logo

పశువైద్యం.. పరిపుష్టం

మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకోసం 108 అంబులెన్స్‌ తరహాలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార పశువైద్యశాలలతో మరింత మంది పాడి రైతులకు సేవలు అందనున్నాయి.

Published : 30 Jan 2023 05:31 IST

వాహనం వద్ద పశువులకు పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం: మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకోసం 108 అంబులెన్స్‌ తరహాలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార పశువైద్యశాలలతో మరింత మంది పాడి రైతులకు సేవలు అందనున్నాయి. ఇప్పటికే తొలి విడతలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించిన ప్రభుత్వం ఇటీవల రెండో విడతలో భాగంగా మరో వాహనాన్ని అందించింది. పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు 1962 టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదిస్తే రైతుల ముంగిటకే వాహనాలొచ్చి సేవలందించనున్నాయి.

జిల్లాకు 14 వాహనాలున్నాయి..

జిల్లాలోని అమలాపురం, పి.గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలకు తొలి విడతగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్యసేవ పేరుతో 2022 మేలో ఒక్కో వాహనాన్ని కేటాయించారు. రెండో విడత కేటాయించిన వాహనాలు ఈ నెల 26న పశు వైద్యశాలలకు చేరుకున్నాయి.
ఏమేం సేవలు

అందిస్తారంటే..

సంచార పశువైద్యశాల వాహనాల్లో 20 రకాల మల సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేయడానికి మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల ఏర్పాటు చేశారు. దీనిద్వారానే పరీక్షలు చేయనున్నారు. వ్యాక్సిన్లు, కొన్నిరకాల మందులు కూడా ఇందులో అందుబాటులో ఉంచారు. పశువుల కాలు విరిగినా.. ఈనే సమయంలో ఇబ్బందులున్నా.. శస్త్రచికిత్సకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. పశువులకు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యంతో వాహనంలోకి ఎక్కించే వెసులుబాటుంది. ఈ వాహనంలో ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ ఉంటారు. వీరే సేవలన్నీ చేయనున్నారు.


సద్వినియోగం చేసుకోవాలి
- డాక్టర్‌ కర్నీడి ఎస్‌.వి.వి.ఎస్‌.మూర్తి, ఉపసంచాలకుడు, అమలాపురం

సంచార పశు వైద్యశాల వాహనాల ద్వారా అందించే సేవలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశువులకు వ్యాధి సోకితే 1962 టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదిస్తే మీ ఇంటి ముందుకే వాహనం చేరుకుంటుంది. చికిత్సలతోపాటు అవసరమనుకుంటే శస్త్రచికిత్సలు కూడా చేస్తారు. జిల్లాలో ఇప్పటివరకు 29,059 పశువులకు చికిత్సలు చేశాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని