logo

గడప దాటని పనులు..!

కాకినాడ జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదు.

Updated : 05 Feb 2023 06:08 IST

గొల్లప్రోలు: చెందుర్తిలో డ్రెయిన్‌ నాణ్యత తనిఖీ

కాకినాడ కలెక్టరేట్‌, పెద్దాపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదు. ఇప్పటికే జీజీఎంపీ పూర్తయిన గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మంజూరైన పనులు కొన్ని చోట్ల ప్రారంభానికి నోచుకోక, మరిన్ని చోట్ల అర్ధాంతరంగా నిలిచిపోయి ఎక్కడికక్కడ వెక్కిరిస్తున్నాయి. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా.. స్థానిక ఎమ్మెల్యే, వైకాపా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం పూర్తి చేసిన సచివాలయాల పరిధిలో రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, తాగునీటి వనరులు, ఇతర పనులకు సంబంధిత అధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపి, కలెక్టర్‌ నుంచి పరిపాలనామోదం తీసుకుంటున్నారు. జిల్లా పరిధిలో 620 సచివాలయాలుండగా, ఇప్పటికి 169 చోట్ల మాత్రమే జీజీఎంపీ పూర్తి చేయగా, రూ.33.17 కోట్ల విలువైన 976 పనులు ప్రతిపాదించారు. వీటిలో ఇప్పటికి 169 పనులు మాత్రమే పూర్తి చేశారు.

నామినేషన్‌ విధానంలో కట్టబెట్టినా..

పట్టణాలు, పల్లెల్లో రూ.5లక్షలలోపు పనులను నామినేషన్‌ పద్ధతిలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు కట్టబెట్టినా ముందుకు సాగడంలేదు. కేవలం ప్రజాప్రతినిధులతో కొబ్బరి కాయలు కొట్టించి, శంకుస్థాపనలు చేసి మమ అనిపిస్తున్నారు. బిల్లులు వస్తాయో.. రావో అనే సందేహంతో ఎవరూ ముందుకు రావడంలేదు. ఇప్పటికే జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ప్రభుత్వ శాశ్వత భవనాలను వైకాపా నాయకులు, కార్యకర్తలు నిర్మించి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. జీజీఎంపీ ద్వారా చేపట్టిన పనులకు తొలుత కలెక్టర్‌ పీడీ ఖాతా ద్వారా బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి.. ఆ తరుతవాత పే అండ్‌ అకౌంట్స్‌ ద్వారా బిల్లులను ఆమోదించి, సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లిస్తామని చెప్పడంతో అంతా వెనుకంజ వేస్తున్నారు.

ఎప్పటికి పూర్తవుతాయో..

జిల్లాలోని 620 సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.124 కోట్లు మంజూరు చేసింది. ప్రతి సచివాలయం పరిధిలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో వైకాపా ఎంపీపీలు, మున్సిపల్‌ ఛైర్మన్లు ప్రతీ ఇంటిని సందర్శించాలని నిబంధన విధించారు. వాలంటీరు సంబంధిత ప్రజాప్రతినిధి ఇంటిని సందర్శించినట్లు ఫోటో తీసి, జీజీఎంపీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే నిధులు విడుదల అయ్యేలా కొర్రీలు వేశారు. సచివాలయం పరిధిలో నూరు శాతం గృహాలను సందర్శిస్తేనే, ఆ సచివాలయానికి నిధులు ఇస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 400 సచివాలయాల్లో జీజీఎంపీ పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పటికి పూర్తిచేస్తారో వారికే తెలియాలి.

పెద్దాపురం పట్టణంలో జీజీఎంపీ ద్వారా నాలుగు వార్డు సచివాలయాల పరిధిలో రూ.80 లక్షల విలువైన అయిదు పనులకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. ఒక గుత్తేదారు 21వ వార్డులో రూ.2.50 లక్షలతో రోడ్డు, డ్రెయిన్‌ నిర్మాణానికి టెండరు వేసి పనులు దక్కించుకున్నారు. అయితే ఇప్పటికీ పనులు చేపట్టలేదు.

పెద్దాపురం మండలంలోని 15 గ్రామ సచివాలయాల పరిధిలో రూ.3 కోట్ల విలువైన పనులకు ప్రజాప్రతినిధులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించినా, మరికొన్నిచోట్ల ప్రారంభానికి నోచుకోలేదు. బిల్లులురావనే భయంతో గుత్తేదారులు, వైకాపా నాయకులు వెనుకంజ వేస్తున్నారు. మిగతా అయిదు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి.  

కాకినాడ నగర నియోజకవర్గంలో 86 వార్డు సచివాలయాలుండగా 27 సచివాలయాల పరిధిలో  జీజీఎంపీ పూర్తయింది. ఇక్కడ 117 పనులకుగాను 81 పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతుండగా, మిగతా పనులు ప్రారంభించలేదు. నగరపాలక సంస్థ పరిధిలో సాధారణ నిధులతో చేపట్టిన వివిధ పనులకు రూ.18 కోట్ల మేర బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌ పెండింగ్‌లో ఉన్నాయి.

చెల్లింపునకు ఇబ్బంది లేదు..

గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా కాలువలు, కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నాం. ఇప్పటికి పూర్తయిన పనుల్లో ఏడింటికి సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెట్టాం. రూ.20 లక్షల మేర గుత్తేదారులకు జమ అయ్యాయి. ఇంకా 15 బిల్లులు నమోదు చేయాల్సి ఉంది. రూ.5 కోట్ల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నాం.
ఎం.శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ


నాలుగు బిల్లులు చెల్లించాం..

జిల్లాలో జీజీఎంపీ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి రూ.20 లక్షల వరకు చెల్లింపులు జరిగాయి. మిగతా పనులకు బిల్లులు పెడుతున్నాం. అన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తే వెంటనే బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నాం.
ఎం.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు