logo

వదల బొమ్మాళీ... పన్నుపిండేస్తాం!

చెత్త పన్ను వసూళ్లపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం రూటు మార్చింది.  ఎలాగైనా  వసూలు చేయాలని భావించిన ప్రభుత్వం ఆస్తి పన్నులో చెత్త పన్నును కలిపి డిమాండ్‌ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది.

Updated : 20 Mar 2023 08:34 IST

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, అమలాపురం పట్టణం

చెత్త పన్ను వసూళ్లపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం రూటు మార్చింది. ఎలాగైనా వసూలు చేయాలని భావించిన ప్రభుత్వం ఆస్తి పన్నులో చెత్త పన్నును కలిపి డిమాండ్‌ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో రెండు నగరపాలక సంస్థలు, అయిదు పురపాలికల్లో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.

ప్రస్తుతం ఏటా రెండు విడతలుగా ఆస్తి పన్నును వసూలు చేస్తున్నారు. చెత్త పన్ను ప్రతినెలా వసూలు చేస్తుంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆరు నెలలకోసారి ఆస్తిపన్నుతో కలిపి దీన్ని రాబట్టడానికి అధికారులు డిమాండ్‌ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌(క్లాప్‌) కార్యక్రమం అమలు చేస్తున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఆస్తి, చెత్త పన్ను మ్యాపింగ్‌ ఈనెల 23లోగా పూర్తి చేయాలని పురపాలక శాఖ కమిషనర్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మొదటి అర్ధ సంవత్సరానికి సిద్ధం చేస్తున్న ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసుల్లో చెత్త పన్నును కలపాలని ఆదేశించారు. ఇకపై ప్రతినెలా ఇంటింటా చెత్త సేకరణ యూజర్‌ ఛార్జీలను సీడీఎంఏ ఖాతాకే జమ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

మరింత అద్దెల భారం

ప్రతినెలా యూజర్‌ ఛార్జీలను ఇళ్లలో అద్దెకు ఉంటున్నవారు చెల్లిస్తున్నారు. ఇంటికి ఆస్తి పన్నును ఆరు నెలలకు ఒకసారి యజమాని పట్టణ స్థానిక సంస్థలకు జమ చేస్తున్నారు. ఇప్పుడు ఆస్తి పన్నులో యూజర్‌ ఛార్జి కలిపితే అద్దెలు పెరిగే అవకాశం ఉంటుంది.

ఎక్కడెక్కడంటే...

క్లాప్‌ అమలు జరుగుతున్న కాకినాడ జిల్లాలోని కాకినాడ నగరపాలక సంస్థ, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంఘాలు, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట పురపాలక సంఘాల్లో ఆస్తి, చెత్త పన్ను మ్యాపింగ్‌ను వార్డు సచివాలయాల్లో చేపట్టారు. కాకినాడలో ఇప్పటికే 85 శాతం పూర్తయ్యింది. ఈనెల 23 లోగా మ్యాపింగ్‌ పూర్తి చేసి ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆస్తి, చెత్త పన్నుతో కూడిన డిమాండ్‌ నోటీసులను జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అధికారులు మాత్రం... రెంటింటినీ మ్యాపింగ్‌ చేసిన తరువాత ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసులోనే యూజర్‌ ఛార్జీలు కలుపుతారా... ఆస్తి పన్ను, యూజర్‌ ఛార్జీలకు వేర్వేరుగా డిమాండ్‌ నోటీసులు ఇస్తారా అనేది వేచిచూడాలని చెబుతున్నారు.

కాకినాడ: చెత్త సేకరిస్తున్న సిబ్బంది

వసూళ్లు మందగించడంతోనే..

మూడు జిల్లాల పరిధిలో కాకినాడ నగరపాలక సంస్థ మినహా మిగతాచోట్ల ఆశించిన స్థాయిలో యూజర్‌ ఛార్జీలు(చెత్త పన్ను) వసూలు కావడం లేదు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కాస్త ఫర్వాలేదు. మిగతా పురపాలక సంఘాల్లో పూర్తిస్థాయిలో యూజర్‌ ఛార్జీలు రాబట్టలేకపోతున్నారు. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా పేదల వాడల్లో రూ.60, మిగతా ప్రాంతాల్లో రూ.90 చొప్పున నెలవారీ వసూలుకు నిర్ణయించారు. దీన్ని ఆయా పట్టణ స్థానిక సంస్థ పాలకవర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో కాకినాడలో పేదల వాడల్లో యూజర్‌ ఛార్జీలను నెలకు రూ.30 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలో పేదలవాడల్లో యూజర్‌ ఛార్జీని రూ.50కు కుదించారు. కొన్ని పురపాలికల్లో పాత పద్దతిలోనే చెత్తను సేకరిస్తున్నా.. యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ 75 శాతం కుటుంబాలు చెత్త పన్ను వ్యతిరేకిస్తూ నగదు చెల్లించడంలేదు. వీటన్నింటిని అధిగమించి, నూరుశాతం యూజర్‌ఛార్జీల వసూళ్లకు ఈ కొత్త ఎత్తుగడ వేశారు.


వాణిజ్య సముదాయాలపై భారం

కాకినాడలో వాణిజ్య సముదాయాలు, వీధి వ్యాపారులకు రూ.100 నుంచి దుకాణాలకు రూ.15 వేల వరకు యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కిళ్లీ బడ్డీ నడిపేవారి నుంచి నెలకు రూ.200 నుంచి రూ.400 వరకు, ఆసుపత్రులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు వంటి వాటికి నెలకు రూ.15వేల వరకు చెత్త పన్ను వేస్తున్నారు. వీటిని ఇప్పుడు ఆస్తి పన్నుతో కలిపితే వీరికి మరింత భారం కానుంది.


చెత్తపేరు వస్తుందనే..?

కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళల నుంచి ప్రతినెలా యూజర్‌ ఛార్జీలు వసూలు చేసే క్రమంలో వారు చెల్లించలేకపోతున్నారు. వీరికి ఇచ్చే పింఛను సొమ్ము నుంచి మినహాయించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఆస్తి పన్నులోనే దీన్ని వసూలు చేస్తే ఏవిధమైన ఇబ్బంది ఉండదని ఈ విధానాన్ని తీసుకు
వస్తున్నారు.

* కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంఘాల్లో క్లాప్‌ కార్యక్రమాన్ని రెండేసి వార్డులకు మాత్రమే పరిమితం చేశారు. వీటిలో నెలకు రూ.60 చొప్పున చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. చాలా వరకు వీటిని చెల్లించడంలేదు. దీంతో ఇక్కడ కూడా మ్యాపింగ్‌ చేస్తున్నారు.


జవాబుదారీ కోసమే మ్యాపింగ్‌

కేవలం ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంత యూజర్‌ ఛార్జీలు వస్తాయని తెలుసుకోడానికే మ్యాపింగ్‌. ఆస్తి పన్నుల్లో యూజర్‌ ఛార్జీలను కలపడానికి కాదు. ప్రతినెలా ఎవరు యూజర్‌ ఛార్జీలు చెల్లిస్తున్నారు.. అది ప్రభుత్వ ఖాతాకు చేరుతుందా లేదా.. అనే అంశాలు తెలుసుకోడానికి మాత్రమే మ్యాపింగ్‌ జరుగుతోంది. ఇది జవాబుదారీ కోసమే.

సత్యనారాయణ, మున్సిపల్‌ ఆర్డీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు