logo

పిల్లలకు మాతృభాష మాధుర్యం రుచి చూపాలి

తెలుగుభాష సాహిత్య మాధుర్యాలను పిల్లలకు తెలియజేయాలని నన్నయ వీసీ ఆచార్య జి.వి.ఆర్‌.ప్రసాదరాజు అన్నారు.

Updated : 03 Feb 2023 06:37 IST

రఘునాథశర్మ సత్కారంలో అతిథులు

నన్నయ విశ్వవిద్యాలయం (రాజానగరం), న్యూస్‌టుడే: తెలుగుభాష సాహిత్య మాధుర్యాలను పిల్లలకు తెలియజేయాలని నన్నయ వీసీ ఆచార్య జి.వి.ఆర్‌.ప్రసాదరాజు అన్నారు. ప్రాచీన తెలుగు సాహిత్యం - చారిత్రక, సామాజిక, సాంస్కృతిక దృక్పథాలు అనే అంశంపై నన్నయ విశ్వవిద్యాలయంలో మూడు రోజులు నిర్వహించనున్న జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, భారతీయ భాషా సంస్థ మైసూరు, నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య ప్రసాదరాజు మాట్లాడారు. మన ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేసిన మల్లాడి సత్యనాయకర్‌ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారతీయ భాషా సంస్థ మైసూర్‌ డైరెక్టర్‌ ఆచార్య శైలేంద్రమోహన్‌ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని వివరించారు. డిప్యూటీ డైరెక్టర్‌ ఆచార్య సి.వి.రామకృష్ణ మాట్లాడుతూ ప్రాచీన తెలుగు సాహిత్యం, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక దృక్పథాలకు సంబంధించిన విషయాలను చర్చించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ తెలుగు ఔనత్యాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత తెలుగు ప్రజలు అందరిపైనా ఉందన్నారు.  తానా ప్రపంచ సాహిత్య వేదిక (అమెరికా) నిర్వాహకులు తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రాచీన తెలుగుభాషా సాహిత్యం, చారిత్రక, సామాజిక, సాంస్కృతికి కృషి చేసిన మహానీయుల గురించి వివరించారు. అనంతరం అతిధులను సత్కరించారు. నన్నయ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ సహాయ ఆచార్యులు డా.తరపట్ల సత్యనారాయణ కన్వీనర్‌గా వ్యవహరించారు. మైసూరు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆర్‌.వి.ఎస్‌.సుందరం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు శలాక రఘునాథశర్మ, రిజిస్ట్రార్‌  టి.అశోక్‌, ప్రిన్సిపల్‌ ఎస్‌.టేకి, ఎస్‌కెవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖాధ్యక్షులు డా.పి.వి.వి.సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని