logo

ఆదేశం.. ఆచరిస్తేనే ప్రతిఫలం

అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, దేవస్థానంలో అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంపై అధికారులు దృష్టిసారించారు.

Updated : 20 Mar 2023 06:19 IST

న్యూస్‌టుడే, అన్నవరం

ఆలయ ప్రాంగణంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూం

అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, దేవస్థానంలో అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడంపై అధికారులు దృష్టిసారించారు. భక్తులు నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వీటిపై పకడ్బందీ పర్యవేక్షణ అవసరముంది.

కమాండ్‌ కంట్రోల్‌ రూం

ఆలయ ప్రాంగణంలో అతిపెద్ద కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేవిధంగా నాణ్యమైన కెమెరాలు ఏర్పాటు చేసి దీనికోసం ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు. దత్తత దేవాలయాలు, పాఠశాలల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సంప్రదాయ వస్త్రధారణపై..

సత్యదేవుని వ్రతం, నిత్యకల్యాణం, ఇతర పూజల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొంటున్నారు. భక్తులకు అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. పురుషులు పంచె, కండువా లేదా కుర్తా, పైజమా, మహిళలు చీర లేదా కుర్తా, పైజమా ధరిస్తున్నారు. భక్తులు నిలువు తిలకం, నిలువు నామం, నుదుటిన బొట్టు పెట్టుకునే ఆలయంలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. గతంలోనూ వస్త్రధారణ అమలు చేసినా ఆ తర్వాత పరిస్థితి యథావిధికి వచ్చింది.

వసూళ్లు ఆగేనా..?

వ్రతమాచరించే భక్తుల నుంచి దానాల పేరుతో వసూలుకు కొంత బ్రేక్‌ పడింది. భక్తులు సంతోషంగా తోచింది ఇస్తే తీసుకోవాలని ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవని ఆదేశాలతో అంతా అప్రమత్తమయ్యారు. క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టారు. దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేశారు. వ్రత విభాగానికి సంబంధించి గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. తీరు మారాలని అధికారులు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. తాజాగా దీనిపై దృష్టిపెట్టారు. పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని భక్తులు సూచిస్తున్నారు.

గోవులకు జల్లు స్నానం..

దేవస్థానం ఆధ్వర్యంలో కొండదిగువున కొత్తపేట ప్రాంతంలో గోశాల నిర్వహిస్తున్నారు. ఇక్కడ వందలాది ఆవులు ఉంటాయి. గోశాల నిర్వహణ, గోసంరక్షణ చర్యల్లో పలు మార్పులు చేశారు. గోవులకు జల్లు స్నానం ఏర్పాటు చేశారు. షెడ్డుల్లో పంకాలు అమర్చారు.

ప్రసాదం నాణ్యతపై..

ప్రసాదం నాణ్యతపై ఇటీవల పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రత్యేక కమిటీని నియమించి పలు సార్లు తయారీపై పర్యవేక్షించారు.


సౌకర్యాల కల్పనకే  నిబంధనలు..

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిబంధనలు అమలు చేస్తున్నాం. దేవస్థానంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. అవసరానికి అనుగుణంగా మార్పులు తీసుకువస్తాం. ఇచ్చిన ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు చేసేలా పర్యవేక్షణ ఉంటుంది.

చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఇన్‌ఛార్జి ఈవో, అన్నవరం దేవస్థానం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని