logo

మహిమాన్వితం.. చక్రస్నానోత్సవం

మాఘ పౌర్ణమి పర్వదినం వేళ అంతర్వేది తీరం భక్తజన సంద్రంగా మారింది. మహిమాన్విత దివ్య సుదర్శన పెరుమాళ్‌ చక్రస్నానోత్సవంలో అంతా భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు.

Published : 06 Feb 2023 05:11 IST

స్వామివారికి అవభృథోత్సవం

న్యూస్‌టుడే, అంతర్వేది, మామిడికుదురు: మాఘ పౌర్ణమి పర్వదినం వేళ అంతర్వేది తీరం భక్తజన సంద్రంగా మారింది. మహిమాన్విత దివ్య సుదర్శన పెరుమాళ్‌ చక్రస్నానోత్సవంలో అంతా భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు. ఆదివారం స్వామిని గరుడ పుష్పక వాహనంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలతో సముద్రం చెంతకు తీసుకెళ్లారు. అక్కడ అవభృథోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. 16 చేతులు, 16 ఆయుధాలతో చుట్టూ జ్వాలలు, వెనుక సుదర్శన యంత్రం, కింది భాగంలో గరుడ వాహనంతో ఉన్న చక్రపెరుమాళ్‌ను అర్చకులు, వేద పండితులు శిరస్సున పెట్టుకుని సముద్ర జలాలతో అభిషేకించారు.

స్వామివారిని (చక్రపెరుమాళ్లు) తీసుకొస్తున్న పేరూరు బ్రాహ్మణులు

ఆ శుభ తరుణం కోసం ఎదురుచూస్తున్న భక్తులు దిక్కులు మార్మోగేలా నారసింహ స్మరణతో పుణ్యస్నానాలు చేశారు. ఆలయ ఛైర్మన్‌ కుమార రామగోపాలరాజా బహదూర్‌, ఎమ్మెల్యే చిట్టిబాబు, ఆర్డీవో వసంతరాయుడు, డీఎస్పీ రమణ తదితరులు సుదర్శన పెరుమాళ్‌ను దర్శించుకుని సముద్ర స్నానాలు చేశారు. అనంతరం వసంతోత్సవం చేసిన తర్వాత
పదహారు స్తంభాల మండపం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేకార్చనలు జరిపారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణతో స్వామికి ధూపసేవ చేశారు. సోమవారం తెప్పోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని