logo

మిగిలింది 2 నెలలే..!

2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండు నెలలే గడువుంది.. ఈలోగా కాకినాడ ఆకర్షణీయ నగరం అభివృద్ధి పనులు పూర్తి అనుమానంగానే ఉంది.. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద 2015-16లో కాకినాడ నగరం ఎంపికైంది.

Published : 30 Jan 2023 05:31 IST

బిల్లులు చెల్లించక నిర్మాణం పూర్తయినా వినియోగంలోకి రాని సైన్స్‌ సెంటర్‌

ఈనాడు, కాకినాడ: 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండు నెలలే గడువుంది.. ఈలోగా కాకినాడ ఆకర్షణీయ నగరం అభివృద్ధి పనులు పూర్తి అనుమానంగానే ఉంది.. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద 2015-16లో కాకినాడ నగరం ఎంపికైంది. 2019-20 నాటికే పనులు పూర్తవ్వాలి. కానీ నిధుల విడుదలలో తాత్సారంతో గతితప్పాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నా సాధ్యం కాలేదు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక్కో స్మార్ట్‌ సిటీలో రూ.వెయ్యి కోట్ల వరకు వెచ్చిస్తామని ప్రకటించి.. ఏడేళ్లు గడిచినా నేటికీ కొలిక్కి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.

సమస్య ఎక్కడుంది..?

స్మార్ట్‌ సిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధుల పీడీ ఖాతాలను గతేడాదే ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు (సీఎఫ్‌ఎంఎస్‌) అనుసంధానం చేశారు. పూర్తయిన పనుల బిల్లులను స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఇంజినీర్లు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయాలి. ఈ ప్రక్రియలో జాప్యంతో నిధుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. స్మార్ట్‌సిటీలకు రావాల్సిన నిధులు ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుని తిరిగి ఇవ్వకుండా జాప్యం చేస్తోందనీ.. అందుకే పనులు నెమ్మదిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రతిపాదనల దశలో, ప్రారంభం కాని పనులు పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.

నిధులివ్వరు.. బకాయిలు చెల్లించరు..

క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు రూ.770.97 కోట్ల విలువైన పనులు చేసినట్లు యంత్రాంగం లెక్కలు చూపుతున్నా.. చేసిన పనులకు బిల్లులు... ఇవ్వాల్సిన నిధుల ఊసే లేదు. స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.194.44 కోట్లు మంజూరు చేయాలి. చేసిన పనుల బిల్లులు రూ.183.10 కోట్లు బకాయిలు ఉన్నాయి. గుత్తేదారులు నిరసన తెలిపినా ఉలుకూపలుకూ లేదు.

* స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టిన పనుల్లో కొన్ని ఇప్పటికే దెబ్బతిన్నాయి. రోడ్లకు చాలాచోట్ల పైపొరలు ఊడిపోయాయి. కాకినాడ-సర్పవరం మార్గంలోని ఫుట్‌పాత్‌, సైకిల్‌ ట్రాక్‌ ఇతర పనులదీ అదే పరిస్థితి. రూ.20 కోట్లతో నిర్మించిన గోదావరి కళాక్షేత్రం.. రూ.15 కోట్లతో ఏర్పాటుచేసిన సైన్స్‌ సెంటర్‌.. రూ.18 కోట్లతో నిర్మించ తలపెట్టిన కన్వర్టబుల్‌ స్టేడియం.. ఇలా పలు కీలక ప్రాజెక్టులు నిధుల లేమితో అందుబాటులోకి రాలేదు.


ప్రారంభించనవి రద్దయినట్లే..
-కె.రమేష్‌, ఎండీ, కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పనుల గడువు జూన్‌తో ముగుస్తుంది. గడువు పొడిగింపుపై స్పష్టత రావాలి. ప్రారంభించని, ప్రతిపాదనల దశలో ఉన్న పనులు రద్దయినట్లే..  పెండింగు బిల్లులతోపాటు రావాల్సిన నిధులూ ఉన్నాయి. నిధులు విడుదలైతే గడువులోగా పనుల పూర్తికి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని