logo

కొందరికే చేదోడు..!

కాకినాడ జిల్లాలో జగనన్న చేదోడు పథకం అమలుతీరు గందరగోళంగా మారింది. 2022-23కు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయోమయానికి గురి చేసింది. ఈ దఫా నిబంధనలు సడలించినా లబ్ధిదారులకు ప్రయోజనం అందని పరిస్థితి నెలకొంది.

Published : 30 Jan 2023 05:31 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలో జగనన్న చేదోడు పథకం అమలుతీరు గందరగోళంగా మారింది. 2022-23కు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయోమయానికి గురి చేసింది. ఈ దఫా నిబంధనలు సడలించినా లబ్ధిదారులకు ప్రయోజనం అందని పరిస్థితి నెలకొంది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దరఖాస్తులకు అవకాశం ఇవ్వడంతో వేల సంఖ్యలో అర్హులు నష్టపోయే పరిస్థితి దాపురించింది. కుల, ఆదాయ, కార్మిక శాఖ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో జారీ అవ్వక, దరఖాస్తు చేసేందుకు గడువు లేక లబ్ధిదారులను ఉసూరుమన్నారు. ఈ పథకం ద్వారా రజక, నాయీబ్రహ్మణ, టైలరింగ్‌ వృత్తి చేసే 21 నుంచి 60 ఏళ్ల పేదలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీనికిగాను ఈ నెల 24న సాయంత్రం నవశకం బెనిఫిషరీ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌బీఎం) పోర్టల్‌ను తెరిచి 26 అర్ధరాత్రి 12లోపు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వులిచ్చారు. కేవలం మూడు రోజులే గడువు ఇవ్వడంతో కుల,ఆదాయ, కార్మిక శాఖ ధ్రువపత్రాల కోసం అర్హులు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. వేల సంఖ్యలో దరఖాస్తులు తహసీల్దారు, కార్మిక శాఖ కార్యాలయాల్లో మూలుగుతున్నాయి.

గతంలో  ఇలా..

2020-21, 2021-22లో దరఖాస్తుకు నెల రోజుల గడువు ఇచ్చేవారు. అవసరమైన ధ్రువపత్రాలను గ్రామ/వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్‌ అసిస్టెంట్స్‌కు ఇస్తే ఎన్‌బీఎం పోర్టల్‌లో నమోదు చేసి, ధ్రువీకరించే వారు. అనంతరం ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ, కలెక్టర్‌ ధ్రువీకరణతో అర్హుల జాబితాను రూపొందించే వారు. ఈ దఫా అందుకు భిన్నంగా వ్యవహరించారని, దీని వల్ల ఎక్కువ మందికి లబ్ధి అందదనే ఆందోళన వ్యక్తమవుతోంది. గడువు పెంచి, అర్హులకు ఆర్థిక సాయం అందించాలని పేదలు కోరుతున్నారు.

వెల్ఫేర్‌ అసిస్టెంట్ల వద్దే దరఖాస్తులు..

గడువులోగా కొందరు ధ్రువపత్రాలు అందజేసినా, సమయంలేక వెల్ఫేర్‌ అసిస్టెంట్లు ఎన్‌బీఎం పోర్టల్‌లో నమోదు చేయలేకపోయారు. జిల్లాలోని 620 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా, ఒక్కోచోట ఒక వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ఉన్నారు. వీరి ద్వారా సంక్షేమ పథకాలకు అర్హులను నిర్ణయిస్తారు. ఈ నెల 26లోగా వీరికి అందిన దరఖాస్తులను 27 సాయంత్రంలోగా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఆదేశించారు. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఎన్‌బీఎం పోర్టల్‌లో పొందుపర్చి, ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్‌, బీసీ కార్పొరేషన్‌ ఈడీ, కలెక్టర్‌ ఆమోదం తీసుకోవాలని సూచించారు. దీనికి ఫిబ్రవరి 4 వరకు అవకాశం కల్పించారు. అయితే ఈ నెల 27 వరకు ఆమోదం పొందిన జాబితాకే సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి చేదోడు ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. దీని ప్రకారం జిల్లాలో 13,314 మంది లబ్ధిదారులకు రూ.13.31 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు అప్‌లోడ్‌ చేసే దరఖాస్తులకు మాత్రం ఇప్పుడు ఆర్థిక సాయం అందించే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. వీరిలో అర్హులుంటే ఎప్పుడు ఈ సాయం అందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది.

అర్హత  ఉన్నా..

* కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 41వ డివిజన్‌, పోలీసు క్లబ్‌ వీధిలో ఇంటి వద్ద లాండ్రీ చేసే తూరంగి బేబీకి ఈ పథకాన్ని వర్తింప చేయలేదు. గత రెండు పర్యాయాలు ఈమె చేదోడు లబ్ధి పొందారు. నిబంధనల ప్రకారం ఈమెకు అర్హత ఉన్నా, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ నిరాకరించారు. దీంతో గాంధీనగర్‌ సచివాలయం-బీ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.

* కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 49వ డివిజన్‌ అశోక్‌నగర్‌లో స్వామి సెలూన్‌ నిర్వహిస్తున్నారు. ఇతను కుల ధ్రువీకరణపత్రానికి దరఖాస్తు చేసినా 26లోపు జారీ కాకపోవడంతో సకాలంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.  ఆదివారం ఇతనికి ఆన్‌లైన్‌లో కుల ధ్రువీకరణపత్రం జారీ అయింది. సోమవారం దీన్ని సంబంధిత సచివాలయంలో సమర్పించాల్సి ఉంది. ఇతనికి జగనన్న చేదోడు వర్తిస్తుందా... లేదా? అనేది ప్రశ్నార్థకమే..


13,314 మందికే  లబ్ధి
ఎస్‌వీఎస సుబ్బలక్ష్మి, ఈడీ, బీసీ కార్పొరేషన్‌, కాకినాడ జిల్లా

జగనన్న చేదోడు పథకంలో ఈ నెల 27 వరకు ఆమోదించిన జాబితాకు సోమవారం ఆర్థిక సాయం విడుదల చేస్తారు. జిల్లాలో 13,314 మందికి లబ్ధి అందనుంది. ఇంకా వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వద్ద ఉన్న దరఖాస్తులను ఎంపీడీవో/మున్సిపల్‌ కమిషనర్లకు పంపి, బీసీ కార్పొరేషన్‌కు సమర్పించాలని ఆదేశించాం. ఫిబ్రవరి 4 లోగా జాబితాల సమర్పణకు అవకాశం కల్పించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు చేదోడు వర్తింపజేస్తారు. వీరికి ప్రభుత్వ ఆదేశాల మేరకు తరువాత ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని