logo

పర్యాటకం వెలవెల

పర్యాటక రంగంలో దిండి పర్యాటక కేంద్రం జిల్లాకే కేంద్ర బిందువుగా వెలుగొందుతోంది. మలికిపురం మండలం దిండి గ్రామంలో వశిష్ఠ గోదావరి నది ఒడ్డున ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో 2008లో హరిత కోకోనట్‌ కంట్రీ రిసార్ట్స్‌ ఏర్పాటైంది.

Published : 30 Jan 2023 05:31 IST

రిసార్ట్స్‌ ఆవరణలో ఆవిరైన పచ్చదనం

మలికిపురం, రాజోలు, న్యూస్‌టుడే: పర్యాటక రంగంలో దిండి పర్యాటక కేంద్రం జిల్లాకే కేంద్ర బిందువుగా వెలుగొందుతోంది. మలికిపురం మండలం దిండి గ్రామంలో వశిష్ఠ గోదావరి నది ఒడ్డున ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో 2008లో హరిత కోకోనట్‌ కంట్రీ రిసార్ట్స్‌ ఏర్పాటైంది. 32 గదుల వసతి సౌకర్యంతో అందమైన రిసార్ట్స్‌ భవనాలు, ఈత కొలను, నదీ విహారానికి హౌస్‌ బోట్లు, ఫంటూన్‌ బోట్లుతో పర్యాటకులను ఆకర్షించడంలో ఇది పర్యాటక కేంద్రంగా పురోగతి సాధించింది. పర్యాటకానికి వెలుగునిచ్చిన ఆ దిండి రిసార్ట్స్‌ ఇప్పుడు కళ తప్పి వెలవెల పోతోంది. ఏడాదికి సుమారు 2 లక్షల మంది పైబడి పర్యాటకులు ఈ రిసార్ట్స్‌ను సందర్శించడం ద్వారా రూ.3.50 కోట్ల పైబడి ఆదాయం వస్తోంది. బోట్‌ రైడింగ్‌  ద్వారా  రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది.

రంగులు వెలిసి.. సుందరీకరణ ఆవిరై..

రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రిసార్ట్స్‌ భవనాల రంగులు వెలిసి పర్యాటకుల చూపులకు ఆకర్షణ కోల్పోయింది. ఈ రిసార్ట్స్‌లో 32 స్టాండర్డ్‌, డీలక్స్‌, సూట్ గదులు ఉన్నాయి. వీటన్నిటినీ ఆధునికీకరించాల్సి ఉంది. పర్యాటకులు ఎక్కువ ఇష్టపడే నదీ విహారానికి ఉన్న రెండు గృహ పడవలు(హౌస్‌ బోట్లు) కూడా  దెబ్బతిన్నాయి. వీటిలో ఒక దానికి ఇటీవల మరమ్మతులు చేశారు. ప్రస్తుతం మరొకదాన్ని కూడా బాగుచేయనున్నారు.  స్పీడు బోటు, జెట్స్కీ(నీటిలో ప్రయాణించే స్కూటరు లాంటి వాహనం) రెండింటినీ బాగు చేయాలి. ఇటీవల వచ్చిన వరదలకు రిసార్ట్స్‌లోకి ప్రవేశించిన వరద నీటి వల్ల రిసెప్షన్‌ కౌంటర్లు, సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది.   రిసార్ట్స్‌ వెనుక భాగాన నది ఒడ్డుకు మధ్యనున్న పచ్చని గార్డెన్‌ పూర్తిగా పచ్చదనం కోల్పోయింది.

దిండి రిసార్ట్స్‌

కాగితాలకే పరిమితమైన హామీ

దిండిలో పర్యాటకులను ఆకర్షించడానికి ఇక్కడి రిసార్ట్స్‌ను రూ.1.60 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు అప్పటి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 2022 ఫిబ్రవరి నెలలో హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఏ విధమైన  పునర్నిర్మాణ పనులు కార్యాచరణకు నోచుకోలేదు. తరచూ ఉన్నతాధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ముందడుగు పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


వచ్చే సీజనుకు పునర్నిర్మాణ పనులు చేపడతాం
- ఫణి, రిసార్ట్స్‌ మేనేజరు

రిసార్ట్స్‌ పునర్నిర్మాణం ఏపీటీడీసీ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.  ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.   రూ.2 కోట్లు అవసరమవుతాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పనులు జరిగే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో పర్యాటకానికి సీజను అయిన ఏప్రిల్‌, మే నెలల తర్వాత  పనులు చేపట్టే వీలుంది. ఆవరణను సుందరీకరించడానికి చర్యలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని