logo

జల కలవరం

తూర్పున జలవనరులకు కొదవ లేదు.. కానీ కొన్నిచోట్ల సాగునీటి వెతలు తప్పడంలేదు. వెంటాడుతున్న వరదలు.. శివారు భూములకు సాగునీటి కొరత.. వంటి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 30 Jan 2023 05:57 IST

ఈనాడు, రాజమహేంద్రవరం- న్యూస్‌టుడే, సీతానగరం, కిర్లంపూడి, జగ్గంపేట గ్రామీణం, పిఠాపురం

తూర్పున జలవనరులకు కొదవ లేదు.. కానీ కొన్నిచోట్ల సాగునీటి వెతలు తప్పడంలేదు. వెంటాడుతున్న వరదలు.. శివారు భూములకు సాగునీటి కొరత.. వంటి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. కీలక పథకాల్లో కొన్ని నూరుశాతం పూర్తికాక రైతులు ఇబ్బంది పడుతుంటే.. న్యాయపరమైన చిక్కులు.. నిధుల లేమి సమస్యలు మరికొన్నిచోట్ల సాగునీటి పథకాలు సమర్థ సేవలు అందించక రైతులకు సాగువేళ చుక్కలు చూపిస్తున్నాయి.


ఎన్ని పుష్కరాలు ఎదురుచూడాలో..

సీతానగరం: పుష్కర ఎత్తిపోతల పథకం

పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా కాకినాడ జిల్లాలో 11, తూగోలో ఏడు, అనకాపల్లి జిల్లాలో ఒక మండలాల పరిధిలో 1.85 లక్షల ఎకరాలకు సాగునీరు.. గోదావరి నుంచి 11.80 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా 17 మండలాల్లోని 163 గ్రామాలకు చెందిన 5.23 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది లక్ష్యం. సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం వద్ద పుష్కర- 1, 2 ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. ఖరీఫ్‌లో 1.04 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలుగుతున్నారు. దీని కింద కాకినాడ జిల్లాలో ఏడు ఉప ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటికి ఏటా 10 టీఎంసీలు సామర్థ్యమున్నా, వంతెనలు, కాలువల పనులు పూర్తికాకపోవడంతో 5 నుంచి 6 టీఎంసీలే చేరుస్తున్నారు. ఈ పథకాలకు రెండేళ్ల నిర్వహణ ఖర్చులు సుమారుగా రూ.3 కోట్లు గుత్తేదారుకి బకాయిలున్నట్లు సమాచారం. దీంతో పంపుల మరమ్మతులు అరకొరగా ఉన్నాయి. మెట్టలో కాలువలు, వంతెన పనులకు రూ.40 కోట్లకు పైగా బకాయిలుండడంతో గుత్తేదారుడు వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం. పుష్కర ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.674.52 కోట్లయితే.. ఇప్పటివరకు 764.92 కోట్లు వెచ్చించినా పనులు కొలిక్కి రాకపోవడం గమనార్హం.

పథకం: పుష్కర ఎత్తిపోతల
ఆయకట్టు: 1,85,906 ఎకరాలు


ఆగిన పథకం.. సాగేదెన్నడో..

మూతపడిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం

పోలవరం డ్యాం దిగువ గోదావరి నుంచి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తి.. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు 1.60 కి.మీ. వద్ద ఎత్తిపోయడం ద్వారా 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. సీతానగరం మండలంలోని గోదావరి ఎడమగట్టున పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం పనులు 98 శాతం పూర్తిచేసి రూ.1,780 కోట్లు వెచ్చించారు. తరువాత న్యాయపరమైన చిక్కులతో పథకం 2019 నుంచి నిలిచిపోయింది.  

పుష్కర నుంచి సాగునీరు

పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి మెట్ట మండలాలకు ఖరీఫ్‌లో 1.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాం. పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు ఎన్జీటీ విధించిన జరిమానా అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. స్పష్టత వచ్చి అనుమతులు లభిస్తేనే పథకం వినియోగంలోకి వచ్చేవీలుంది.

ఆర్‌.వెంకట్రావు, డీఈఈ, జలవనరులశాఖ

పురుషోత్తపట్నం ఎత్తిపోతలు
2.15 లక్షల ఎకరాలు


అసంపూర్తిగానే...

కాతేరు వద్ద వెంకటనగరం పంపింగ్‌ స్కీం

తూగో జిల్లా కాతేరు గ్రామం వద్ద గోదావరి ఎడమ గట్టుపై వెంకటనగరం పంపింగ్‌ స్కీము ఏర్పాటు చేశారు. 3.623 టీఎంసీల నీటిని లిఫ్ట్‌ ద్వారా 34వేల ఎకరాలకు సాగు, 28 గ్రామాలకు తాగునీరు అందించడానికి పథకాన్ని రూపొందించారు. అంచనా వ్యయం రూ.124.18 కోట్లయితే.. ఇప్పటివరకు రూ.97.17 కోట్లు విలువైన పనులు మాత్రమే చేశారు. ఖరీఫ్‌లో పాత వెంకటనగరానికి 4,250 ఎకరాలు, చాగల్నాడుకు 6,394 ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి.  

ప్రభుత్వం దృష్టికి..

వెంకటనగరం పంపింగ్‌ స్కీం కింద ఓల్డ్‌ వెంకటనగరం, చాగల్నాడు పరిధిలోని 10,644 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. మిగిలిన 23,356 ఎకరాలకు నీరివ్వాలంటే.. 377 ఎకరాల భూమి సేకరించాలి. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ పనులు పూర్తిచేయాలి. విలువైన తోటలు ఉన్నందున రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

శ్రీనివాసులురెడ్డి, ఈఈ, పోలవరం ఎల్‌ఎంసీ డివిజన్‌-2

వెంకటనగరం పంపింగ్‌ స్కీమ్‌
34వేల ఎకరాలు


అన్నదాతల అగచాట్లు

జగ్గంపేట: తాళ్లూరు వద్ద పుష్కర రెండో దశ ఎత్తిపోతల పథకం

ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ తొలి దశ పనులు 2020 నాటికే పూర్తవ్వాల్సి ఉన్నా సాకారం కాలేదు. కాలువ విస్తరణ, సాగునీటి నిర్మాణాలు కొలిక్కి రాలేదు. తొలిదశ పనులకు 2008లో రూ.138 కోట్లతో ఆమోదం తెలిపితే.. రెండోదశ పనులకు తొలుత రూ.137 కోట్లు.. తర్వాత రూ.168 కోట్లకు అంచనా పెరిగింది. రెండు దశల్లో పనుల పూర్తికి రూ.295.83 కోట్లతో రివైజ్డ్‌ అంచనాలకు 2015లో ఆమోదం దక్కినా నేటికీ మోక్షం రాలేదు. దీంతో జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లోని 67,600 ఎకరాలు సస్యశ్యామలం చేయాలన్న కల నెరవేరడం లేదు. కిర్లంపూడి- పిఠాపురం- గొల్లప్రోలు- యు.కొత్తపల్లి- సామర్లకోట తదితర మండలాల్లో వరద వచ్చిన ప్రతిసారీ కాలువకు గండ్లు పడుతుండడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. గతేడాది నవంబరులో గోకవరం పర్యటనలో ఏలేరు కుడి కాలువకు రూ.50 కోట్లు మంజూరుచేస్తానని.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సీఎం హామీ ఇచ్చినా పనుల్లో కదలిక లేదు.

నిధులొస్తే పనులు

ఏలేరు రెండు దశలకు కలిపి రివైజ్డ్‌ అంచనాలు ఈఎన్‌సీకి పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి నిధులు విడుదలైతే పనుల్లో కదలిక వచ్చే వీలుంది. ఆధునికీకరణకు ఇక్కడి కాలువలు ఎంపిక కావడంతో నిర్వహణకు నిధులు విడుదల చేయడంలేదు. ఈ కారణంగానే క్లోజర్‌ పనులు జరగడం లేదు. ముఖ్యమంత్రి హామీల పనులకు సంబంధించిన అంచనాల ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదలైతే పనులు ప్రారంభిస్తాం.

రామ్‌గోపాల్‌, ఈఈ, ఏలేరు డివిజన్‌, పెద్దాపురం

ఏలేరు ప్రాజెక్టు 57 వేల ఎకరాలు
(ఆధునికీకరణతో 67,600 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని