ఆక్వారంగం.. ఆశాభంగం..!
డాలర్ల పంటగా చెప్పే ఆక్వారంగం నానాటికీ ప్రాధాన్యం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంతకాలంగా విదేశాలకు ఎగుమతుల్లేక, గిట్టుబాటు ధరల్లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు ప్రభుత్వం తాజాగా మరో ఝలక్ ఇచ్చించి.
న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్
అల్లవరంలో ఓ రొయ్యల చెరువు
డాలర్ల పంటగా చెప్పే ఆక్వారంగం నానాటికీ ప్రాధాన్యం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొంతకాలంగా విదేశాలకు ఎగుమతుల్లేక, గిట్టుబాటు ధరల్లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు ప్రభుత్వం తాజాగా మరో ఝలక్ ఇచ్చించి. రొయ్యల చెరువులకు ఇప్పటివరకు అందిస్తున్న విద్యుత్తు రాయితీని ఈ-ఫిష్ సర్వే ఆధారంగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీని ఆధారంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా సగంపైగా ఆక్వా సర్వీసులకు ఫిబ్రవరి నుంచి విద్యుత్తు రాయితీని ఎత్తి వేశారు. తాజా నిర్ణయంతో రైతులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ-ఫిష్ సర్వే ఆధారంగా జాబితా..
రెండుమూడు నెలలుగా క్షేత్ర స్థాయిలో సచివాలయ మత్స్యశాఖ సహాయకులతో ఈ-ఫిష్ సర్వే నిర్వహించి, దాని ఆధారంగా విద్యుత్తు రాయితీకి అర్హులైన రైతుల జాబితా రూపొందించి, వారికి మాత్రమే రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సర్వే నంబర్ల ఆధారంగా అక్కడ సాగవుతున్న పంటను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆక్వా జోన్‌లో ఉండి, నిబంధనలకు అనుగుణంగా సాగవుతున్న రొయ్యల చెరువులను మాత్రమే సిబ్బంది ఆన్‌లైన్ చేశారు. దీంతో ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతుల ప్రకారం సాగవుతున్న చెరువులకు మాత్రమే రాయితీ వర్తింపచేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా సాగవుతున్న
చెరువులకు రాయితీ తొలగించనున్నట్లు తెలుస్తోంది.
శాఖల సమన్వయ లోపం
ఆక్వా చెరువులకు అనుమతులు, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు మత్స్యశాఖ సిబ్బంది పని. నెలకిందట వరకు నిర్వహించిన గ్రామసభల్లో ఆక్వా జోన్ పరిధిలోకి వచ్చిన సర్వే నంబర్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేసినా గెజిట్ ఇప్పటికీ విడుదల చేయలేదు. గతంలో కొందరు అధికారులు ఇష్టారీతిన తప్పుడు సర్వే నంబర్ల ఆధారంగా అనుమతులు మంజూరు చేయగా.. అక్రమంగా అనుమతులు పొందిన రైతులు ఈ-ఫిష్ సర్వేలో అడ్డంగా దొరికిపోయారు. దీంతో రాయితీ కోల్పోయి లబోదిబోమంటున్నారు.
జోన్‌ల పరిధి పెంచేందుకు గ్రామసభలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఆక్వా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వర్తింపజేయాలనే ఉద్దేశంతో గతంలోనే పంచాయతీ కార్యాలయాల వద్ద ఆక్వా జోన్ల విస్తీర్ణం, కొన్ని గ్రామాలను ఆక్వా జోన్ల పరిధిలోకి తీసుకొచ్చే విషయమై గ్రామసభలు నిర్వహించారు. దీనికి కూడా నిబంధనలు విధించారు. కొత్త ప్రాంతాన్ని ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావాలంటే అక్కడ 60 శాతం వ్యవసాయేతర భూములు కానీ, రొయ్యల చెరువులుగానీ ఉంటేనే వెసులుబాటు ఉంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తమయ్యింది.
రెండు నెలలకు ఒకసారి కోత
ఏడాది కాలంగా ప్రభుత్వం ఆక్వా చెరువులకు అందిస్తున్న రాయితీపై రెండు నెలలకోసారి కోత విధిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. గతేడాది అక్డోబరు, నవంబరు నెలల్లో అప్సడా చట్టం పేరుతో, ఆ తరువాత జోన్, నాన్ ఆక్వాజోన్ పేరుతో మరో నెలపాటు చెరువులకు ఇస్తున్న విద్యుత్తు రాయితీ తొలగించి బిల్లు వసూలు చేశారు. రాయితీ కోల్పోయిన రైతులు తమ ధ్రువీకరణ పత్రాలతో విద్యుత్తుశాఖ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో సగం మందిపై ప్రభావం
కొంకాపల్లిలో చర్చిస్తున్న ఆక్వా రైతు సంఘాల నాయకులు
ప్రస్తుతం ఈ-ఫిష్ సర్వే పేరుతో రొయ్యల చెరువుల వాస్తవ పంట ఆధారంగానే విద్యుత్తు రాయితీ ఇవ్వనున్నారు. దీంతో సగంమంది రైతులు రాయితీ కోల్పోనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 7,404 ఆక్వా విద్యుత్తు కనెక్షన్లు ఉండగా వాటిలో ఈ-ఫిష్ సర్వే ద్వారా విద్యుత్తు రాయితీ వర్తించే సర్వీసులు 3,382 మాత్రమే ఉన్నాయి.
సర్వేలో మార్పులు చేస్తాం..
-షేఖ్ లాల్‌మహ్మద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
విద్యుత్తుశాఖ అధికారులకు ఇచ్చిన ఈ-ఫిష్ సర్వే వివరాలు జాబితాలో మార్పులు చేయనున్నాం. నాన్ ఆక్వా జోన్‌లోని సర్వే నంబర్లను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకువచ్చి రాయితీ అందించేలా కృషి చేస్తున్నాం. వారం రోజుల్లో జిల్లాస్థాయి సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు ఆరంభించాం. ఫిబ్రవరి నెలకు మాత్రం రాయితీ వచ్చే అవకాశం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!