logo

బెడిసికొట్టిన కిడ్నాప్‌ పథకం

అయిదుగురు కలిసి ఓ వ్యాపారి కుమారుడిని అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా ఇద్దరు పరారీలో ఉన్నారు.

Updated : 01 Feb 2023 05:27 IST

హైదరాబాద్‌: అయిదుగురు కలిసి ఓ వ్యాపారి కుమారుడిని అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. వీరిలో ముగ్గురు పట్టుబడగా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎస్సై వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. హైదర్‌నగర్‌లో ఓ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ కంపెనీ యజమాని నాగేశ్వరరావు వద్ద పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన చెంచినాడ నర్సింహస్వామి(29) పనిచేసి మానేశాడు. సొంతూరిలో వ్యాపారం చేసి మళ్లీ ఇదే కంపెనీలో చేరాడు. నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన సింగలూరి సురేశ్‌ (26), ఇదే జిల్లాకు చెందిన నాగరాజు దొంగనోట్ల కేసులో గతంలో జైలుకి వెళ్లొచ్చారు. ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్‌లో కలిసేవారు. ఆర్థిక ఇబ్బందులు తీరేందుకు కంపెనీ యజమాని నాగేశ్వరరావు కుమారుడు భానుప్రకాశ్‌(20)ను కిడ్నాప్‌నకు నర్సింహస్వామి పథకం రచించాడు. తనతోపాటే పనిచేస్తున్న బీదర్‌కు చెందిన ప్రశాంత్‌ (31), పనిచేసి మానేసిన బాబును ఒప్పించాడు.

బయటపడిందిలా..

గత ఏడాది అక్టోబరులో దీపావళికి వారం ముందు నర్సింహస్వామి ఫోన్‌ చేయడంతో సురేశ్‌, నాగరాజు కారులో హైదరాబాద్‌ వచ్చారు. అయిదుగురు కలిసి భానుప్రకాశ్‌ను కిడ్నాప్‌ చేసేందుకు కంపెనీ వద్దకు వెళ్లగా జనం కదలికలు, సీసీ కెమేరాలు ఉండటంతో వాయిదా వేశారు. తర్వాత పెనుగొండకు వెళ్లిపోయిన సురేశ్‌, నాగరాజు.. మరో ప్లాన్‌ వేశారు. నర్సింహస్వామికి తెలియకుండా గత నెల 26న హైదరాబాద్‌ వచ్చి నేరుగా కంపెనీకి వెళ్లి యజమాని నాగేశ్వరరావును కలిశారు. ‘మీ కుమారుడిని కిడ్నాప్‌ చేసేందుకు మీ కంపెనీలో పనిచేసేవారే ప్రణాళిక వేశారని, వారి పేర్లు చెప్పాలంటే డబ్బులివ్వాలంటూ బేరసారాలకు దిగారు. అంగీకరించిన నాగేశ్వరరావు ఆ ఇద్దరి వివరాలు తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సురేశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ఈ వ్యవహారమంతా బయటపడింది. దీంతో నర్సింహస్వామి, ప్రశాంత్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాబు, నాగరాజు పరారీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని