logo

అన్నవరంలో విశ్వశాస్త్రం

కళాతపస్వి కె.విశ్వనాథ్‌.. సినీ కళామతల్లికి స‘కళ’ నీరాజనాలు అర్పించటమే కాదు.. అన్నవరం సత్యదేవుడిని అంతే కళాత్మకంగా.. సభక్తికంగా అర్చించారు.

Published : 04 Feb 2023 05:25 IST

అన్నవరం, ప్రత్తిపాడు: కళాతపస్వి కె.విశ్వనాథ్‌.. సినీ కళామతల్లికి స‘కళ’ నీరాజనాలు అర్పించటమే కాదు.. అన్నవరం సత్యదేవుడిని అంతే కళాత్మకంగా.. సభక్తికంగా అర్చించారు. ఆ మహనీయుని మాటే మంత్రంగా.. దేవస్థానంలో కీలకమైన అంశాలు ఆచరణలోకి వచ్చాయి.

సుప్రభాతం.. భక్తిగీతం

స్వామికి సుప్రభాతం, భక్తిపాటలు ఉండాలనేది కళాతపస్వి ఆకాంక్ష. అధ్యాపకునిగా ఉండే మహాసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మను అప్పట్లో దేవస్థానానికి పంపారు. వారం రోజులు నాగఫణిశర్మ అన్నవరంలోనే ఉండి సుప్రభాతం.. ‘కల్యాణం కల్యాణం కమనీయం’.. తెప్పోత్సవం విశిష్టత వివరించే ‘క్షీరాబ్ది ద్వాదశి విభుని’  ఇలా 5 పాటలు రాశారు. పాటల రికార్డింగ్‌ కోసం ఆలయ ఈవో, దేవస్థానం సిబ్బందిని చెన్నైకి పిలిపించారు. సంగీత దర్శకుడు కేవీ మహదేవన్‌కు స్వరాలు కూర్చే బాధ్యత అప్పగించారు. దీంతో పుహళేంది చక్కని బాణీలు అందించడంతో స్వరబ్రహ్మ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్‌.జానకి ఆ భక్తిగీతాలను ఆలపించారు. ఆ ఐదు భక్తిగీతాలు పంచరత్నాల్లా జనబాహుళ్యంలోకి వెళ్లాయి. విశేష ఆదరణ పొందాయి. ఇప్పటికీ ఆ గీతాలే స్వామి సన్నిధి నుంచి అంతటా వినిపిస్తూ ఉంటాయి  సుప్రభాతాన్ని వేదపండితులతో ఆలపించాలని చెన్నై తీసుకెళ్లి రికార్డింగ్‌ చేయించారు. నిత్యం ఆలపించే సుప్రభాతం.. ఆపై మంగళాశాసనం విశ్వనాథ్‌ ఆలోచన నుంచి వచ్చిన ఆరాధనే.


సూచన.. ఆలంబన

పూర్వం ధ్వజస్తంభం ఉండే స్పెషల్‌ వ్రతాల మండపంలోనే సత్యదేవుని వార్షిక కల్యాణం అర్ధరాత్రి జరిగేది. ఇప్పుడున్న కల్యాణవేదిక రూపుదిద్దుకోవడానికి శంకరాభరణం సినిమా వేళ కళాతపస్వి చేసిన సూచనే ఆలంబనని విశ్రాంత డీవైఈవో జగన్నాథరావు తెలిపారు. అన్నవరంలో వారం రోజులు సినిమా చిత్రీకరణకు ఉన్నపుడు పూజల నుంచి కల్యాణం వరకు అన్నింటిని విశ్వనాథ్‌ అధ్యయనం చేశారు. శిల్పకళ ఉట్టిపడేలా చెక్కతో కల్యాణ వేదికను ఆయనే సూచించారు. ః శంకరాభరణం,  సూత్రధారులు.. స్వాతికిరణంలో కొన్ని సన్నివేశాలు అన్నవరంలో చిత్రీకరించారు. శుభప్రదం సినిమాకు పంపా తీరంలో కళాత్మక సెట్టింగు వేసి సన్నివేశాలు తెరకెక్కించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని