logo

ఆరుస్తారా.. తీరుస్తారా

ధాన్యాగారంగా కొనియాడే నేల. పారిశ్రామికీకరణకు నెలవు. ఆధ్యాత్మిక, పర్యాటక కొలువు. సుదీర్ఘ సాగర, గోదావరి పరివాహకంతో ఆహ్లాదానికి ఆలవాలమీ తీరం.

Published : 01 Feb 2023 04:21 IST

ఈనాడు, కాకినాడ: ధాన్యాగారంగా కొనియాడే నేల. పారిశ్రామికీకరణకు నెలవు. ఆధ్యాత్మిక, పర్యాటక కొలువు. సుదీర్ఘ సాగర, గోదావరి పరివాహకంతో ఆహ్లాదానికి ఆలవాలమీ తీరం. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాముఖ్యతలు ఎన్నో.. నిధుల ఊతమిచ్చి ప్రగతి రథచక్రాన్ని పరుగులు పెట్టిస్తే.. అన్నిరంగాల్లో దూసుకెళ్లి ఆదర్శంగా నిలిచే సత్తా ఉన్న ప్రాంతమిది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 వార్షిక బడ్జెట్‌ నేడు ప్రవేశపెట్టనున్న వేళ.. తూర్పు ప్రజల కలలు సాకారం అయ్యేలా.. ఆర్థిక దన్నుతో ఆరు ప్రాధాన్య అంశాలను చక్కదిద్దాలి.


నిధులిస్తేనే.. కూత..

కాకినాడ లైనును ప్రధాన రైలు మార్గంలో కలపాలనే వినతికి పాతికేళ్లు దాటినా మోక్షం దక్కలేదు. డబ్లింగ్‌ పనులు పునఃపరిశీలనలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించినా కదలికలేదు. కోనసీమ ప్రజల ఆకాంక్ష కోటిపల్లి- నరసాపురం రైలు మార్గం పనులు నిధుల లేమితో నెమ్మదించాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.358 కోట్లు ఇవ్వకపోవడంతో.. కేంద్రం బడ్జెట్‌లో నామమాత్ర నిధులతో సరిపెడుతోంది. కేంద్రం-రాష్ట్రం చొరవతోనే ఈ మార్గానికి మోక్షం దక్కేది. రాజమహేంద్రవరం, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, బిక్కవోలు, నిడదవోలు తదితర రైల్వేస్టేషన్లలో కీలక రైళ్ల నిలుపుదల, స్టేషన్లు, వంతెనల అభివృద్ధికి ప్రతిపాదనల ఆధారంగా నిధులు కేటాయించాలి.


పూర్తిచేస్తే.. పోల‘వరమే’

పోలవరం సత్వరం పూర్తిచేయాలి. దానికి అనుసంధానంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖ పరిధిలో సాగు, తాగునీటి అవసరాలకు ఎడమ ప్రధాన కాలువ అందుబాటులోకి తేవాలి. నిధుల లేమితో భూసేకరణ, కాలువ, ఇతర పనుల్లో కదలిక లేదు. ఇప్పటికి 71.33 శాతం పనులు పూర్తవగా ఇంకా రూ.1,385 కోట్లు కేటాయించాలి.


విదేశీ వాణిజ్య సంస్థకు ఊతమిస్తే..

జేఎన్‌టీయూ ప్రాంగణంలో తాత్కాలికంగా భారతీయ విదేశీ వాణిజ్య సంస్థ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటైంది. కోనపాపపేట వద్ద శాశ్వత ప్రాంగణానికి 25 ఎకరాలు కేటాయించారు. రూ.155 కోట్లతో ఐఐఎఫ్‌టీ అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు, ఆడిటోరియం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ సమకూర్చాలి. నిధులు రాక అద్దె భవనాల్లో ప్రస్తుత ప్రాంగణాలు నడుస్తున్నాయి.


చమురు సీమ.. ఏదీ ధీమా..?

విశాఖ- కాకినాడ పెట్రో- పెట్రో రసాయనాల పెట్టుబడుల కేంద్రం ఊసేలేదు. యు.కొత్తపల్లి, తొండంగి, కాకినాడ గ్రామీణ మండలాల్లో 14 వేల ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. కేంద్రం నిధులిస్తే ప్రాజెక్టు పట్టాలెక్కే వీలుంది. చమురుసీమ సాకారమైతే కాకినాడ- విశాఖ మధ్య పారిశ్రామిక ప్రగతి.. ఉద్యోగ, ఉపాధికి, రవాణా, వసతుల కల్పనకు వీలుంది.


కాసులు కురిపిస్తే.. ఆకర్షణీయమే..

ఆకర్షణీయ నగరంగా.. రూ.1,005 కోట్లతో కాకినాడ రూపురేఖల్ని మార్చేస్తామని కేంద్రం ప్రకటించినా.. కేంద్ర- రాష్ట్ర వాటా నిధులు పూర్తిస్థాయిలో రాలేదు. ఇప్పటికి రూ.600.47 కోట్లు విడుదలకాగా, బిల్లు బకాయిలు.. దక్కాల్సిన నిధుల కోసం ఎదురుచూపులు తప్పలేదు. కాకినాడకు 50 కాలుష్య రహిత బ్యాటరీ బస్సుల కేటాయింపు విన్నపానికీ కేంద్రం నుంచి మోక్షం దక్కలేదు.


ఎంపిక సరే.. ప్రోత్సాహమేదీ..?

‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ విధానంలో కొబ్బరి పంటకు ఊతమిస్తామని కేంద్రం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పురోగతి లేదు. 54,539 హెక్టార్లలో కొబ్బరి సాగవుతున్నా.. దిగుబడి ఎకరాకు ఏటా సగటున 7,908 కాయలు వస్తున్నా.. ఉప ఉత్పత్తుల దిశగా ప్రోత్సాహమే లేదు. 5 లక్షల మంది ప్రత్యక్ష- పరోక్ష ఉపాధి పొందుతున్నారు. పీచు, తాళ్లు, నూనె పరిశ్రమలు తప్ప.. కొబ్బరి పాలు, చిప్స్‌, పౌడర్‌, వెనిగర్‌, వర్జీన్‌ ఆయిల్‌ ఇతర అనుబంధ పరిశ్రమల ముచ్చటే లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని