత్యుఒడికి చేర్చింది.


నిన్నటి వరకు తమతోనే.. చలాకీగా ఉన్న స్నేహితురాలు శశికళ ఇక లేదని తెలిసి సహచర విద్యార్థినులు కన్నీటి పర్యంతం అయ్యారు. శశికళ 30 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిపోవడంతో స్నేహితులు భోరున విలపించారు. గురువారం ఉదయం విశాఖలోని ఆసుపత్రి వద్దకు చేరుకుని శశికళతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని తల్లడిల్లారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.


హాస్టల్‌లో  చేరేలోపే...

విశాఖలో ఆసుపత్రి వద్ద విషాదంలో కుటుంబసభ్యులు

మెరపల బాబూరావు, వెంకటలక్ష్మి ఒక్కగానొక్క కుమార్తె శశికళ. బిడ్డంటే వారికి అపురూపం. దువ్వాడలోని కళాశాలకు గత నెల 20 నుంచి తరగతులకు వెళ్తూ ప్రతి రోజు ఉదయం అన్నవరం స్టేషన్‌ నుంచి గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా రాకపోకలు సాగిస్తోంది. దువ్వాడలో హాస్టల్‌లో ఉండి చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 2020-21లో తునిలోని ఆదిత్యలో శశికళ బీసీఏ చదివింది. ఎంతో చలాకీగా ఉంటుందనీ.. బాగా చదువుతుందని కళాశాల ప్రిన్సిపల్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తమ పూర్వవిద్యార్థిని మృతితో కళాశాలలో కాసేపు మౌనం పాటించి నివాళి అర్పించారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. శశికళ మృతదేహాన్ని శుక్రవారం అన్నవరం తేనున్నారు. కడసారి చూపు కోసం కుటుంబసభ్యులు, గ్రామస్థులు, స్నేహితులు వేచి చూస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దువ్వాడ జీఆర్పీ ఎస్సై కె.శాంతారామ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని