logo

మొక్కజొన్నపై మక్కువ

జిల్లాలో వరి తర్వాత ఖరీఫ్‌, రబీ సీజన్‌ల్లో మొక్కజొన్న సాగువైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, 110-140 రోజుల్లో చేతికి అందొచ్చే పంట కావడంతో కొంతకాలంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది.

Published : 07 Feb 2023 05:29 IST

గోకవరంలో సాగవుతున్న పంట

న్యూస్‌టుడే, సీతానగరం: జిల్లాలో వరి తర్వాత ఖరీఫ్‌, రబీ సీజన్‌ల్లో మొక్కజొన్న సాగువైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, 110-140 రోజుల్లో చేతికి అందొచ్చే పంట కావడంతో కొంతకాలంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. గతేడాది మద్దతు ధర బాగుండడంతో ఈ సారి మరింత ఎక్కువగా సాగు చేశారు. అత్యధికంగా సీతానగరం, గోకవరం, గోపాలపురం, నల్లజర్ల, తాళ్లపూడి, కోరుకొండ, దేవరపల్లి తదితర మండలాల్లో పండిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో అపరాలు, చెరకు, పొగాకు తదితర పంటలు వేసేవారు. ప్రస్తుతం వీటి సాగు గణనీయంగా తగ్గింది. వీటి స్థానాన్ని మొక్కజొన్న భర్తీ చేస్తోంది.


మద్దతు ధర లభించడంతో..

నాలుగైదు సంవత్సరాల క్రితం మొక్కజొన్నపై కత్తెర పురుగు దెబ్బకు రైతులు విలవిల్లాడారు. ఎన్నిమందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయేది. మార్టేరు నుంచి శాస్త్రవేత్తల బృందం పర్యటించి రైతులకు కత్తెర పురుగుపై పలు సూచనలు చేసేవారు. కాలక్రమేణ కత్తెర పురుగు కొంత తగ్గడంతో పంట ఆశాజనకంగా మారింది. దీంతో రైతులు పంట పెంచుకుంటూ వస్తున్నారు. పంట వేసినప్పుడు నుంచి తీసేంత వరకు  సుమారుగా రూ.20వేల వరకు పెట్టుబడి అవుతుంది. ధర రూ.2 వేలు ఉంటే సుమారుగా రూ.50వేలకు పైబడి ఆదాయం వస్తుంది. పైగా ఖరీఫ్‌లో వరి కోతలు పూర్తిచేసిన వెంటనే మొక్కజొన్న ఏతలు పూర్తి చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో మొదటిసారి వేసిన ఏతలే పంట దశకు చేరుతున్నాయి.


విస్తీర్ణం పెరుగుతోంది
-ఎస్‌.మాధవరావు, డీఏవో, తూర్పుగోదావరి

రబీలో మొక్కజొన్న సాగు లాభదాయకమే. పెట్టుబడి తక్కువ, స్వల్పకాలంలో చేతికి వస్తుంది. వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు బాగుంటాయి. గతేడాది ప్రభుత్వ ధర కంటే బహిరంగ మార్కెట్‌లో మంచి ధర ఉంది. దీంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు సాగుచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని