logo

నష్టాలతో యువరైతు ఆత్మహత్య

వ్యవసాయంలో మూడేళ్లుగా నష్టాలు రావడంతో మనస్తాపం చెంది సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన యువరైతు సుంకర మణికంఠ (28) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 28 Jan 2023 03:05 IST

మణికంఠ (పాత చిత్రం)

సీతానగరం, న్యూస్‌టుడే: వ్యవసాయంలో మూడేళ్లుగా నష్టాలు రావడంతో మనస్తాపం చెంది సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన యువరైతు సుంకర మణికంఠ (28) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో గురువారం పురుగు మందు తాగిన అతడిని కుటుంబ సభ్యులు గమనించి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. పట్టభద్రుడైన మణికంఠ జీవనోపాధి కోసం తండ్రి రామకృష్ణతోపాటు వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. సొంతంగా ఉన్న 12 ఎకరాలతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని మిరప, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా వచ్చిన వరుస నష్టాలతో ఆర్థికంగా చితికిపోయారు. నష్టాల్ని అధిగమించేందుకు గతేడాది కూనవరంలో పురుగు మందు దుకాణం తెరిచారు. గతేడాది మూడు ఎకరాల్లో మిరపతోట వేశారు. ఎన్నిమందులు కొట్టినా పూత పూయకపోవడంతో మణికంఠ తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఎకరాకు కౌలు రూ.25 వేలు, పెట్టుబడి సుమారు రూ.80 వేలు ఖర్చు చేయడం, మరోవైపు పురుగు మందు దుకాణంలో రూ.లక్షలు అరువు ఉండటం ఆ యువరైతును బాగా కుంగదీశాయి. గురువారం ఉదయం దుకాణం మూసివేసి మిరపతోటలోనే మధ్యాహ్నం వరకు గడిపి ఇంటికి వచ్చి పడుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలు దాటినా భోజనానికి రాకపోవడంతో తల్లి ప్రభావతి తలుపు తెరిచి చూడగా మణికంఠ అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికత్స పొందుతూ మృతిచెందారు. వ్యవసాయంలో నష్టాలతో అప్పులపాలై తన బిడ్డ మరణించాడని తల్లిదండ్రులు ప్రభావతి, రామకృష్ణ బోరున విలపించడం చూపరులను కంట తడిపెట్టించింది. ఉన్న పొలాన్ని అమ్మేసి అప్పులు తీర్చేద్దామని తన కుమారుడికి ఎన్నిసార్లు చెప్పినా, మనోవేదనతో అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఉన్న ఒక్క బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు మృతిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని హెచ్‌సీ టి.లోవకుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని