logo

ఏలేరు జలం... కావాలి సద్వినియోగం

మెట్ట రైతుల బాంధవి ఏలేరు జలాశయం. ఏలేశ్వరంలోని ఈ రిజర్వాయరు ఇటు సాగుకు, అటు విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తోంది.

Published : 28 Jan 2023 03:05 IST

న్యూస్‌టుడే, ఏలేశ్వరం

ఏలేశ్వరంలోని జలాశయం

మెట్ట రైతుల బాంధవి ఏలేరు జలాశయం. ఏలేశ్వరంలోని ఈ రిజర్వాయరు ఇటు సాగుకు, అటు విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తోంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు (24.11 టీఎంసీలు). రిజర్వాయర్‌ నుంచి రెండు పంటలకు 12 టీఎంసీలు, విశాఖ అవసరాలకు ఆరు టీఎంసీల జలాలను అందజేస్తారు. మరో ఆరు టీఎంసీలను డెడ్‌ స్టోరేజీగా ప్రాజెక్టులోనే ఉంచేస్తారు. పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 60 వేల ఎకరాలకు ఈ జలాశయం నుంచి సాగునీరు సరఫరా అవుతోంది. ఖరీఫ్‌లో పూర్తిస్థాయిలో పంటలకు నీటిని అందజేసిన అధికారులు గత నెల పదో తేదీ నుంచి రబీకి జలాల విడుదల ప్రారంభించారు. రెండో పంటకు నీటి సరఫరా ప్రారంభించిన సమయంలో రిజర్వాయర్‌లో 85.03 మీటర్ల స్థాయిలో 21.06 టీఎంసీల జలాలు ఉన్నాయి. కాలువలు సరిగా లేనందున నీరు శివారు పొలాలకు వెళ్లడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించాల్సి ఉంది.

కాలువల పరిస్థితి ఇలా..

ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని అందించే ప్రధాన కాలువ యర్రవరం వద్ద అస్తవ్యస్తంగా ఉంది. ఎవరూ దీని ఆధునికీకరణ ఊసే ఎత్తకపోవడంతో సాగునీరు సక్రమంగా ప్రవహించడం లేదు. నిర్ధారిత ఆయకట్టుకి సరాసరి వెళ్లాల్సిన నీరు గోతుల్లో ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. పెద్దాపురంలోని వైఏ డివిజన్‌ నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు సాగుకు నీటిని ఏలేశ్వరం నుంచి సరఫరా చేస్తారు. ప్రాజెక్టు డీసీఆర్‌ స్లూయిస్‌ నుంచి ప్రస్తుతం 600 క్యూసెక్కులు, స్పిల్‌వే గేటు నుంచి మరో 250 క్యూసెక్కుల నీరు సాగుకి వెళుతోంది. కాలువలపై అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ చేయాలి. నీటి చౌర్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. రిజర్వాయర్‌ నుంచి వదిలిపెట్టే ప్రతి నీటిబొట్టూ ఆధారిత ఆయకట్టుకి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

యర్రవరం వద్ద ప్రధాన కాలువ


జాగ్రత్తలు తీసుకుంటున్నాం

ఏలేరు ప్రాజెక్టు నుంచి సాగుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నాం. వైఏ డివిజన్‌ నుంచి వచ్చే నివేదిక మేరకు ఎప్పటికప్పుడు ఎంత పరిమాణంలో నీటిని సరఫరా చేయాలో నిర్ణయిస్తాం. వంతుల వారీ విధానంలో సరఫరా చేసే జలాలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తున్నాం. రైతులకు, విశాఖ అవసరాలకు ఇబ్బందులు లేకుండా నీటి విడుదలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

 ఎం.భాస్కరరావు, కార్యనిర్వాహక ఇంజినీర్‌, ఏలేరు కార్యాలయం, ఏలేశ్వరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని