logo

వేదన.. తొలగక రోదన..!

అయ్యా.. మా గోడు వినండి. సాంత్వన చేకూర్చండని వేడుకుంటున్నా.. మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని.. తమ వేదన విని ఊరుకోవడమే కానీ.. రోదన ఆపేదెవరని వాపోయారు.

Published : 21 Mar 2023 05:37 IST

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

అయ్యా.. మా గోడు వినండి. సాంత్వన చేకూర్చండని వేడుకుంటున్నా.. మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని.. తమ వేదన విని ఊరుకోవడమే కానీ.. రోదన ఆపేదెవరని వాపోయారు. కలెక్టర్‌కు విన్నవించుకుంటే సమస్యలు తొలగుతాయనే ఆశతో కలెక్టరేట్‌కు వచ్చామని అర్జీదారులు తెలిపారు.


కొవిడ్‌ బిల్లులు రాలేదు
- ముప్పర్తి నాని, మోరిపాడు

మాది సఖినేటిపల్లి మండలం మోరిపాడు పంచాయతీ. 2021 మే 22న అప్పటి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మా గ్రామంలోని సుబ్బమ్మ ఆసుపత్రిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభించారు. ఏడు నెలల పాటు రోగులకు వైద్య సేవలందించారు. ఆ వ్యవధిలో రోగులకు అవసరమైన తాగునీరు, సిబ్బందికి టెంట్లు, ఇతర అవసరాల నిమిత్తం సుమారు రూ.1.76 లక్షలు ఖర్చు చేశాం. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అప్పుల వాళ్లకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చా.


నా కొడుకు గెంటేస్తున్నాడు..
- యలమంచిలి గవరమ్మ

మాది అల్లవరం మండలం. నాకు ఇద్దరు కుమార్తెలు, అయిదుగురు కుమారులున్నారు. వారికి పొలంతోసహా అన్నీ సమానంగా ఇచ్చాం. ప్రస్తుతం నేనుంటున్న ఇల్లు నా భర్త నిర్మించారు. నా మూడో కొడుకు ఇల్లు నాది అంటూ గెంటేస్తున్నాడు. మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరుకు విన్నవించుకునేందుకు వచ్చాం.


దివ్యాంగులకు వసతులు కల్పించాలి
- నిమ్మకాయల సురేష్‌

పదో తరగతి పరీక్షల్లో దివ్యాంగ విద్యార్థులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌కు వికలాంగ మహాసంఘటన్‌ తరఫున వినతిపత్రం ఇచ్చాం. దివ్యాంగ విద్యార్థులకు వెసులుబాటు కల్పించమని ప్రభుత్వం జీవో ఇచ్చినా క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పటిష్టంగా అమలుచేయాలని కోరుతున్నాం. ఆ మేరకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని