logo

పాతికేళ్ల కల.. ఫలిస్తున్న వేళ

పాతికేళ్ల పోరాటానికి ఫలితం దక్కబోతోంది. 1998 డీఎస్సీ అభ్యర్థులను ఒప్పంద ఉద్యోగులుగా నియమించడానికి జీవో నంబరు 27 జారీ అయ్యింది.

Published : 20 Mar 2023 05:33 IST

1998 డీఎస్సీ అభ్యర్థులకు రోస్టర్‌ కం మెరిట్‌ ఆధారంగా నియామకాలు
న్యూస్‌టుడే, రామచంద్రపురం టౌన్‌ (పామర్రు)

మండపేటలో కలిసిన 1998 డీఎస్సీ అభ్యర్థులు (పాత చిత్రం)

పాతికేళ్ల పోరాటానికి ఫలితం దక్కబోతోంది. 1998 డీఎస్సీ అభ్యర్థులను ఒప్పంద ఉద్యోగులుగా నియమించడానికి జీవో నంబరు 27 జారీ అయ్యింది. అయిదారు నెలల కిందటే 1998 డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులను సెకండరీ గ్రేడు టీచర్లుగా ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తామని చెప్పినా ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. తాజా ఉత్తర్వులతో ఇందుకు మార్గం సుగమమైంది. ఉమ్మడి జిల్లాలో 285 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించనున్నాయి.

ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు ఇవీ..

* నియామకం పొందిన వారందరికీ మినిమం టైం స్కేల్‌(ఎంటీఎస్‌) వర్తింప చేస్తారు. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి రోస్టర్‌ కం మెరిట్‌ విధానంలో నియామకాలు చేపడతారు.

* అరవై ఏళ్లు పైబడిన వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

* నాటి డీఎస్సీలో క్వాలిఫైయింగ్‌ మార్కులతోపాటు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని తాజాగా ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్గదర్శకాలను అనుసరించి కౌన్సెలింగ్‌ ద్వారా నియామకాలు చేపడతారు.

* అప్పట్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యరులకు వరుసగా 50, 45, 40 మార్కులు క్వాలిఫైయింగ్‌గా నిర్ణయించారు. ఇప్పుడు వీటినే అనుసరిస్తారు.

* అభ్యరి మార్కులతోపాటు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పరిగణనలోకి తీసుకుని జిల్లాకు కేటాయించిన పోస్టుల సంఖ్య ఆధారంగా వారిని ఆయా స్కూళ్లలో నియమిస్తారు.

ఏకోపాధ్యాయ పాఠశాలలకు ప్రాధాన్యం..

ప్రస్తుతం నియమితులు కానున్న వారంతా సెకండరీ గ్రేడు టీచర్లే కావడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలకు వీరిని సర్దుబాటు చేస్తారు. ఆ తర్వాతే మిగిలిన స్కూళ్లల్లోని ఎస్జీటీ నియామకాల్లో ప్రాధాన్యమిస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 156 వరకూ ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. వాటిల్లో తొలుత వీరిని నియమిస్తారు. తరువాత ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి మిగిలిన వారిని నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు విద్యాశాఖ చెబుతోంది.

అర్హులందరికీ అవకాశాలున్నాయా..?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 556 మంది అర్హత సాధించిన అభ్యరులుంటే అందులో నుంచి ప్రస్తుతం ఉద్యోగం కావాలని అంగీకరించి ముందుకొచ్చిన వారు 470 మంది వరకు ఉన్నారు. రాష్ట్రంలో 4,534 పోస్టులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో ఉమ్మడి జిల్లాకు 285 మందికే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అయితే తాజా నిబంధనల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారిని పక్కన పెట్టడం, పలువురు మహిళా అభ్యర్థులు సంసార బాధ్యతల్లో మునిగిపోయి ఉద్యోగాల్లో చేరకపోవడం వంటి అంశాల వల్ల ముందుకొచ్చిన వారందరికీ అవకాశం రావచ్చని 1998 ఎస్జీటీ అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని