logo

గంజాయి రవాణా గుట్టురట్టు

ఒకరు వ్యాన్‌ డ్రైవర్‌.. మరొకరు క్లీనర్‌.. ఇద్దరూ కలిసి వ్యాన్‌ కేబిన్‌లో ప్రత్యేక అరలు తయారు చేయించి గంజాయి తరలించే ప్రయత్నంలో హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ వింగ్‌(హెచ్‌.న్యూ) ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌ బృందానికి చిక్కారు.

Published : 20 Mar 2023 05:33 IST

స్వాధీనం చేసుకున్న సరకు, నిందితులు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఒకరు వ్యాన్‌ డ్రైవర్‌.. మరొకరు క్లీనర్‌.. ఇద్దరూ కలిసి వ్యాన్‌ కేబిన్‌లో ప్రత్యేక అరలు తయారు చేయించి గంజాయి తరలించే ప్రయత్నంలో హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ వింగ్‌(హెచ్‌.న్యూ) ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌ బృందానికి చిక్కారు. హెచ్‌న్యూ డీసీపీ గుమ్మి చక్రవర్తి ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. రాజమహేంద్రవరం మోరంపూడి ప్రాంత నివాసి సి.శ్రీనివాస్‌రావు(48) వ్యాన్‌ డ్రైవర్‌. వీఎల్‌ పురం నివాసి ఎ.సత్తిబాబు(29) క్లీనర్‌. సీలేరు ప్రాంతానికి చెందిన పాండు, నాగేష్‌లు శ్రీనివాస్‌రావుకు పరిచయమయ్యారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు గంజాయి చేరవేస్తే ట్రిప్‌నకు రూ.1.2 లక్షలు కిరాయి ఇస్తానంటూ ఆశ చూపారు. పెద్దమొత్తంలో డబ్బు చేతికి వస్తుందనే ఆశతో ఒప్పందం చేసుకున్నారు. వ్యాన్‌లో ప్రత్యేక అరలు తయారు చేయించారు. వీటిలో 200కిలోల గంజాయిని పొట్లాలుగా మార్చి భద్రపరిచారు. సరకుతో శనివారం రాజమహేంద్రవరం నుంచి బయల్దేరారు. దీనిపై ముందుగానే సమాచారం రావటంతో హెచ్‌న్యూ, లంగర్‌హౌస్‌ పోలీసులు అత్తాపూర్‌ వంతెన వద్ద  తనిఖీచేస్తే గుట్టు బయటపడింది. సరకు స్వాధీనం చేసుకుని, శ్రీనివాసరావు, సత్తిబాబుతోపాటు గంజాయిని దిగుమతి చేసుకునేందుకు వచ్చిన రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్‌ హబీబ్‌(35)ను అరెస్ట్‌ చేశారు. ఆసిఫ్‌నగర్‌ జిర్రా ప్రాంతానికి చెందిన పర్వేజ్‌ సరకును మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులు పర్వేజ్‌, చాంద్రాయణగుట్టకు చెందిన జావేద్‌, మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ నివాసి మంగేష్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగేష్‌, పాండులు పరారీలో ఉన్నారు.


170 కిలోలు స్వాధీనం

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఒడిశా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 170 కేజీల గంజాయిని బొమ్మూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాయుడు విజయ్‌కుమార్‌ వివరాల మేరకు.. ఆదివారం మధ్యాహ్నం దివాన్‌చెరువు పండ్ల మార్కెట్‌ వెనుక ఓ వ్యానులో నుంచి మరో కారులోకి కొన్ని మూటలను మార్చుతున్నట్లుగా స్థానికులు సమాచారం అందించడంతో ఎస్సై జగన్‌మోహన్‌ తన బృందంతో వెళ్లి గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చీదిగుమ్మల రాజవరానికి  చెందిన బర్ల రాజబాబు ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని అదే ప్రాంతానికి చెందిన బొట్ట శివకుమార్‌, కొప్పు రాంబాబు, కొప్పు సత్తిబాబు, ఎన్నేటి దుర్గాప్రసాద్‌లతో కలిసి వ్యానులో ఆదివారం రాజమహేంద్రవరం జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ నిరీక్షిస్తున్న చెన్నైకు చెందిన ఆర్‌.దినేష్‌కుమార్‌ ఆ గంజాయిని తన కారులోకి మార్చుకుని ఆ రాష్ట్రానికి తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయితో పాటు రూ.3.52 లక్షల నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, తొమ్మిది సెల్‌ఫోనులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని