logo

ఉచిత శిక్షణ.. భవితకు నిచ్చెన

ఉద్యోగం సాధించాలంటే పట్టా ఉంటే సరిపోదు.. అందుకు అవసరమైన నైపుణ్యం కూడా అవసరం. ఏటా బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులు జిల్లా నుంచి సుమారు రెండు లక్షలకుపైగా బయటకు వస్తున్నారు.

Published : 01 Feb 2023 04:21 IST

శిక్షణలో విద్యార్థులు

కాకినాడ(వెంకట్‌నగర్‌), న్యూస్‌టుడే: ఉద్యోగం సాధించాలంటే పట్టా ఉంటే సరిపోదు.. అందుకు అవసరమైన నైపుణ్యం కూడా అవసరం. ఏటా బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులు జిల్లా నుంచి సుమారు రెండు లక్షలకుపైగా బయటకు వస్తున్నారు. అందులో కేవలం 40శాతం మాత్రమే ఉద్యోగాలు సాధిస్తున్నట్లు ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారులు చెబుతున్నారు. దీనికి కారణం వ్యక్తిగత, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలపై వారికి పట్టులేకపోవడమే. దీన్ని గుర్తించిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రస్తుతం బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది. కాకినాడ జిల్లాలో జేఎన్‌టీయూకేలో స్కిల్‌ కళాశాల ఏర్పాటు చేశారు. ఇందులో సర్టిఫైడ్‌ ఎంబైడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, ఆటోమోటివ్‌, ఆటోమేషన్‌ రోబోటిక్స్‌ కోర్సుల్లో తర్ఫీదు ఇస్తున్నారు. కోర్సుపై ఆసక్తితో జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలో గానీ, జేఎన్‌టీయూకేలోని స్కిల్‌ కళాశాలలో గానీ సంప్రదించాలని డీఎస్‌డీవో హరిశేషు తెలిపారు.

నేర్పించే అంశాలు ఇవే..

* సర్టిఫైడ్‌ ఎంబైడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కోర్సులో భాగంగా అయిదు నెలల కాల వ్యవధిలో ఎంబైడెడ్‌-సి, లైనిక్స్‌ పోర్టింగ్‌, రియల్‌టైం ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఆర్‌టీఓఎస్‌), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), ప్రొటోకాల్స్‌ డివైజ్‌ డ్రైవ్స్‌, తదితర అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు.

* ఆటోమోటివ్‌, ఆటోమేషన్‌ రోబోటిక్స్‌ కోర్సులో భాగంగా ఆరు నెలల కాల వ్యవధిలో ఎన్‌ఎక్స్‌-కేడ్‌, 3డీ ప్రింటింగ్‌, రోబోటిక్స్‌, ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోలర్‌ (పీఎల్‌సీ) తదితర అంశాల్లో తర్ఫీదిస్తున్నారు. వీటితోపాటు కోర్సు స్పెసిఫికేషన్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, లైఫ్‌స్కిల్స్‌, ప్రొఫెషనల్‌ డవలప్‌మెంట్‌, కంప్యూటర్‌ హ్యాండలింగ్‌ స్కిల్స్‌ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు.


వ్యక్తిగత నైపుణ్యం పెంచుకునేందుకు

బీటెక్‌ ఈసీఈ పూర్తి చేశా. నాన్న వెంకటరమణమూర్తి వ్యవసాయం చేస్తుంటారు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నా. నైపుణ్యం పెంచుకునేందుకు ఎంబైడెడ్‌ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనకంటూ ప్రత్యేకత లేకపోతే వెనుకబడిపోతాం. అందుకే దూరమైనా రోజూ తరగతులకు హాజరవుతున్నా. కోర్‌ సంబంధిత ఉద్యోగంలో స్థిరపడాలనేది నా లక్ష్యం.

నరాల సుప్రసన్న


నూతన ఆవిష్కరణలు చేయాలి

చదువు పూర్తయిన వెంటనే పెళ్లయిపోయింది. పిల్లలు పుట్టడంతో ఉద్యోగం చేయలేదు. భర్త ప్రోత్సాహంతో మళ్లీ కోర్సులో మెలకువలు నేర్చుకునేందుకు శిక్షణకు వస్తున్నా. మారుతున్న నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. అందుకే ఆటోమేషన్‌, ఆటోమిషన్‌ రోబోటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నా. కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలంటే చాలా ఇష్టం. ఆ దిశగా అడుగులు వేస్తాను.

తలాటం సత్య


యువత సద్వినియోగం చేసుకోవాలి...

బీటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. 18-35ఏళ్లలోపు ఎవరైనా చేరవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత ఉపాధి కల్పిస్తాం. కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఆర్నెల్ల పాటు ప్రతినెలా రూ.వేయి భత్యంగా చెల్లిస్తారు. శిక్షణ తీసుకుంటున్న వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తాం. ఎవరికి ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు. జేఎన్‌టీయూకేలోని స్కిల్‌ కళాశాలను జె.లోవబాబు పర్యవేక్షిస్తున్నారు. కోర్సులో చేరేందుకు ఆసక్తి గలవారు 97002 42847 సంప్రదించాలి. పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన వారు సైతం శిక్షణ తీసుకునే అవకాశం ఉంది.

డి.హరిశేషు, డీఎస్‌డీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని