logo

ఆగుతూ.. సాగుతూ..

జాతీయ రహదారి-216  పనులు నత్తనడకన సాగుతున్నాయి. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు విస్తరించిన ఈ రహదారి విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా పాశర్లపూడి నుంచి దిండి వరకు తాటిపాక, రాజోలు, శివకోటి మీదుగా రెండు వరుసల రహదారిగా చేపట్టారు.

Published : 27 Jan 2023 05:31 IST

దిండిలో వశిష్ఠ వారధి వద్ద నిర్మాణంలో జాతీయ రహదారి

మలికిపురం, రాజోలు, న్యూస్‌టుడే: జాతీయ రహదారి-216  పనులు నత్తనడకన సాగుతున్నాయి. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు విస్తరించిన ఈ రహదారి విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా పాశర్లపూడి నుంచి దిండి వరకు తాటిపాక, రాజోలు, శివకోటి మీదుగా రెండు వరుసల రహదారిగా చేపట్టారు. నాలుగో ప్యాకేజీగా రూ.132 కోట్ల అంచనా వ్యయంతో 20.800 కిలోమీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 2017లో అగ్రిమెంట్‌ జరిగి నెమ్మదిగా పనులు ప్రారంభమయ్యాయి. మంజూరైన విధంగా పనులు చేపడితే తాటిపాక, రాజోలు, శివకోటి ప్రాంతాల్లో ఇళ్లకు, దుకాణాలకు భారీగా నష్టం జరుగుతుందని, బైపాస్‌ రహదారిగా దారి మళ్లించి తమకు నష్ట తీవ్రతను తగ్గించాలని ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఎట్టకేలకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల మొర విని పాశర్లపూడి నుంచి శివకోటి వరకు బైపాస్‌ రహదారిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. జాతీయ రహదారి-216 దాదాపు తీర ప్రాంతం నుంచి విస్తరించడంతో  రవాణాకు ఇది ముఖ్య రహదారిగా ఉపయోగపడుతుంది. ఓ పక్క బైపాస్‌ రహదారి పనులు పూర్తికాక, ప్రస్తుతం ఉన్న రహదారి పరిస్థితి బాగలేక ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భూసేకరణకు ఆటంకం

మామిడికుదురు, రాజోలు, మలికిపురం మండలాల్లో రహదారి విస్తరణకు అవసరమైన భూమిని రైతుల నుంచి సేకరించినా ఇప్పటికీ భూసేకరణ సమస్యలు పనులకు ఆటంకంగా మారాయి. శివకోటిలో భూ సేకరణకు రైతులు సహకరించకపోవడంతో 3 కిలోమీటర్ల పైబడి పనులకు అడ్డంకి ఏర్పడింది. దీనిపై అధికారులు తరచూ రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నా నష్టపరిహారం విషయం కొలిక్కి రాలేదు. బి.సావరంలో  నష్టపరిహారం మరింత పెంచాలని  రైతులు పట్టుబడుతున్నారు. రహదారి అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో మట్టి అవసరం కావడంతో తీవ్ర జాప్యం నెలకొంది.

వంతెనలు, కల్వర్టు నిర్మాణాల్లోనూ జాప్యమే..

పాశర్లపూడి నుంచి దిండి వరకు బైపాస్‌ రహదారిని అనుసంధానించేందుకు పంట కాలువలు, మురుగు కాలువలపై 16 స్లాబ్‌, బాక్స్‌ కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. వీటిలో పది నిర్మాణాలు పూర్తవ్వగా ఇంకా 6 వంతెనల పనులు ప్రారంభం కాలేదు. 22 మైనరు కల్వర్టులు నిర్మించాల్సిఉండగా 15 పూర్తయ్యాయి. ఇంకా మరో ఏడు కట్టడాలు ప్రారంభమవ్వలేదు. ఇవి ఎంత కాలానికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉంది.

మే నెలాఖరుకు పూర్తి..

జాతీయ రహదారి 216 నాలుగో ప్యాకేజీలో పాశర్లపూడి-దిండి బైపాస్‌ రహదారిని రానున్న మే నెలాఖరుకల్లా పూర్తి చేయడానికి కృషి జరుగుతోంది. కొవిడ్‌ కారణాలతో పనులు నిలిచిపోవడంతో 2023 మే వరకు నిర్మాణ పనుల కాలాన్ని పెంచుతూ అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు  సుమారు 40 శాతం వరకు పూర్తయ్యాయి. భూసేకరణ సమస్యలు పరిష్కారమైతే మిగిలిన పనులను వేగంగా పూర్తవుతాయి. దీనికి జేసీ, రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.  రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం విషయం  పదిహేను రోజుల్లో కొలిక్కి వస్తుంది.

- పురుషోత్తమరాజు, ఏఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని