logo

సరే అన్నారు..సరి పెట్టేశారు!

సుదీర్ఘ సాగర తీరం.. పుష్కల వనరులు.. పారిశ్రామికీకరణకు అనువైన ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.. ఇక్కడ కీలకమైన జాతీయ స్థాయి విద్యాసంస్థలు కొలువుదీరనున్నాయనే ప్రకటన ఈ ప్రాంతీయుల్లో ఆశలు రేపింది.

Updated : 19 Jan 2023 06:32 IST

కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఐఐఎఫ్‌టీ తాత్కాలిక భవనం

ఈనాడు, కాకినాడ: సుదీర్ఘ సాగర తీరం.. పుష్కల వనరులు.. పారిశ్రామికీకరణకు అనువైన ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.. ఇక్కడ కీలకమైన జాతీయ స్థాయి విద్యాసంస్థలు కొలువుదీరనున్నాయనే ప్రకటన ఈ ప్రాంతీయుల్లో ఆశలు రేపింది. ఆ కీలక సంస్థలే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ (ఐఐపీ).. ఏళ్ల కిందటే భరోసా దక్కినా మారిన పరిస్థితులతో వ్యవహారం తలకిందులైంది. ప్రకటించిన రెండు సంస్థల్లో ఐఐఎఫ్‌టీ ఇక్కడ ఏర్పాటైతే.. మరొక సంస్థ ఐఐపీ విశాఖకు తరలించేశారు. కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటైన ఐఐటీఎఫ్‌ అరకొర వసతుల అద్దె భవనంలో నడుస్తుండడంతో.. శాశ్వత ప్రాంగణంలోకి వెళ్తేనే తరగతులు, వసతి కష్టాలు తీరే వీలుంది.. అడ్డంకులు తొలగాలంటే కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు వాటా నిధులు విడుదల చేసి.. శాశ్వత భవనాల నిర్మాణం వేగవంతానికి చొరవ చూపాలి.

శాశ్వత వనరులు ఎప్పటికో..?

దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ విదేశీ వాణిజ్య సంస్థ (ఐఐఎఫ్‌టీ)- డీమ్డ్‌ విశ్వవిద్యాలయం కాకినాడ జేఎన్‌టీయూ ఆవరణలో తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేసింది. నిరుడు అక్టోబరులో ఈ ప్రాంగణాన్ని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పియూష్‌ గోయల్‌ ప్రారంభించారు. దిల్లీ, కోల్‌కతాలో మాత్రమే ఐఐఎఫ్‌టీ ప్రాంగణాలు ఉంటే.. కాకినాడలో మూడో క్యాంపస్‌ ఏర్పాటైంది. జేఎన్‌టీయూ ఐఈటీఈ భవనంలోని ఈ ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం) కోర్సు 40 మందితో ప్రారంభమైంది. ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌), ఎంఏ (ఎకనామిక్స్‌ ట్రేడ్‌ అండ్‌ ఫైనాన్స్‌) ఇతర కోర్సులు అందుబాటులోకి రావాలంటే మరికొన్నేళ్లు నిరీక్షించాల్సిందే.
* ప్రస్తుత ప్రాంగణం జేఎన్‌టీయూలో మూడు అంతస్తుల భవనంలో నడుస్తోంది. ఇక్కడి మూడు తరగతి గదులు చాలడంలేదు. ఈ భవనం జేఎన్‌టీయూతోపాటు ఓ సొసైటీ నిర్మించడంతో రెండు ఫ్లోర్లకు అద్దె చెల్లించాల్సిందే. విద్యార్థుల వసతి గదులకు భవనాల వెతుకులాటకు ఆపసోపాలు పడి ఎట్టకేలకు తిమ్మాపురంలో ఓ ప్రాంగణాన్ని అద్దెకు తీసుకున్నారు. శాశ్వత ప్రాంగణం ఏర్పాటయ్యే వరకు అద్దెల దరువు తప్పదు.

ఒక్కటే ఇచ్చారండి..

* పూర్వ సీఎం చంద్రబాబు ఐఐఎఫ్‌టీ ఏర్పాటుకు 2015లో కేంద్రాన్ని అభ్యర్థించగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో 2018లో అప్పటి కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు, చంద్రబాబు.. ఐఐఎఫ్‌టీ, ఐఐపీలకు శంకుస్థాపన చేశారు. కాకినాడ సెజ్‌ ఈ రెండు సంస్థల శాశ్వత క్యాంపస్‌ల ఏర్పాటుకు 25 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మూడేళ్లలో ఈ రెండు క్యాంపస్‌లు దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నా.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సాకారం కాలేదు. తాజాగా ఐఐఎఫ్‌టీకి ఏర్పాటుకు చొరవచూపినా.. ఐఐపీ మాత్రం విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారిక ప్రకటనతో ఈ ప్రాంతీయుల్లో నిరాశ నెలకొంది. రాజకీయ ఒత్తిళ్లతో కీలక ప్రాజెక్టు తరలిపోయింది.
* కాకినాడ సెజ్‌లో యు.కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద ఐఐఎఫ్‌టీకి 25 ఎకరాలు.. ఐఐపీకి 10 ఎకరాలు మాత్రమే కేటాయించారు. ఈ భూములకు ప్రత్యామ్నాయంగా మరోచోట సెజ్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇక్కడ ఐఐఎఫ్‌టీ ఎకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు, ఆడిటోరియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఇతర శాశ్వత నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.115 కోట్లు  మేర వాటా నిధులు ఇవ్వాలి. దీనికి అదనంగా మరో రూ.40 కోట్లు కేంద్రం సమకూర్చాలి. ప్రాథమికంగా రూ.50 కోట్లు కేంద్రం మంజూరు చేసిందనే ప్రచారం సాగినా.. లిఖితపూర్వక సంకేతాలేమీ దిగువ స్థాయికి చేరలేదు. క్షేత్రస్థాయి పనుల్లోనూ కదలిక లేక అయోమయం నెలకొంది.

శాశ్వత ప్రాంగణం నిర్మిస్తే మేలు

కాకినాడ జేఎన్‌టీయూ తాత్కాలిక భవనంలో ఐఐఎఫ్‌టీలో ఐపీఎం తరగతులు మొదలయ్యాయి. తిమ్మా
పురంలో 25 గదుల అద్దె భవనంలో హాస్టల్‌ నిర్వహిస్తున్నాం. విద్యాసంస్థ శాశ్వత భవనాలకు 25 ఎకరాలు కేటాయించారు. శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించి.. పనులు చేపట్టాలి. తాత్కాలిక భవనంలో మూడు తరగతి గదులు ఉన్నాయి. కొత్త కోర్సు ప్రారంభించాలంటే అదనపు వసతి అవసరం.
రవీంద్రసారథి, సెంటర్‌ హెడ్‌, ఐఐఎఫ్‌టీ, కాకినాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని