logo

వందేమాతరం.. పలికే అందరం

జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో తొలి సారిగా గణతంత్ర వేడుకలు గురువారం జరిగాయి.

Updated : 27 Jan 2023 06:18 IST

మంత్రి వేణు, కలెక్టర్‌ మాధవీలత తదితరుల జెండా వందనం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, వి.ఎల్‌.పురం: జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో తొలి సారిగా గణతంత్ర వేడుకలు గురువారం జరిగాయి. చారిత్రక నగరిలో ఆర్ట్స్‌ కళాశాల మైదానం వేదికగా వేడుకలు అంబరాన్నంటాయి. దేశంలో వెయ్యేళ్లకు పైగా విచ్ఛిన్నం కాని మూడు నగరాలు వారణాసి, పాటలీపుత్ర(పట్నా), రాజమహేంద్రవరం కావడం విశేషమని, వాటిలో పుణ్యనది గోదావరి పరివాహక ప్రాంతమైన ప్రాచీన నగరం రాజమహేంద్రవరం ఉండడం గర్వకారణమని కలెక్టర్‌ మాధవీలత ప్రకటించారు. వేడుకల్లో భాగంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేశారు. శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు. జిల్లా ప్రగతిని వివరించారు.

జిల్లా సర్వతోముఖాభివృద్ధి

జిల్లా ప్రగతిపై కలెక్టర్‌ మాట్లాడుతూ....  వైయస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కార్యక్రమం కింద జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 1.34 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.435.45 కోట్ల సాయాన్ని అందించామన్నారు.

ట్రిప్స్‌ పాఠశాల విద్యార్థుల పిరమిడ్‌ విన్యాసం

* జిల్లాలో 2,30,858 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జగనన్న తోడు పథకంలో 22 వేల మంది చిరు వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున  రుణాలు అందించామన్నారు.

* 12,181 మంది కుల వృత్తిదారులకు రూ.22.12 కోట్లు, ఈబీసీ నేస్తం 16,218 మంది లబ్ధిదారులకు 24.32 కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు. కాపు నేస్తంలో 29,824 మంది మహిళలకు రూ.44.73 కోట్లు, చేనేత కార్మికులకు రూ.7.92 కోట్లు అందించామన్నారు.

* అమ్మఒడి కింద 1,24,011 మందికి రూ.244.86 కోట్లు జమ చేశామన్నారు. జూనియర్‌ కళాశాలల్లో రూ.271 కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.470 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 ఎంబీబీఎస్‌ మెడికల్‌ సీట్లు 2023-24 నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు.

* ఉగాది నాటికి 6,319 ఇళ్లను ప్రవేశానికి సిద్ధం చేస్తున్నామన్నారు.

వేదికపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు

* జిల్లాలో 1331 కిలోమీటర్లు రహదారులు ఉండగా, 75 పనులకు రూ.365.42 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో హేవలాక్‌ వంతెనను రూ.12 కోట్ల నిధులతో పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు.

సాంస్కృతిక సౌరభం

పలు పాఠశాలల విద్యార్థులు దేశ భక్తిని చాటేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. గాంధీపురం-2 నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, శ్రీగౌతమి, సూర్యదీప్‌, ఫ్యూచర్‌ కిడ్స్‌, ట్రిప్స్‌, దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, అనంతపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, జీటీడబ్ల్యూఏ ట్రైబల్‌ వెల్ఫేర్‌ వసతి గృహం విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ట్రిప్స్‌ పాఠశాల విద్యార్థుల ప్రదర్శన ప్రథమ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ వసతిగృహ విద్యార్థుల ప్రదర్శన ద్వితీయ, దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రదర్శన తృతీయ బహుమతికి ఎంపిక కాగా విజేతలకు కలెక్టర్‌, ఎంపీ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. గాంధీపురం-2 నగరపాలక సంస్థ పాఠశాల, అనంతపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

హాజరైన అతిథులు..

వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్‌ మాధవీలత హాజరవ్వగా, విశిష్ఠ అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీహెచ్‌ శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీబీ ఛైర్మన్‌ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. అధికారులు జేసీ తేజ్‌ భరత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఆర్డీఓ చైత్ర వర్షిణి, అదనపు ఎస్పీ ఎం రజనీ, స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు.


ఆకట్టుకున్న శకటాలు

జిల్లాలో ఆయా శాఖల పరిధిలో ప్రగతిని వివరిస్తూ శకటాల రూపంలో ప్రదర్శించారు.



 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని