logo

అందని ఆసరా

ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను 4 దఫాలుగా నేరుగా మీ చేతికి అందిస్తాం..

Updated : 25 Jan 2023 05:24 IST

డ్వాక్రా మహిళల ఎదురుచూపు

కోరుకొండలో సంఘ సభ్యుల సమావేశం

న్యూస్‌టుడే, సీతానగరం, బొమ్మూరు: ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను 4 దఫాలుగా నేరుగా మీ చేతికి అందిస్తాం..అంతేకాదు మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ డబ్బును మేమే బ్యాంకులకు అక్కచెల్లెమ్మల తరపున కడతాం..

అధికారంలోకి వస్తే అక్కచెల్లెళ్లకు తోడుంటానని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఇచ్చిన హామీలు అమలుకావడం లేదు. డ్వాక్రా సంఘాల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని చెప్పి 2019 మార్చి 11న తేదీలు సైతం ప్రకటించారు. అనంతరం రెండు విడతల నిధులిచ్చి మూడో విడత నిలిపివేశారు. 2020 సెప్టెంబరు, 2021 అక్టోబరులో ‘ఆసరా’ పేరుతో రుణమాఫీ మొత్తాన్ని డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమచేశారు. మూడో విడత నిరుడు సెప్టెంబరు, అక్టోబరులో ఇవ్వాల్సి ఉండగా, ఏడాది మారినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల మహిళా సంఘాల సభ్యుల నుంచి సంఘ మిత్రలు వేలిముద్రలు సేకరించారు. ఆసరా అందాల్సిన మొత్తం, సభ్యుల జాబితాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. నిధుల విడుదలపై ఇంతవరకు స్పష్టత లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 87,854 మహిళా సంఘాలు బ్యాంకుల్లో సుమారుగా రూ.3,000 కోట్లు రుణాలు పొందాయి. ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో ఆసరా పథకం కింద ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రెండు విడతల్లో రూ.1,577 కోట్లు సంఘాల ఖాతాల్లో జమచేశారు. గతేడాది సెప్టెంబరులో మూడో విడత 8,78,540 మందికి సుమారుగా రూ.750 కోట్లు జమచేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఆ నిధులు జమచేయలేదు. ఈ ఏడాది సెప్టెంబరులోనే మరో రూ.750 కోట్లు జమచేయాల్సి ఉంది.

రుణమాఫీ ప్రకటించిన తేదీకి కొన్ని సంఘాల్లోని సభ్యులంతా సమానంగా బ్యాంకు రుణం తీసుకున్నారు. అలాంటి వారు సొమ్ము సమానంగా పంచుకున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా సంఘాల్లో అవసరం ఉన్న కొందరే రుణం తీసుకున్నారు. అలాంటి సంఘాల్లో ఆసరా సొమ్మును సమానంగా పంపిణీ చేయాలని రుణం లేని వారంతా పట్టుబడడంతో ఆయా సంఘాల్లో విభేదాలు వెలుగుచూస్తున్నాయి. నిర్ణయం ఏదైనా సంఘంలోని మెజారిటీ సభ్యులే తీసుకోవాలని మహిళా సంఘాలకే వదిలిపెట్టడంతో అప్పట్లో సమస్య తలెత్తింది.


ఎదురుచూస్తున్నాం

నాలుగు విడతలుగా రుణమాఫీ సొమ్ములో మొదటి రెండు విడతలు వేశారు. నిరుడు అందాల్సిన మూడో విడత సొమ్ము కోసం డ్వాక్రా సంఘాల్లోని సభ్యులంతా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మూడో విడతతోపాటు సెప్టెంబరులో నాలుగో విడత సొమ్ము వేయాలి. రుణమాఫీ సొమ్ముపడితే ప్రస్తుతం ఉన్న రుణానికి జమచేసుకోవడం వల్ల వడ్డీ కలిసొస్తుంది. సభ్యుల అవసరాలు తీర్చుకోవచ్చు.

కురియాల కస్తూరి, డ్వాక్రా సంఘాల జిల్లా ఉపాధ్యక్షురాలు


ఈ నెలాఖరుకు జమ

ఆసరా పథకం కింద విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే 2020-21 సంవత్సరాల్లో రెండు విడతల నగదు జమ అయ్యింది. మూడో విడత నిరుడు పడాల్సి ఉంది. ప్రస్తుతం అర్హుల జాబితా సిద్ధం చేసి నివేదికలు అందించాం. ఈ నెలాఖరుకు ఆసరా వేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.  

ఎస్‌.సుభాషిణి, పీడీ, డీఆర్‌డీఏ

Read latest East godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు