logo

దిశ మారితేనే.. ఉజ్వల భవితకు దశ

విద్యార్థి దశలో ఇంటర్మీడియట్‌ అత్యంత కీలకమైంది. భవిష్యత్తును నిర్దేశించేదీ ఇక్కడే. ఇంటర్‌ చదువుతున్నపుడే ఏ కోర్సుల్లో చేరాలి.. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయని ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు.

Published : 07 Feb 2023 05:25 IST

‘ఈనాడు-కేఎల్‌ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్యార్థులకు అవగాహన
న్యూస్‌టుడే, వెంకట్‌నగర్‌, గాంధీనగర్‌

ఇంటర్‌ తర్వాత ఏ దిశగా సాగితే మేటిగా నిలవచ్చనే అంశంపై కాకినాడలోని వీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో ‘ఈనాడు- కేఎల్‌ యూని వర్సిటీ’ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన ‘దశ-దిశ’ అవగాహన సదస్సుకు చక్కటి స్పందన లభించింది. సదస్సును కేఎల్‌ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొబ్బిలి సత్యనారాయణమూర్తి, శ్రీచైతన్య కళాశాల ఏజీఎంలు హరిప్రసాద్‌, చిన్మయి శ్రీనివాస్‌, ‘ఈనాడు’ రాజమహేంద్రవరం యూనిట్‌ ఇన్‌ఛార్జి చంద్రశేఖరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


వెంకట్‌నగర్‌, గాంధీనగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్‌ అత్యంత కీలకమైంది. భవిష్యత్తును నిర్దేశించేదీ ఇక్కడే. ఇంటర్‌ చదువుతున్నపుడే ఏ కోర్సుల్లో చేరాలి.. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయని ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. ఇటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ‘ఈనాడు - కేల్‌ యూనివర్సిటీ’ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం ‘దశ-దిశ’ కార్యక్రమాన్ని కాకినాడలోని వీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌హాలులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత రూ.10 వేల నుంచి రూ.15వేల లోపు జీతంతో సరిపెట్టుకోకుండా రూ.లక్షల్లో ఎలా పొందాలి.. ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది తరువాత బ్రాంచి మార్పు, మళ్లీ కోర్సుల ఎంపిక, కోర్సుల్లో కొంతకాలం విదేశీ వర్సిటీలో ఇంటర్న్‌షిప్‌ తదితర అవకాశాలను కేఎల్‌ యూనివర్సిటీలో ఎలా అమలు చేస్తున్నారో కేఎల్‌ యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు వివరించారు. హాజరైన విద్యార్థులకు విశ్వ విద్యాలయ కిట్లు, కూపన్లు అందజేశారు. అనంతరం శ్రీచైతన్య కళాశాలలో వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన మేరీగ్రేస్‌, కీర్తిరాజ్‌, ఎ.వర్షిణి, లక్కీ డీప్‌ద్వారా ఎంపికైన విద్యార్థి పి.లలితకు శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజీఎంలు ఎం.హరిప్రసాద్‌, చిన్మయి శ్రీనివాస్‌, కేఎల్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ బి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ‘ఈనాడు’ రాజమహేంద్రవరం యూనిట్‌ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్‌ ప్రసాద్‌ బహుమతులు అందజేశారు.

సదస్సుకు హాజరైన విద్యార్థినులు


కోర్సుల ఎంపిక కీలకం..

ఇంజినీరింగ్‌ విద్యలో కోర్సుల ఎంపిక అత్యంత కీలకం. ఉద్యోగాలు త్వరగా వచ్చే కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఇంజినీరింగ్‌ ఎక్కడ చదవాలో నిర్ణయించుకోవడం ద్వారా త్వరగా స్థిరపడడంతో పాటు అత్యధిక వార్షిక వేతనం లభించే అవకాశాలుంటాయి. విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో సమయం వృథా చేయకుండా ఎంచుకున్న కోర్సుల్లో నైపుణ్యం సాధించాలి. దేశవ్యాప్తంగా ఉన్న 3,000 యూనివర్సింటీల్లో ఉత్తమమైన 100 వర్సిటీలను ప్రభుత్వం ఏటా ప్రకటిస్తుంది. వాటిలో పదింటిని గుర్తించి దశలవారీగా ఒడపోసి అయిదు, మూడు, రెండు, ఒకటి ఎంచుకోవాలి. బైపీసీ విద్యార్థులు సైతం ఇంజినీరింగ్‌ చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్నవారికి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా చదువుకునేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇంటర్‌ మార్కులు, కేఎల్‌ వర్సిటీ పరీక్షలో ప్రతిభ, జేఈఈ స్కోర్‌ ఆధారంగా ఉన్నతంగా రాణించే విద్యార్థులకు వంద శాతం ఉపకార వేతనాలు అందజేస్తున్నాం. ఇంజినీరింగ్‌ చదువుతూనే మైనర్‌ డిగ్రీ చేస్తే ప్రముఖ సంస్థల్లో అధిక వేతనంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. నచ్చిన సమయంలో ఉత్తమ అధ్యాపకుడి క్లాస్‌ వినేలా ఛాయిస్‌ బేస్డ్‌ వ్యవస్థ ఉన్న మల్టీ కోర్సుల కళాశాలలను విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి. విదేశాల్లో చదివేందుకు వీలుగా పలు విదేశీ వర్సిటీలతో ఒప్పందం ఉన్న సంస్థల్లో చేరాలి.

జె.శ్రీనివాసరావు, అడ్మిషన్స్‌ డైరెక్టర్‌, కేఎల్‌ యూనివర్సిటీ


అవగాహన తప్పనిసరి..
బి.ఎస్‌.ఎన్‌.మూర్తి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, కేఎల్‌ యూనివర్సిటీ

ఎవరో చెప్పారని కాకుండా.. భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలని భావిస్తున్నారో ఇంటర్‌ తరువాత ఎలా చదివితే ఆ అవకాశాలు అందుకుంటామో ఈ సదస్సు ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టుకునేందుకు ఇదే మంచి సమయం. ఇంటర్‌ విద్య అత్యంత కీలకమైంది. ఆత్మవిశ్వాసంతో లక్ష్యంపై గురిపెట్టాలి. దేశ వ్యాప్తంగా కేటగిరీ-1లో 16 యూనివర్సిటీలు ఉంటే అందులో కేఎల్‌ యూనివర్సిటీ ఒకటి. ఇక్కడ వసతులు, అవకశాలు రాజీ లేకుండా ఉంటాయి. శతశాతం ఉద్యోగావకాశాలు లభిస్తాయనే నమ్మకం తల్లిదండ్రుల్లో కలుగుతుంది.


తల్లిదండ్రులతో పంచుకోండి...
- చిన్మయి శ్రీనివాస్‌, ఏజీఎం, శ్రీచైతన్య కళాశాల

నాలుగేళ్ల నుంచి 17 ఏళ్ల వరకు తల్లిదండ్రులను, స్నేహితులను, గురువులను అనుకరిస్తారు. తమకుంటూ ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకునే వయసు ఇది. భవిష్యత్తుకు ఇంటర్‌, ఉన్నత భవిష్యత్తుకు ఏయే కోర్సులు ఎంచుకోవాలనే ఆలోచన చేయాల్సిన తరుణమిది. సామాజిక మాధ్యమాల్లో కాకుండా మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపి.. మీ ఆలోచనలు వారితో పంచుకోండి. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఎంత అవసరమో దాన్ని ఎక్కువగా ఉపయోగించడమూ అంతే అనర్థం.


విజ్ఞానం, నైపుణ్యం, పోటీతత్వం అవసరం..
- ఎం.హరిప్రసాద్‌, ఏజీఎం, శ్రీచైతన్య కళాశాల

విద్యార్థికి ఇంటర్మీడియట్‌ అత్యంత కీలకం. అందుకే విజ్ఞానం, నైపుణ్యం, పోటీతత్వం అలవాటుచేస్తాం. ఈ మూడు ఉంటేనే ఉన్నత స్థానంలో ఉంటారు. నైపుణ్యం లేకుంటే ఏ కోర్సు చదివినా ప్రయోజనం ఉండదు. ఇంటర్మీడియట్‌ నుంచి చదవకపోతే ఇంజినీరింగ్‌లో రాణించలేరు. విద్యార్థుల్లో వ్యక్తిగత మార్పు అవసరం. అప్పుడే జీవితంలో స్థిరపడతారు. ఇప్పటి నుంచే భవిష్యత్తు బాటకు ప్రణాళిక అవసరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని