logo

ఎక్కడికక్కడ అంగన్‌వాడీ సిబ్బంది నిర్బంధం

సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం జిల్లా నుంచి బయలుదేరిన అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

Published : 21 Mar 2023 05:46 IST

రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), నల్లజర్ల: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం జిల్లా నుంచి బయలుదేరిన అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద వారిని అడ్డుకుని వందల మందిని ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు. ముందురోజే అంగన్‌వాడీ సంఘాల నాయకులకు నోటీసులు ఇచ్చి వారిని గృహనిర్బంధం చేయగా, ఆయా మండలాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకుని బలవంతంగా పోలీసుస్టేషన్లకు తరలించి నిర్బంధించడంపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో 140 మంది అంగన్‌వాడీ సిబ్బందిని నగరంలోని పోలీసుస్టేషన్లకు తరలించారు. దీనిపై సీఐటీయూ నాయకులు స్థానిక ప్రకాశ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు, ప్రధాన కార్యదర్శి రాజులోవ, జిల్లా కమిటీ సభ్యుడు బి.పవన్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ సిబ్బందికి ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. సమస్యలను విన్నవించేందుకు విజయవాడ  బయలుదేరిన వారిని పోలీసులతో నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద బైఠాయించి నినాదాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు, అంగన్‌వాడీ కార్యకర్తలు

డిమాండ్లు నెరవేర్చాల్సిందే: విజయవాడలో ధర్నాకు బయలుదేరిన కాకినాడ, సీతానగరం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలను నల్లజర్ల మండలం అనంతపల్లి శివారు వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద నల్లజర్ల ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అటుగా వెళుతున్న గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత ముప్పిడి వెంకటేశ్వరరావు విషయం తెలుసుకుని మహిళలతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు, ఉద్యోగులు వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జీవో నం.1 రద్దు చేయాలన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లు నెరవేర్చాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి టోల్‌ప్లాజా ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. కాకినాడ జిల్లా అంగన్‌వాడీ వర్కర్ల సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ డి.బేబి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని