logo

మరువ జాలగలమా.... మన సత్యను

గోదారీ గట్టుంది. గట్టుమీన చెట్టుంది.. చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్టమనసులో ఏముంది..? అని సాగిన ‘మూగమనసులు’ చిత్రంలోని పాట గోదారోళ్ల మనసుల్ని హత్తుకుంది.

Updated : 28 Jan 2023 03:12 IST

గోదావరి తీరంలో మూగమనసులు చిత్రీకరణ వేళ

గోదారీ గట్టుంది. గట్టుమీన చెట్టుంది.. చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్టమనసులో ఏముంది..? అని సాగిన ‘మూగమనసులు’ చిత్రంలోని పాట గోదారోళ్ల మనసుల్ని హత్తుకుంది. 60వ దశకంలోనే అపూర్వ అభియనంతో నటి జమున తూర్పు ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేశారు. భామనే.. సత్య భామనే.. అని పెద్దపెద్ద కాటుక కనులతో అభిమానులను ఉర్రూతలూగించినా.. చక్కటి హావభావాలతో అందాలొలికిస్తూ ప్రేక్షకులను అలరించినా.. ఆ సౌందర్యరాశి సొంతం. మీరజాలగలడా.. నా యానతి అని వన్నెలొలికిన తెలుగు తెర సుందరి.. ఇక లేరని తెలిసి.. మరువ జాలగలమా మన సత్యను అని తూర్పున ప్రతి మది స్మరిస్తోంది.


చల్లని నీడ

మాధవపట్నంలోని జమున నగర్‌ 

సామర్లకోట గ్రామీణం: ఎంపీగా ఉన్న జమునను.. తోలుబొమ్మలాట కళాకారులు మాధవపట్నం పిలిచి సత్కరించారు. సొంతగూడు లేక తల్లడిల్లుతున్న వారి వేదన చూసి చలించిన ఆమె ఇళ్ల స్థలాల కొనుగోలుకు ఎంపీ నిధులు విడుదల చేశారు. మొదట చూసిన స్థలం గ్రామానికి దూరంగా ఉందని చెప్పగా.. ఆమె స్థానికంగా మూడు రోజులు పరిశీలించి అనువైన స్థలాన్ని గుర్తించారు. ఇందుకు ఎంపీ నిధులు చాలకపోవడంతో సొంత డబ్బు సమకూర్చి 7.5 ఎకరాలు కొని.. ఒక్కో కుటుంబానికి 3 సెంట్ల చొప్పున 274 కుటుంబాలకు స్థలాలు ఇచ్చారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.500 సాయం చేశారని.. కాలనీవాసులు గుర్తు చేసుకొన్నారు. ఇళ్లు కట్టాక కాలనీకి ఆమె పేరు పెట్టడానికి ప్రతిపాదిస్తే అంగీకరించలేదనీ.. పలుమార్లు బతిమాలాక ఆమె అంగీకారంతో ‘జమున నగర్‌’గా నామకరణం చేశామన్నారు.


తూరుపు నుంచే తొలి అడుగు..

జమునను సత్కరిస్తున్న పీఠాధిపతి

రాజమహేంద్రవరం సాంస్కృతికం:  జమున రంగస్థల కళాకారిణిగా గుర్తింపు పొందుతున్న వేళ  రాజమహేంద్రవరం వాసి డాక్టర్‌ గరికపాటి రాజారావు ఆమెకు తొలిసారిగా పుట్టిల్లు చిత్రంలో నటిగా అవకాశం కల్పించారు. అలా.. ఆమె చిత్రసీమకు తూరుపు నుంచే పరిచయమయ్యారు.

ఈ ప్రాంతంలో మూగమనసులు, తాసిల్దారు గారి అమ్మాయి, మిలన్‌ (హిందీ) చిత్రీకరణ జరుపుకొన్నాయని నటుడు శ్రీపాద జిత్‌మోహన్‌మిత్రా పేర్కొన్నారు.

* సర్వేజన సుఖినోభవంతు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మనగుడి - మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవాపురస్కార్‌ - 2016 పేరుతో నటి జమునను కళాతపస్విని బిరుదుతో సత్కరించగా... చక్కటి ఆధ్యాత్మిక ప్రసంగంతో జమున భక్తిభావన చాటారని మహాలక్ష్మీ పీఠం పీఠాధిపతి చినవెంకన్నబాబు వివరించారు.  


నటనకు  ప్రోత్సాహం

ద్రాక్షారామలో ప్రసంగిస్తూ...

రామచంద్రపురం, ద్రాక్షారామ: జమున.. 1979లో ఆంధ్రప్రదేశ్‌ రంగస్థల వృత్తికళాకారుల సమాఖ్య ద్రాక్షారామ శాఖను ఏర్పాటు చేసి.. నాటక కళాపరిషత్‌ ప్రతినిధులు నాగిరెడ్డి సత్యనారాయణ, శృంగారం వెంకట అప్పలాచార్యర్‌ సమన్వయంతో ఈ ప్రాంత కళాకారులకు సేవలు అందించారు. కళాకారులకు ఉపకరించేలా ఆడిటోరియం నిర్మాణానికి 1000 గజాల స్థలాన్ని దాత వెంకటరత్నం ఇవ్వగా.. ఆ స్థలాన్ని సమాఖ్య కార్యకలాపాల నిర్వహణకు దానపట్టా రాయడంతో జమునకు బంధం మరింత బలపడింది. 2010లో రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలకు విచ్చేయగా.. సినీనటి సరోజ, గ్రామ పెద్దలు ఆమెను సన్మానించారు.


నా పుట్టిల్లు.. రాజమహేంద్రి..

ఆనందనగర్‌ మున్సిపల్‌ పాఠశాల

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, టి.నగర్‌: జమునకు గోదావరి జిల్లాలతో సినీ అనుబంధమే కాక.. ప్రజాప్రతినిధిగానూ ఇక్కడ సేవ చేశారు. 15 సినిమాల చిత్రీకరణకు ఆమె ఇక్కడకు విచ్చేయగా.. ఈ ప్రాంతంతో బంధం బలపడింది. 1989లో కాంగ్రెస్‌ తరఫున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు జమున పోటీచేసి 58,322 ఓట్ల మెజార్టీతో తెదేపా అభ్యర్థి చుండ్రు శ్రీహరిపై గెలిచారు. ఎన్నికల ప్రచారంలో జమున స్థానికేతరురాలు  అనే వాదన రాగా.. ‘‘మూగమనసులు సినిమాలో గోదారి గట్టుంది పాటలో నటించా. నేనూ మీ ఇంటి ఆడపడుచునే. రాజమహేంద్రవరంవాసి రాజారావు నిర్మించిన పుట్టిల్లు సినిమాలోనే నేను తొలిగా నటించా.. ఈ ప్రాంతం నా పుట్టిల్లు అని’’ దీటుగా బదులిచ్చారు. జమున ఎంపీగా ప్రారంభించిన రాజమహేంద్రవరం ఆనందనగర్‌లోని మున్సిపల్‌ పాఠశాలను నేటికీ జమున స్కూలు అంటారు. 1991లో మధ్యంతర ఎన్నికలు రాగా.. తెదేపా అభ్యర్థి కె.వి.ఆర్‌.చౌదరిపై ఓడిపోయారు. ఎన్టీఆర్‌ను ఎదుర్కొనే నాయకురాలు కావాలనే ఇందిరాగాంధీ ఆహ్వానంతో రాజకీయ ప్రవేశం చేసిన జమున.. ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ మాట్లాడినా.. ఏరోజూ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎన్టీఆర్‌పై ఉన్న గౌరవమే ఇందుకు కారణమని పలు ముఖాముఖిల్లో ఆమె వెల్లడించారు. తర్వాత రాజకీయాలకు దూరమైనా.. రాజమహేంద్రవరంలో కార్యక్రమాలకు హాజరయ్యేవారు.  


అక్షర వెలుగుకు చేదోడు

గాంధీనగర్‌: రంగస్థల కళాకారిణిగా, సినీ నటిగా కాకినాడ వాసులకు జమున సుపరిచితురాలు. ఆమె రాష్ట్ర కళాకారుల సంఘ అధ్యక్షురాలిగా ఉండగా.. కాకినాడ పట్టణ సంఘం అధ్యక్షురాలు వై.అమ్మాణిబాయితో ఆమెకు అనుబంధం ఉండేది. అమ్మాణీబాయి.. అక్కినేని నాగేశ్వరరావుకు సైతం గురువు కావడంతో ఆమెతో మాట్లాడేవారు. కాకినాడ పీజీ సెంటర్‌ అభివృద్ధికి 1977లో సూర్యకళామందిర్‌లో శ్రీకృష్ణ తులాభారం నృత్య నాటిక ప్రదర్శించారు. దీనికి సుమారు రూ.లక్ష వసూలైనట్లు పీజీ సెంటర్‌ పూర్వ విద్యార్థుల సంఘ కార్యదర్శి సూరిబాబు పేర్కొన్నారు వార్ఫురోడ్డు ప్రాంతంలో బంధువులు ఉండటంతో జమున తరచూ వచ్చేవారు.


గోదావరి పుష్కరాల్లో తర్పణం..

జమున కుటుంబ సమేతంగా 2015లో గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం వచ్చారు. ఇక్కడి పుష్కర ఘాట్‌ను సందర్శించి పెద్దలకు తర్పణం వదిలారు. లోకాన్ని వీడిన తన కుటుంబ సభ్యులతోపాటు..ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, ఎస్వీఆర్‌, రేలంగి, కన్నాంబ, కాంచనమాల, ఇలా దివంగతులైన తోటి నటులకు, రాజకీయ నాయకులకు పవిత్ర గోదావరిలో తర్పణం వదిలానని ఆమె వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు