logo

80.39 శాతం ఓటుకు ఆధార్‌ అనుసంధానం

కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటు - ఆధార్‌సంఖ్య అనుసంధాన ప్రక్రియ తాత్కాలికంగా ముగిసింది.

Published : 21 Mar 2023 05:46 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటు - ఆధార్‌సంఖ్య అనుసంధాన ప్రక్రియ తాత్కాలికంగా ముగిసింది. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈసీఐ) స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు గతేడాది ఆగస్టు ఒకటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ సంఖ్యను అనుసంధానానికి ఆదేశించింది. డూప్లికేట్‌ ఓట్లను నిరోధించడానికిగాను 2023, మార్చి 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులిచ్చింది. నియోజకవర్గాలవారీగా బూత్‌స్థాయి అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఆధార్‌కార్డును సేకరించి, తహసీల్దార్లు కార్యాలయాల్లో అనుసంధానం చేశారు. జిల్లాలో ఈనెల 20తో అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కృతికాశుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనిని అనుసరించి సోమవారం నాటికి జిల్లాలోని 15,97,891 మందికి గాను 12,84,595 మంది (80.39 శాతం) ఓటు-ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేశారు.

నగరాలు, పట్టణాల్లోనే డూప్లికేట్‌ ఓట్లు?

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనుసంధాన ప్రక్రియకు ఈనెలాఖరు వరకు గడువు ఉంది. ఈలోగా ఇంకా ఆధార్‌కార్డులు ఇవ్వని ఓటర్లు బీఎల్వోలకు అందజేయవచ్చును. ఆధార్‌కార్డు సేకరణ విషయంలో ఓటర్లను బలవంతం చేయవద్దని, అనుసంధానంకానంత మాత్రన ఓటును రద్దు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని ప్రకారం జిల్లాలో ఓటు-ఆధార్‌ అనుసంధానం చేశారు. ఒక వ్యక్తికి ఒకచోటే ఓటు ఉండాలన్న నిబంధన దీని ద్వారా అమలు కానుంది. ఇంకా 9.61 శాతం అనుసంధానం జరగాల్సి ఉంది. వీరిలో శాశ్వతంగా స్థానికంగ నివాసముండని కుటుంబాలు, మరణించినవారు ఎక్కువగా ఉండొచ్చనే అంచనాకు అధికారులు వచ్చారు. నగరాలు, పట్టణాల్లో డూప్లికేట్‌ ఓట్లు ఎక్కువగా ఉంటున్నాయి. డబుల్‌ ఎంట్రీలను ఎన్నికల కమిషన్‌ ఆన్‌లైన్‌లో వడపోత పోసినా, ఇంకా కొంత శాతం ఉంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద స్వచ్ఛమైన ఓటర్ల జాబితా చాలా వరకు ఈ ప్రక్రియ సాకారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని