logo

పరిశీలించండి.. పరిష్కారం చూపండి..

తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి పలువురు ప్రజలు కలెక్టరేట్కు తరలివచ్చారు. జిల్లాస్థాయి స్పందనలో అర్జీలు అందించారు.

Published : 07 Feb 2023 05:14 IST

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌, జేసీ, డీఆర్వో

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి పలువురు ప్రజలు కలెక్టరేట్కు తరలివచ్చారు. జిల్లాస్థాయి స్పందనలో అర్జీలు అందించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాధవీలత, జేసీ తేజ్‌భరత్‌, డీఆర్వో నరసింహులు ప్రజల నుంచి మొత్తం 167 అర్జీలను స్వీకరించారు. ఎక్కువ మంది పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్లస్థలాల మంజూరు కోరుతూ అర్జీలు అందించారు. గ్రామంలో 396/503లో ఉన్న 25 సెంట్ల తన భూమిని వేరొకరు ఆక్రమించి వేధిస్తున్నారని, భూమి తనకు అప్పగించి న్యాయం జరిగేలా చూడాలంటూ రాజానగరం మండలం నందరాడ గ్రామానికి చెందిన ఎం.చెన్నమ్మ అర్జీ అందించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యను పరిష్కరించాలని రాజానగరం తహసీల్దారును ఆదేశించారు. గతేడాది ఆగస్టు నుంచి దివ్యాంగ పింఛన్‌ను ప్రభుత్వం నిలిపివేసిందని, వివాహమై వెళ్లిపోయిన తన కుమార్తెకు ఉద్యోగం ఉండటం కారణంగా చూపుతున్నారని గోపాలపురం గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరావు అర్జీ అందించారు. దీనిపై డీఎస్‌వో, తహసీల్దారుకు అధికారులు సిఫార్సు చేశారు.  ఇంటిస్థలం కోసం 2007లో రూ.5 వేలు చెల్లించానని, ఇప్పటివరకు తనకు ప్రభుత్వం నుంచి ఇంటిస్థలం మంజూరు కాలేదని జి.భాస్కరరాణి అర్జీ అందించింది. దీనిపై పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అధికారులు ఆదేశించారు.

అర్జీలకు వివరణ ఇవ్వాలి: స్పందనలో ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించడంతోపాటు ఏవైనా అపరిష్కృతంగా ఉంటే వాటికి కారణాలు తెలుపుతూ సంబంధిత అర్జీదారులకు సహేతుకమైన వివరణ ఇవ్వాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు. నవశకం పోర్టల్‌, జగనన్నకు చెబుతాం 1902 టోల్‌ఫ్రీ నంబరు ద్వారా వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జేసీ తేజ్‌భరత్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అర్జీలను నవశకం పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని