logo

మేలుకోరండి.. మేలుకొనండి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏటా ఖరీఫ్‌ ధాన్యం దిగుబడిలో 90 శాతం మేర కొనేవారు. ఈసారి లక్ష్యాలను తగ్గించి.. 70 శాతమే సేకరించాలని నిర్ణయించారు.

Published : 20 Jan 2023 04:14 IST

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌, ముమ్మిడివరం, పి.గన్నవరం

ముమ్మిడివరం: సూరాయిచెరువు వద్ద నెల రోజులుగా కళ్లంలో

ఉన్న ధాన్యం బస్తాల వద్ద రైతు వెంకటేశ్వరరావు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏటా ఖరీఫ్‌ ధాన్యం దిగుబడిలో 90 శాతం మేర కొనేవారు. ఈసారి లక్ష్యాలను తగ్గించి.. 70 శాతమే సేకరించాలని నిర్ణయించారు. వాస్తవంగా ఖరీఫ్‌లో 10 లక్షల టన్నులు కొనాల్సి ఉన్నా కుదించారు. ఇంకా రైతుల వద్ద 2 లక్షల టన్నులపైగా నిల్వలు ఉన్నాయి. వీటిని కనీస మద్దతు ధరకు కొనకుండా ఆర్బీకేలను మూస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవంగా ఫిబ్రవరి వరకు కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలి. కొన్ని ప్రాంతాల్లో కుప్పలు వేశారు. వచ్చేనెలలో గానీ నూర్పిళ్లు చేయరు. ఈ ధాన్యాన్ని ఎవరికి అమ్మాలని రైతులు వాపోతున్నారు. కళ్లాలు, ఇళ్ల వద్ద వీటిని నిల్వ చేసి కాపాడుకోలేక అల్లాడుతున్నారు. కొనుగోలు కేంద్రాలను మూయకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనాలని కోరుతున్నారు.

పి.గన్నవరం: కొనుగోలు చేయని ధాన్యం చూపిస్తున్న రైతు సత్యనారాయణ


ముమ్మిడివరం మండలంలో 7,506 ఎకరాల వరి విస్తీర్ణం ఉంటే... ఖరీఫ్‌లో 2,208 ఎకరాలే సాగైంది. 4,140 టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు.
ఇప్పటికి 1,459 టన్నులే కొన్నారు. ప్రస్తుతం ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు ఆపేశారు. కళ్లాల్లో ధాన్యం ఎవరికి అమ్మాలా అని రైతులు తల్లడిల్లుతున్నారు.


తూర్పుగోదావరి: ప్రస్తుతం కొనుగోలు లక్ష్యం ఇంకా మిగిలి ఉండడంతో అక్కడ అన్ని కేంద్రాల్లోనూ ధాన్యం కొంటున్నారు. నిర్దేశిత లక్ష్యం దాదాపు పూర్తవగా ధాన్యం సేకరణలో నిర్లిప్తత నెలకొంది. మెట్టలో కొన్నిచోట్ల వేల టన్నుల ధాన్యం నిల్వలు, కొన్నిచోట్ల కుప్పలపై ధాన్యం ఉంది.


కాకినాడ: కాజులూరు, తాళ్లరేవు, పెదపూడి, కరప, కాకినాడ గ్రామీణం, సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో కొనుగోళ్ల లక్ష్యం పూర్తయిందని, ఆర్బీకేలను మూసేశారు. ఇంకా ఈ మండలాల రైతుల వద్ద వేల టన్నుల ధాన్యం నిల్వలు పేరుకున్నాయి.


డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ: జిల్లాలో 92 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తవగా సేకరణ నిలిచిపోయింది. వీటి పరిధిలో రైతుల వద్ద టన్నుల కొద్దీ ధాన్యం నిల్వలున్నాయి. బహిరంగ మార్కెట్‌లో అమ్ముదామంటే 75 కేజీల బస్తాకు రూ.200 తగ్గించి కొంటున్నారు.


పక్క రాష్ట్రాల ధాన్యం వచ్చేస్తోంది..

ఒడిశా, చత్తీస్‌గఢ్‌ నుంచి ఉమ్మడి జిల్లాలో కొందరు మిల్లర్లు ధాన్యం సేకరిస్తున్నారు. అక్కడ తక్కువ ధరకు కొని, వాటిని ఇక్కడికి తరలిస్తున్నారు. మధ్యవర్తుల సాయంతో కొందరు సిబ్బంది సహకారంతో ఆర్బీకేల్లో ఆ ధాన్యం విక్రయించి కనీస మద్దతు ధర రూపంలో ఎక్కువ సొమ్ము పొందుతున్నారనే సమాచారంతో పౌర
సరఫరాల సంస్థ అప్రమత్తమైంది. అందుకే కొనుగోళ్లు ఆపారని తెలుస్తోంది. ఇక్కడి రైతుల ధాన్యం టన్నుల కొద్దీ ఉన్నా...  పక్క రాష్ట్రాల ధాన్యం సాకుతో ఇక్కడి నిల్వలు కొనడంలేదు. క్షేత్రంలో రైతుల వద్ద ధాన్యం పరిశీలించి.. అధ్యయనం చేసి, ఆర్బీకేల్లో కొంటేనే రైతుకు మద్దతు ధర దక్కేది.


20 సెంట్లలో పండిన ధాన్యమూ కొనలేదు

నాకు 20 సెంట్లు (2 కుంచాలు) సొంత మాగాణి ఉంది. అతి సామాన్య రైతుని. ఖరీఫ్‌ సాగు చేస్తే 7 బస్తాలు ధాన్యం పండింది. సొసైటీ, ఆర్‌బీకే చుట్టూ నాలుగు సార్లు తిరగ్గా సంచులు ఇచ్చారు. పట్టుబడి పట్టి తూకం తూచి నెలా పదిహేను రోజులు గడుస్తోంది. బస్తాలపై బరకాలు కప్పి కాపాడుతున్నా.

సత్యనారాయణ, నరేంద్రపురం (పి.గన్నవరం)


కళ్లంలోనే.. 1.6 ఎకరాల పంట

1.6 ఎకరాలు దేవుడి మాన్యం కౌలుకు సాగు చేస్తున్నా.. పంట ఒబ్బిడి చేసి నెలపైగా గడిచింది. ధాన్యం తూకం కోసం ఆర్బీకే చుట్టూ తిరుగుతున్నా.. మొదట్లో సంచులు రాలేదన్నారు. తర్వాత కొనడం లేదన్నారు. ఇలా మా కళ్లంలో దేవాదాయ శాఖకు చెందిన 6 ఎకరాల వరి చేలో పంట రాశులుగా ఉంది. ఈ ధాన్యం కొనకపోతే.. కిస్తీ ఎలా కట్టాలి. రబీకి పెట్టుబడి ఎలా పెట్టాలి.?

శ్రీనివాసరావు, సూరాయిచెరువు, ముమ్మిడివరం


నెల కావస్తున్నా.. కదల్లేదంతే

ఇదిగో 60 బస్తాల ధాన్యం తూచి నెల రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు తీసుకెళ్లలేదు. ఆర్‌బీకే చుట్టూ తిరుగుతుంటే.. దళారులకు అమ్ముకోమని సలహా ఇస్తున్నారు. బస్తాలను ఎలుకలు కొట్టేయడంతో నష్టం వాటిల్లుతోంది. ధాన్యం మిల్లుకు వెళ్లిన తర్వాత గానీ విక్రయించినట్లు నమోదు కాదు. ఎప్పుడు వెళ్తుంది..? ఎప్పుడు డబ్బులు వస్తాయి..? మరో వైపు రబీ సాగుకు పెట్టుబడుల కోసం కొత్త అప్పులు చేస్తున్నాం. ఇలా అయితే ఎలా..?

వెంకటేశ్వరరావు, సూరాయిచెరువు, ముమ్మిడివరం


రైతుల చెంత ఉత్పత్తులు కొంటాం..

జిల్లాలో 2.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం లక్ష్యం కాగా.. ఇప్పటికి 2.48 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నాం. 239 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగు
తున్నాయి. లక్ష్యం చేరుకున్నా.. ఇంకా రైతుల వద్ద ధాన్యం ఉంటే కొనడానికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. రైతులు అధైర్యపడాల్సిన
పని లేదు.

ఆర్‌.తనూజ, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌, తూర్పుగోదావరి జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని