logo

కళాతపస్వి.. ఇల యశస్వి

టి.నగర్‌, ఆత్రేయపురం, పి.గన్నవరం: కళాతపస్విగా పేరొందిన దర్శకుడు.. కె.విశ్వనాథ్‌ ఇక లేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు

Updated : 03 Feb 2023 06:25 IST

విశ్వనాథ్‌తో రాఘవరావు, జిత్‌మోహన్‌మిత్ర

టి.నగర్‌, ఆత్రేయపురం, పి.గన్నవరం: కళాతపస్విగా పేరొందిన దర్శకుడు.. కె.విశ్వనాథ్‌ ఇక లేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. వెండి తెరపై తూరుపు అందాలను.. గోదారి కట్టూబొట్టు.. యాస భాషను అపురూపంగా తీర్చిదిద్దిన కళాశిల్పి.. విశ్వనాథ్‌ మరి లేరని తెలిసి ప్రతి మది తల్లడిల్లుతోంది.

ప్రకృతి ప్రసాదిత స్టూడియో...

‘‘తూర్పుగోదావరి జిల్లా... ‘ప్రకృతి ప్రసాదించిన స్టూడియో’. పంట కాలువలు, కొబ్బరి తోటలు, నర్సరీలు, గోదావరి గలగలలు, పూత రేకులు ఇలా ఒకటేమిటి అన్నీ ఆకట్టుకునేవే. ఇక్కడి భాష, యాసతో కళాకారులు చిత్రసీమలో రాణించవచ్చనేది నా ప్రగాఢ విశ్వాసమని’’ కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తూర్పుపై తన మమకారాన్ని తెలియజెప్పారు. విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలు తూర్పు అందాలతో రూపుదిద్దుకున్నాయి. వాటిలో ముఖ్యంగా కె.విశ్వనాథ్‌ దర్శకుడిగా నిర్మితమైన ‘జీవనజ్యోతి’ సినిమాలో కొంతభాగం కోనసీమలో పి.గన్నవరంలోని అక్విడెక్టు వద్ద పడవల సెట్టింగ్‌తో చిత్రీకరణ చేశారు. ఈ చిత్రంలో హీరో శోభన్‌బాబు, హీరోయిన్‌ వాణిశ్రీ మీద ‘చిన్నియో చిన్ని.. సన్నజాజుల చిన్ని’ అనే పాటను ఇక్కడ చిత్రీకరించారు. సీతానగరం మండలం పూడిపల్లిలో.. చిరంజీవి హీరోగా ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో కొన్ని భాగాలను చిత్రీకరించారు.
* ఆత్రేయపురం అంటే విశ్వనాథ్‌కు ఎనలేని అభిమానం. ఆయన లొల్ల లాకుల వద్ద పలుచిత్రాలు తెరకెక్కించారు. ఒక సీరియల్‌ కూడా ఇక్కడ తీశారు.
ఇటీవల ఆత్రేయపురం లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త పాతపాటి వెంకట సత్యనారాయణ రాజు ఆయన్ను ఘనంగా సత్కరించారు. అక్కడి వేదపాఠశాల విద్యార్థులను విశ్వనాథ్‌ అభినందించారు.

గోదావరితో అనుబంధం

కె.విశ్వనాథ్‌కు... గోదావరితో విడదీయలేని అనుబంధం. ఆయనకు ఘనకీర్తి తెచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో చిత్రీకరించడం గమనార్హం. ఆదుర్తి సుబ్బారావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన రోజుల్లో ఆయన చిత్రం ‘మూగ మనసులు’ తొలి ఔట్‌డోర్‌ సినిమాగా నిలిచింది. ఆ చిత్రం 90 శాతం గోదావరి ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆపై విశ్వనాథ్‌.. దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆణిముత్యాలుగా నిలిచిన చిత్రాలన్నీ ఎక్కువ శాతం ఇక్కడ షూటింగ్‌ జరుపుకొన్నవే.

* శంకరాభరణం...

ముఖ్యంగా 1980లో విడుదలైన శంకరాభరణం రాజమహేంద్రవరంలో చిత్రీకరించారు. దానవాయిపేట, ప్రకాశంనగర్‌ ప్రాంతాలతోపాటు కోర్టు సీను నగరపాలక సంస్థ పాత కార్యాలయంలో చిత్రీకరించారు. ఇక చిత్రం క్లైమాక్స్‌ మొత్తం జాంపేట ఉమారామలింగేశ్వర కల్యాణ మండపంలో చిత్రీకరించారు. ఇటీవల ఆ చిత్రం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆప్తుడు జిత్‌మోహన్‌ మిత్ర, ఆయన మిత్ర బృందం హైదరాబాద్‌ వెళ్లి విశ్వనాథ్‌ను కలిశారు. ప్రముఖ జర్నలిస్టు రాఘవరావు 40 ఏళ్ల శంకరాభరణం, నగరంలో చిత్రీకరణ సమయంలో చోటుచేసుకొన్న సన్నివేశాలతో రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు.

* సిరిసిరిమువ్వ...

ఇక సిరిసిరిమువ్వతో జయప్రద స్టార్‌గా నిలిచారు. ఆ సినిమా నగరంలోని క్వారీ ప్రాంతంలో శివాలయంలో పాటను చిత్రీకరించగా, మిగిలిన భాగం చుట్టుపక్కల చిత్రీకరించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. సిరిసిరిమువ్వ హిందీ భాషలో మళ్లీ చిత్రీకరించగా, అవే సన్నివేశాలు మళ్లీ అక్కడే చిత్రీకరించడం గమనార్హం.

* స్వాతిముత్యం...

ముఖ్యంగా స్వాతిముత్యంలో విలక్షణ నటుడు కమల్‌హాసన్‌, రాధిక నటించగా, వారి ఇద్దరు కలిసిన సన్నివేశాలు గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిత్రీకరించారు. సువ్వి సువ్వి పాట కూడా గోదావరి మధ్యలో ఇసుక తిన్నెల్లో చిత్రీకరించారు.

* సూత్రధారులు..

అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్‌ కలిసి నటించిన ‘‘సూత్రధారులు’’ కపిలేశ్వరపురం జమీందారు చంటి దొర బంగ్లాలో ఎక్కువ భాగం చిత్రీకరించగా, చుట్టుపక్కల మొత్తం సినిమా పూర్తి చేశారు. ఇక చివరి చిత్రం ‘‘శుభప్రదం’’ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి బ్యాక్‌డ్రాప్‌లో చాలా వరకు అక్కడే షూటింగ్‌ జరుపుకొంది. ఇక్కడే చిత్రీకరించిన 1980లో శంకరాభరణం జాతీయ ఉత్తమ కుటుంబ చిత్రంగా, 1986లో చిత్రీకరించిన స్వాతిముత్యం జాతీయ ఉత్తమ చలన చిత్రంగా అవార్డులు సాధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు