logo

స్వశక్తికి పాతర

అమలాపురంలో 2001లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో శిక్షణ, సాంకేతికాభివృద్ధి కేంద్రాన్ని అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడే డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నడిచే స్వశక్తి నోట్‌ బుక్స్‌ ఇండస్ట్రీ 2016లో మొదలైంది.

Published : 07 Feb 2023 05:20 IST

సిద్ధం చేసినా అమ్ముడుపోని పుస్తకాలు

ఈనాడు, అమలాపురం: అమలాపురంలో 2001లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో శిక్షణ, సాంకేతికాభివృద్ధి కేంద్రాన్ని అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడే డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నడిచే స్వశక్తి నోట్‌ బుక్స్‌ ఇండస్ట్రీ 2016లో మొదలైంది. జిల్లా సమాఖ్య.. 11 గ్రామైక్య సంఘాల్లోని ఒక్కో మహిళను ఎంపికచేసి 12 మంది ఆధ్వర్యంలో పరిశ్రమ పెట్టారు. ఓ విశ్రాంత సైనికోద్యోగికి పర్యవేక్షక బాధ్యత అప్పగించారు. ధాన్యం కొనుగోళ్లు, ఇసుక రేవుల నిర్వహణ సమర్థంగా నిర్వహించిన డ్వాక్రా మహిళలు రూ.88.72 లక్షల ఆదాయం కమీషన్‌ రూపేణా సమకూర్చుకున్నారు. ఆ మొత్తం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో స్వశక్తి నోట్‌ బుక్స్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రోత్సహించింది. డ్వాక్రా మహిళల ఆర్జనకు.. బ్యాంకు రుణం రూ.99 లక్షలు జతచేసి రూ.1.87 కోట్లతో ఈ పరిశ్రమ స్థాపించారు. ఇక్కడ ముద్రించిన సింగిల్‌ రూల్‌, డబుల్‌ రూల్‌, తెల్లకాగితాలు ఇతర పుస్తకాలను ప్రభుత్వం కొని పాఠశాలలకు అందించేది. పలు ప్రభుత్వ కార్యాలయాల ఆర్డర్లపైనా పుస్తకాలు వెళ్లేవి. దీంతో ఈ పరిశ్రమ లాభాల బాటలో సాగింది.

మహిళా సంక్షేమం.. సాధికారత లక్ష్యంతో.. గ్రామీణ మహిళలు స్వశక్తితో నిలవగలరనే భరోసా ఇచ్చేందుకు నిర్దేశించినవే.. డ్వాక్రా సంఘాలు. ఆ సంఘాల్లో ప్రస్తుత ప్రతికూల పరిస్థితులతో నిర్లిప్తత ఆవహిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళల తొలి పారిశ్రామిక సంస్థ మూతపడే స్థితికి చేరింది. గత ప్రభుత్వ ప్రోత్సాహంతో అభివృద్ధి పథంలో నడిచి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ సంస్థ.. ఇప్పుడు సహకారం కరవై.. ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అవసాన స్థితికి చేరింది. పరిశ్రమ నడుస్తున్న ప్రాంగణాన్ని సైతం ఖాళీ చేయాలనే అధికారిక ఒత్తిళ్లతో వేరొక చోటకు మార్చలేక... బ్యాంకు రుణం తీర్చలేక.. ఉన్న యంత్ర సామగ్రి వేలం వేసి సొమ్ము జమచేసుకోండని బ్యాంకును వేడుకుంటున్న దయనీయమిది.


ఒడుదొడుకులెన్నో..

మహిళలే యజమానులుగా ఏర్పాటైన ఈ పరిశ్రమ 2019 డిసెంబరు వరకు బాగానే నడిచింది. ఏటా రూ.70 లక్షల విలువైన పుస్తకాలు తయారుచేసే పరిశ్రమ ప్రస్తుతం బేరాల్లేక.. పనుల్లేక ఖాళీగా ఉంది. ఇప్పటికి బ్యాంకు రుణం 70 శాతం తీర్చేశారు. ప్రభుత్వం మారడం.. కొవిడ్‌ వేళ పాఠశాలలు మూతతో పుస్తకాల తయారీ ఆర్డర్లు రాలేదు. ఉన్న నిల్వలూ అమ్ముడుపోలేదు. ప్రస్తుత ప్రభుత్వం ‘జగనన్న విద్యాకానుక’ కింద పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే పుస్తకాల తయారీ బాధ్యత పుణెలోని ప్రైవేటు సంస్థకు ఇవ్వడంతో.. స్వశక్తి తరహాలో ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడే పరిశ్రమలకు గడ్డుకాలం ఎదురైంది. బ్యాంకుకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ కలిసి.. భారం పెరిగింది. ఏడాదిన్నరగా
కనీస ఉత్పత్తులు సాగక పర్యవేక్షకుడికి జీతం ఇవ్వలేదు. సంస్థలోని 20 మంది కార్మికులను ఒక్కొక్కరినీ తొలగిస్తూ వచ్చారు.

అమలాపురం కలెక్టరేట్‌ ప్రాంగణంలోని స్వశక్తి పుస్తకాల పరిశ్రమ


కలెక్టరేట్‌ వచ్చింది.. ఖాళీ చేయాల్సిందే..

ఇదే తరుణంలో కోనసీమ కలెక్టరేట్‌కు సొంత ప్రాంగణం లేక.. డీఆర్‌డీఏ ట్రైనింగ్‌- టెక్నాలజీ సెంటర్‌ ప్రాంగణాన్ని కలెక్టరేట్‌కు కేటాయించారు. కలెక్టరేట్‌లో స్పందన, ఇతర కార్యక్రమాలకు వసతులు చాలడంలేదని అదే ప్రాంగణంలోని స్వశక్తి నోట్‌ బుక్స్‌ ఇండస్ట్రీపై పడ్డారు. ఇప్పటికే రాతపుస్తకాల నిల్వ భవనాన్ని స్వాధీనం చేసుకుని వీక్షణ సమావేశ మందిరంగా మార్చారు. ప్రస్తుతం ప్రింటింగ్‌ యంత్రాలు.. నిల్వలు ఉన్న భారీ గోదామును ఖాళీచేయించి స్పందన హాలుగా మార్చే సన్నాహాలు చేస్తున్నారు. ఇతర సామగ్రి నిల్వకు వాడుతున్నారు. ఈ ప్రాంగణాన్ని శాశ్వతంగా ఖాళీచేసి.. బోడసకుర్రులోని టిడ్కో గృహాల చెంత రేకుల షెడ్డులోకి మార్చాలనే ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. రూ.లక్షల విలువైన ప్రింటింగ్‌, కటింగ్‌, బైండింగ్‌ ఇతర యంత్రాల ఏర్పాటుకు, సరకు నిల్వకు ఆ షెడ్డు చాలదని మొత్తుకున్నా వినేనాథుడే లేరు. డ్వాక్రా మహిళలు ప్రజా ప్రతినిధులు, అధికారులను కలిసినా స్పందన లేదు. దీంతో చేసేది లేక.. బకాయి పడిన సొమ్ము చెల్లించే పరిస్థితిలేదు.. యంత్ర సామగ్రి వేలం వేసి సొమ్ము జమచేసుకోండని బ్యాంకు యాజమాన్యానికే పరిశ్రమ నిర్వాహక మహిళలు లేఖ రాశారు. ఒకప్పుడు ఆదర్శంగా నిలిచిన ఈ పరిశ్రమ మూసివేతకు రంగం సిద్ధమైంది.


విధులకు భంగమనే ఖాళీ చేయిస్తున్నాం..
-శివశంకర్‌ప్రసాద్‌, పీడీ, డీఆర్‌డీఏ

కలెక్టరేట్‌లో పరిశ్రమ ఉండకూడదని.. ఈ శబ్దాలతో విధి నిర్వహణకు భంగమనే ఉద్దేశంతో స్వశక్తి నోట్‌ బుక్స్‌ ఇండస్ట్రీని ఖాళీచేయించాలని నిర్ణయించాం. ఈ గోదాములో స్పందన నిర్వహించాలనే ఆలోచన ఉంది. బాగా నడుస్తున్న పరిశ్రమ మూతపడాలనేది మా ఉద్దేశం కాదు. ప్రత్యామ్నాయ స్థలం చూపించి అక్కడికి మారుస్తాం. ఇన్నాళ్లూ పరిశ్రమపై దృష్టిపెట్టక ఆర్డర్లు తగ్గాయి. దాన్ని షిఫ్ట్‌ చేశాక ఎలా వృద్ధిలోకి తేవాలనే దానిపై ఆలోచిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని