logo

అడాకు నోటిఫికేషన్‌ జారీ

అమలాపురం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ(అడా) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 14న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Published : 21 Mar 2023 05:09 IST

అమలాపురం కలెక్టరేట్‌: అమలాపురం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ(అడా) ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 14న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని అమలాపురం పురపాలిక, ముమ్మిడివరం నగర పంచాయతీతోపాటుగా 11 మండలాల పరిధిలో 120 రెవెన్యూ గ్రామాల్లో 896.16 చ.కి.మీ. విస్తీర్ణాన్ని అడా పరిధిలో చేర్చారు. అమలాపురం కేంద్రంగా ఇది పనిచేయనుంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం పరిధిలో 120 గ్రామాలను మాత్రమే అడాలోకి తీసుకువచ్చారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో ఒక్క గ్రామాన్నికూడా చేర్చలేదు. అత్యధికంగా కాట్రేనికోన మండల పరిధిలో 135.95 చ.కి.మీ., అత్యల్పంగా అమలాపురం పురపాలిక పరిధిలో 7.2 చ.కి.మీ. విస్తీర్ణాన్ని అడా పరిధిలోకి చేర్చారు. జనాభా ప్రాతిపదిక ప్రకారం కొత్తపేట నుంచి అధికంగా 77,849 మంది, తక్కువగా మామిడికుదురు మండలం నుంచి 14,889 మంది జనాభాను చేర్చారు. కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, కాట్రేనికోన, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలను పూర్తిగా, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, రాజోలు మండలాల్లో కొన్ని గ్రామాలు పరిధిలోకి తీసుకొచ్చారు. అడాకు ప్రభుత్వం నామినేట్‌చేసే ఛైర్మన్‌ ఉంటారు. ఓ ప్రభుత్వ అధికారిని వైస్‌ ఛైర్మన్‌గా నియమిస్తారు. ఆయన కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ముగ్గురు నిపుణులు సభ్యులుగా ఉంటారు. అడాకు తొలి ఛైర్మన్‌గా కొత్తపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి నియమితులు కానున్నట్లు ప్రచారం సాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని