logo

ఉపకార వేతనమని.. ఊడ్చేశాడు..

గుర్తుతెలియని వ్యక్తి గ్రామ వాలంటీరును అడ్డం పెట్టుకుని ఓ విద్యార్థికి ఫోన్‌ చేసి రూ.18 వేలు కాజేసిన ఘటన ఇది.

Published : 22 Jan 2023 05:19 IST

కాట్రేనికోన: గుర్తుతెలియని వ్యక్తి గ్రామ వాలంటీరును అడ్డం పెట్టుకుని ఓ విద్యార్థికి ఫోన్‌ చేసి రూ.18 వేలు కాజేసిన ఘటన ఇది. బాధితుడి వివరాల ప్రకారం.. కాట్రేనికోన మండలంలోని పెనుమల్లకు చెందిన బడుగు దినేష్‌కుమార్‌ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి ఒక ఏడాదికే ప్రభుత్వ ఉపకార వేతనం వచ్చింది. ఈ నెల 20న ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను ఉన్నతాధికారినని 88087 25363 నంబరు నుంచి ఫోన్‌ చేశాడు. గ్రామ వాలంటీరును కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని ఉపకార వేతనం రాని విషయంపై ఆరా తీశాడు. ఫోన్‌పే ద్వారా కొంత మొత్తం చెల్లిస్తే.. ఆ నగదుతోపాటు స్కాలర్‌షిప్‌ మొత్తం వస్తుందనగా.. విడతల వారీగా రూ.18,833 చెల్లించాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి నంబరుకు ఫోన్‌ చేయగా కలవలేదు. వాలంటీరుకు తెలిపినా ఆమె స్పందించలేదు. గుర్తుతెలియని వ్యక్తి, గ్రామ వాలంటీరు కలసి తనను మోసంచేసి నగదు కాజేశారని దినేష్‌కుమార్‌ కాట్రేనికోన పోలీసుస్టేషను, ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ మోసంపై ఎంపీడీవో కామేశ్వరరావు మాట్లాడుతూ ఆ వ్యక్తి తాను ఈడీనని అనడంతో వాలంటీరు నమ్మారని, విషయం పోలీసులకు తెలిపానన్నారు. ఇలాంటివి నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని