logo

దశ తిరగాలంటే.. దిశ మార్చుకోవాలి

విద్యార్థి దశలో ఇంటర్మీడియట్‌ చాలా కీలకం. ఆ తరువాత ఏం చదవాలనుకుంటున్నామో.. ఏ కోర్సు ఎంపిక చేసుకుంటున్నామో మరింత ముఖ్యం.

Published : 03 Feb 2023 06:25 IST

‘ఈనాడు-కేఎల్‌ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్యార్థులకు అవగాహన సదస్సు
న్యూస్‌టుడే, కంబాలచెరువు(రాజమహేంద్రవరం)

అవగాహన సదస్సుకు హాజరైన విద్యార్థులు

విద్యార్థి దశలో ఇంటర్మీడియట్‌ చాలా కీలకం. ఆ తరువాత ఏం చదవాలనుకుంటున్నామో.. ఏ కోర్సు ఎంపిక చేసుకుంటున్నామో మరింత ముఖ్యం. అదే మన భవితను నిర్దేశిస్తుంది. అందుకే విద్యార్థులు ఇంటర్‌ చదివేటప్పుడే ఆపై ఉన్నత చదువులు ఎక్కడ చదవాలి? ఏ కోర్సు చేయాలి.. దానికి ఉండే ఉపాధి అవకాశాలు ఏంటి? అని ఆలోచిస్తారు. ఇలాంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి ‘ఈనాడు-కేల్‌ యూనివర్సిటీ’ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ‘దశ-దిశ’ పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాతేరు తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో జరిగిన సదస్సుకు విశేష స్పందన లభించింది. ఇంటర్‌ తరువాత ఇంజినీరింగ్‌లో విద్యార్థులు ఎలాంటి కోర్సులను ఎంచుకోవాలి.. ఒక నైపుణ్యంతో కూడిన ఇంజినీర్‌గా ఎలా ఎదగాలి.. రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలపైనే వార్షిక వేతనాలు పొందేలా ఎలా సన్నద్ధమవ్వాలి.. దానికి సంబంధించి కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థులను ఎలా సన్నద్ధం చేస్తుందనే విషయాలను కేఎల్‌యూ అడ్మిషన్స్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొబ్బిలి సత్యనారాయణమూర్తి వివరించారు. ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది తరువాత బ్రాంచి మార్పు, మళ్లీ కోర్సులు చేయడం, ఇంజినీరింగ్‌ కోర్సులో కొంతకాలం విదేశీ వర్సిటీలో ఇంటర్న్‌షిప్‌ వంటి అవకాశాలను క్షుణ్నంగా వివరించారు. సదస్సుకు హాజరైన విద్యార్థులకు కేఎల్‌యూ కిట్లు, కూపన్లు అందజేశారు. అనంతరం లక్కీడ్రా తీసి ఎంపికైన నలుగురు
విద్యార్థులకు తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు, కేఎల్‌ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు, ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌ప్రసాద్‌ చేతులమీదుగా బహుమతులు అందజేశారు.
తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ తిరుమలరావును సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల ప్రిన్సిపల్‌ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

నాలుగేళ్లలో 40 సంవత్సరాల భవిత

ఇంటర్‌ తరువాత నాలుగేళ్లు చదివే కోర్సు విద్యార్థుల 40 ఏళ్ల భవితను నిర్దేశిస్తుంది. మనకు నచ్చిన కోర్సును సరైన విద్యాసంస్థలో చదవడమే ముఖ్యం. అప్పుడే నైపుణ్యం పెరిగి అవకాశాలు రెట్టింపవుతాయి. ఏటా సుమారు పది లక్షల మంది జేఈఈ రాస్తుండగా ప్రభుత్వ వర్సిటీల్లో కేవలం 50 వేల మందికి మాత్రమే సీట్లు వస్తున్నాయి. దేశంలో మొత్తం ఉన్న మూడు వేల వర్సిటీల్లో కేంద్ర ప్రభుత్వం టాప్‌-100 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్‌లు ఇస్తుంది. మిగిలిన వారు ఈ విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలి. కేఎల్‌ వర్సిటీలో ఎంపిక చేసుకున్న కోర్సు నుంచి ఏడాది తరువాత మారే అవకాశం కల్పిస్తున్నాం. ఇంటర్‌ మార్కులు, కేఎల్‌ వర్సిటీ పరీక్షలో ప్రతిభ, జేఈఈ స్కోర్‌ ఆధారంగా మెరుగ్గా రాణించే విద్యార్థులకు వంద శాతం ఉపకార వేతనాలు అందజేస్తున్నాం. ఇంజినీరింగ్‌ కోర్సు చేస్తుండగానే మరో మైనర్‌ డిగ్రీ చేసేందుకు ప్రస్తుతం వీలుంది. ఈ విధంగా ప్రయత్నిస్తే త్వరితగతిన ఎక్కువ వేతనంతో ఉపాధి అవకాశాలుంటాయి. నచ్చిన ఉపాధ్యాయుడు నచ్చిన సమయంలో క్లాస్‌ వినేలా ఛాయిస్‌ బేస్డ్‌ వ్యవస్థ ఉన్న మల్టీ కోర్సుల కళాశాలనే విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి. విదేశాల్లో చదివేందుకు వీలుగా పలు విదేశీ వర్సిటీలతో ఒప్పందం ఉన్న సంస్థల్లోనే చేరాలి.
 జె.శ్రీనివాసరావు, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌, కేఎల్‌ యూనివర్సిటీ


మల్టీ కోర్సులతో ఉపాధి అవకాశాలు

ప్రస్తుతం కొత్త విద్యావిధానం ద్వారా అందుబాటులోకి వచ్చిన మల్టీ కోర్సులతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంజినీరింగ్‌ చదువుతూనే మరొక కోర్సు మైనర్‌ డిగ్రీలా చేస్తే ప్రముఖ సంస్థల్లో అధిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. లెర్నింగ్‌లోనే ఎర్నింగ్‌ ఉండేలా ముందు నుంచే సన్నద్ధమవ్వాలి. సామాజిక మాధ్యమాల్లో సమయం వృథా చేయకుండా ఎంచుకున్న కోర్సులో నైపుణ్యం సాధించగలిగితే మీకు మీరే సాటి. ఇంటర్‌ తరువాత చదివే విద్యాసంస్థలో నాలుగేళ్లపాటు తీసుకునే శిక్షణ, ఆ స్ఫూర్తి, చేసిన వర్క్‌, ఆ కల్చర్‌ ఎంతో కీలకం. దాని ద్వారానే మన భవిష్యత్తు నిర్దేశితమవుతుంది. భవిష్యత్తులో ఇన్‌పర్సన్‌ కమ్యూనికేషన్‌ తగ్గిపోతుంది. దీని కోసం చాలా వర్సిటీల్లో సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్పుతున్నారు. చదువు, క్రమశిక్షణ, నాలెడ్జ్‌ వల్ల తిరుమల విద్యార్థులు ఎక్కడున్నా తెలిసిపోతుంది. మా విద్యార్థులను ఇంత తీర్చిదిద్దాక మంచి వర్సిటీకే వెళ్లాలని చెబుతాం.  
 నున్న తిరుమలరావు, తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని