logo

మంచు ప్రభావం.. ముందుచూపు అవశ్యం..

వాణిజ్య విలువ అత్యధికంగా గల పంట జీడి మామిడి. సాధారణంగా మూడు, నాలుగేళ్ల కాలంలో పూతకు వచ్చే ఈ పంటకు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు ఎంతో కీలకం.

Published : 01 Feb 2023 04:21 IST

జీడిమామిడి తోటలో పిచికారీ

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వాణిజ్య విలువ అత్యధికంగా గల పంట జీడి మామిడి. సాధారణంగా మూడు, నాలుగేళ్ల కాలంలో పూతకు వచ్చే ఈ పంటకు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు ఎంతో కీలకం. ఈ సమయంలోనే పలు రకాల చీడ పీడలు ఆశించి దిగుబడులపై ప్రభావం చూపుతాయి. పొగ మంచు, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు పూత దశపై ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో 13,296 హెక్టార్లలో జీడి మామిడి సాగవుతోంది. ప్రస్తుతం పూత వేళలో వచ్చే తెగుళ్లు, సస్యరక్షణ, నివారణ చర్యలపై దృష్టి సారించడం ఎంతో అవసరమని అధికారులు సూచిస్తున్నారు.

దిగుబడి తగ్గే అవకాశం..

* టీ లేదా తేయాకు దోమ ప్రభావంతో 30 నుంచి 40 శాతం దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ దోమ సాధారణంగా అక్టోబరు నుంచి ఏప్రిల్‌ వరకు కనిపిస్తుంది. టీ దోమ ఆశించిన చెట్లలో లేత ఆకులు, పూత మాడిపోతాయి. పక్వానికి రాని జీడి గింజలు ముందుగానే రాలిపోతాయి. గింజలపై మచ్చలు, చారలు ఏర్పడి నాణ్యత కోల్పోతాయి. ‌్ర ఆకు, పుష్పగుచ్ఛం గూడు కట్టుకునే పురుగు వల్ల లేత మొక్కలకు హాని కలుగుతుంది. ఆకులు ఎండిపోతాయి. కొమ్మల చివర బూజు గూళ్లతో దీన్ని గుర్తించవచ్చు. వీటి వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుంది.


రక్షణ ఇలా..

తేయాకు దోమ, ఆకులు, కాయలు తినే పురుగులను నివారించేందుకు మూడు దఫాలుగా సస్య రక్షణ చేపట్టాలి. తొలిసారి కొత్త చిగురు వచ్చే వేళ మోనోక్రోటోఫాస్‌ మందును ఒక లీటరు నీటికి 1.6 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రెండోసారి పూత బయటకు వచ్చే సమయంలో లోమ్డాసైహలోథ్రిన్‌ను లీటరు నీటికి 0.6 మిల్లీ లీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్‌ 2.0 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి కొమ్మలు బాగా తడిసేట్లు పిచికారీ చేయాలి. మూడోదశలో గింజ బఠానీ పరిమాణంలో ఉన్నపుడు ప్రొఫెనోఫాస్‌ మందును ఒక లీటరు నీటికి 1 మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

సీహెచ్‌ శ్రీనివాసరావు, కొవ్వూరు ఉద్యాన అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని