logo

ప్రాణాలు కాపాడే యాప్‌లు..

ప్రమాదాల్లో తీవ్ర గాయాలైనపుడు, గర్భిణులకు ప్రసవ సమయంలో, శస్త్రచికిత్సలు జరిగేటపుడు రక్తం ఎంతో అవసరం. పలు సందర్భాల్లో అత్యవసర సమయాల్లో రక్తం అందక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.

Published : 06 Feb 2023 05:11 IST

న్యూస్‌టుడే, చాగల్లు

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల యాప్‌లు

ప్రమాదాల్లో తీవ్ర గాయాలైనపుడు, గర్భిణులకు ప్రసవ సమయంలో, శస్త్రచికిత్సలు జరిగేటపుడు రక్తం ఎంతో అవసరం. పలు సందర్భాల్లో అత్యవసర సమయాల్లో రక్తం అందక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. చాలామంది రక్తం ఎక్కడ దొరుకుతుంది, ఎవర్ని అడగాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. మధ్యవర్తులను ఆశ్రయించి అధికంగా ఖర్చు చేస్తారు. ప్రైవేటు కేంద్రాల్లో వారు ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్తనిధులకు సంబంధించి రెండు యాప్‌లను రూపొందించాయి. వీటిలో రక్త నిల్వలకు సంబంధించి పూర్తి సమాచారం ఉంటుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో..

రక్తం కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా, అరచేతిలో సమాచారం లభించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో రెండు యాప్‌లు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో ‘ఏపీ బ్లడ్‌ సెల్‌’, కేంద్రం ఆధ్వర్యంలో ‘ఈ రక్త్‌ కోశ్‌’ అనే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌ల్లో రక్తనిధి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, మనకు అవసరమైన రక్తం ఎక్కడ దొరుకుతుంది, ఎంత దూరం వెళ్లాలి, బ్లడ్‌ బ్యాంకు ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలన్నీ ఉంటాయి.

డౌన్‌లోడ్‌ ఇలా..

గూగుల్‌ ప్లే స్టోరులోకి వెళ్లి ఆయా పేర్లతో టైప్‌ చేస్తే యాప్‌లు కనిపిస్తాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని, వారు అడిగిన వివరాలు పొందుపరిచి అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వాలి. అందులో మీకు కావాల్సిన రక్తం గ్రూపు వివరాలతో సెర్చ్‌ చేస్తే సంబంధిత వివరాలు వస్తాయి. వీటితో పాటు ఆ రక్తనిధి కేంద్రం ప్రభుత్వం, ప్రైవేటు లేదా స్వచ్ఛంద సంస్థల్లో దేని ఆధ్వర్యంలో నడుస్తుందో తెలుసుకోవచ్చు.


ఎంతో ఉపయోగం..

నాగమణి, డ్రగ్స్‌ ఏడీఈ, రాజమహేంద్రవరం

అత్యవసర సమయాల్లో రక్తం ఎవరిని అడగాలో తెలియక చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. అటువంటి వారికి ఈ యాప్‌లు ఎంతో ఉపయోగపడతాయి. ఏయే కేంద్రాల్లో ఏఏ గ్రూపులు ఉన్నాయి, ఎంత మొత్తం ఉంది తదితర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. అవసరమైన వారు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని