logo

కొలువు దీరినా.. కుదుట పడలే!

కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలుగా గతేడాది ఏప్రిల్‌ 4న ఆవిర్భవించాయి. కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది సమీపిస్తున్నా నేటికీ ఆయా జిల్లాల్లో పాలన గాడిన పడలేదు.

Published : 03 Feb 2023 06:14 IST

ఈనాడు, రాజమహేంద్రవరం -న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం, ధవళేశ్వరం

అమలాపురంలోని కలెక్టరేట్‌లో స్పందన వేళ టెంట్ల ఏర్పాటు

కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలుగా గతేడాది ఏప్రిల్‌ 4న ఆవిర్భవించాయి. కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది సమీపిస్తున్నా నేటికీ ఆయా జిల్లాల్లో పాలన గాడిన పడలేదు. కొన్ని శాఖల విభజన కొలిక్కి రాక.. ఏర్పాటైన కార్యాలయాలకు పూర్తిస్థాయి వసతులు సమకూరక అవస్థలు పడే పరిస్థితి. కీలకమైన కలెక్టర్‌ కార్యాలయాలతోపాటు ఇతర శాఖలదీ అదే దుస్థితి. ఇప్పటికీ పలు సేవలకు పొరుగు జిల్లాల కేంద్రాలైన కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది.

కొలిక్కివస్తేనే ఊరట..

కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమై పది నెలలు గడిచినా కొన్ని శాఖల విభజన.. సిబ్బంది కేటాయింపు.. శాశ్వత భవనాలు.. నిధులు.. ఇతర వనరుల కల్పన పూర్తిస్థాయిలో జరగలేదు. పలు సమస్యలపై కార్యాలయాలను ఆశ్రయించే వారితోపాటు.. నిరంతరం విధులు నిర్వహించే వారినీ సౌకర్యాల లేమి వేధిస్తోంది.  కాకినాడ కలెక్టరేట్‌తోపాటు.. ఇతర జిల్లా కార్యాలయాల నుంచి కొంత ఫర్నిచర్‌ సర్దుబాటుచేసి.. కంప్యూటర్లు, ఇతర ప్రాథమిక వసతులు సమకూర్చారు. దస్త్రాలు భద్రపరిచే విభాగాలు కొన్నిచోట్ల ఏర్పాటుచేయాల్సి ఉంది.

కోనసీమలో  పనులు జాప్యం

అమలాపురంలో డీఆర్‌డీఏ సాంకేతిక- శిక్షణ కేంద్రంలో కలెక్టరేట్‌, మరో అద్దె భవనంలో ఎస్పీ కార్యాలయం నడుస్తోంది. అమలాపురంలో డివిజన్‌ కార్యాలయాలనే కొన్ని శాఖలు జిల్లా కార్యాలయాలుగా మార్చి నెట్టుకొస్తున్నాయి. ముమ్మిడివరంలో ఎయిమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల భవనంలో 40 వరకు జిల్లా కార్యాలయాలు పెట్టినా అరకొర వసతులే శరణ్యం. కలెక్టరేట్‌లో స్పందనకు వచ్చే వందల మందికి వసతి లేక బయట టెంట్లు, కుర్చీలు వేస్తున్నారు. ముమ్మిడివరంలో కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన పనులు కొన్ని జరిగాయి. కేటాయించిన రూ.2 కోట్లు చాలక కొన్ని పనులు చేపట్టలేదు. కీలక శాఖలకు దస్త్రాలు భద్రపరిచే వసతీ లేదు. జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ముమ్మిడివరంలో పెట్టినా.. సౌకర్యాలు లేక అమలాపురం ఈఈ కార్యాలయంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ క్యాబిన్లు ఏర్పాటుచేసినా.. ఇతర వసతుల్లేవు. డ్వామాలో జిల్లా విజిలెన్స్‌ అధికారి కార్యాలయం, అబ్కారీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ తదితర కార్యాలయాల్లోనూ వసతులు లేవు.

తూర్పున  సౌకర్యాలు అంతంతే

తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టరేట్‌ బొమ్మూరు న్యాక్‌ భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ పౌరసరఫరాలు, సీపీవో, వ్యవసాయ, సర్వే- భూమి రికార్డులు, గృహ నిర్మాణ కార్యాలయాలు ఉన్నాయి. సమీప గిరిజన యువత శిక్షణ కేంద్రం భవనంలో 13 ప్రధాన కార్యాలయాలు పెట్టారు. న్యాక్‌ భవనంలో కలెక్టరేట్‌లో విభాగాలు, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలకు సౌకర్యాలు సమకూరినా.. పరిపాలన విభాగంలో కార్యకలాపాలు నేటికీ పూర్తిగా జరగడంలేదు. కొన్ని కార్యకలాపాలు కాకినాడ నుంచే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల సర్వీసు విషయాలు, ఇంక్రిమెంట్లు, బదిలీలు కాకినాడ నుంచే సాగుతున్నాయి. కొత్త కలెక్టరేట్‌ పెట్టినా రెగ్యులర్‌ పోస్టులు మంజూరు కాలేదు. ఇక్కడ జిల్లా అధికారులు, కొందరు కిందిస్థాయి అధికారులు తప్ప మిగిలిన ఉద్యోగులు డిప్యుటేషన్‌ మీద వచ్చారు. జిల్లా సివిల్‌ సప్లయి కార్యాలయంలో డీఎస్‌వో తప్ప మిగిలిన సిబ్బంది అంతా ·డిప్యూటేషన్‌పై వచ్చినవారే. కీలక శాఖల్లో పొరుగు సేవల సిబ్బందితో నెట్టుకొస్తున్నారు కీలక శాఖలను ఫర్నిచర్‌, వసతుల కొరత వేధిస్తోంది. కలెక్టరేట్‌లో పార్కింగ్‌ వసతి లేక.. ఎండలో వాహనాలు నిలుపుతున్నారు. కలెక్టరేట్‌ ముందు ఆవరణ కొంత అభివృద్ధి చేసినా చుట్టూ ముళ్లచెట్లు పెరిగాయి.

కాకినాడలో  కొలిక్కిరాని విభజన..

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా.. శాఖల విభజన జరగకపోవడం, సిబ్బంది పూర్తిస్థాయిలో లేక కొన్ని శాఖల పరిధిలో కాకినాడ నుంచే పాలన నడుస్తోంది. జడ్పీ విభజనకు ఇంకా గడువు ఉండడంతో కాకినాడ నుంచే పాలన సాగుతోంది. బీసీ- ఎస్సీ- మైనార్టీ శాఖల విభజన కొలిక్కిరాలేదు. కాలుష్య నియంత్రణ మండలి, సమగ్ర శిక్ష, వయోజన విద్య, విభిన్న ప్రతిభావంతులు- హిజ్రాలు- వయోవృద్ధుల సంక్షేమం, ఉపాధి కల్పన, అనిశా, సీఐడీ, ఆరోగ్యశ్రీ ఇలా పలు శాఖల్లోనూ ఇంతే. ఆయా శాఖల పనులపై కాకినాడ లేదా రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది.

ఏడెకరాల్లో శాశ్వత ప్రాంగణం..

ఆజాద్‌చౌక్‌ ప్రాంతంలో ఏడు ఎకరాల్లో శాశ్వత కలెక్టర్‌ కార్యాలయం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుత తాత్కాలిక భవనం దగ్గర స్పందన, ఇతర వసతులు సమకూర్చాం. కీలక శాఖల్లో జిల్లా అధికారుల కొరత లేదు. కింది స్థాయి సిబ్బందిని సర్దుబాటుచేశాం. శాఖల వారీగా ఖాళీల అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కంప్యూటర్లు, ఫర్నిచర్‌ అన్ని శాఖలకు సమకూర్చాం. మిగిలిన అవసరాలు, వసతులు, పార్కింగ్‌ సమస్యలు ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తాం.

 కె.మాధవీలత, కలెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని