logo

లక్ష్యం మూడేళ్లు.. నిర్మాణానికి పదేళ్లు!

తిరుపతి, కాకినాడలకు ఒకేసారి స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మంజూరయ్యాయి. అక్కడ ఇప్పటికే కోర్సులు నడుస్తున్నాయి. ఇక్కడా 2015 నాటికే తరగతులు ప్రారంభం కావల్సి ఉన్నా నేటికీ భవన నిర్మాణాలూ పూర్తికాని పరిస్థితి.

Updated : 21 Mar 2023 06:04 IST

ఎస్‌ఐహెచ్‌ఎం ఏర్పాటులో ఆపసోపాలు
ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కొత్తపల్లి

యు.కొత్తపల్లిలో నిర్మాణ దశలో భవనం

తిరుపతి, కాకినాడలకు ఒకేసారి స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మంజూరయ్యాయి. అక్కడ ఇప్పటికే కోర్సులు నడుస్తున్నాయి. ఇక్కడా 2015 నాటికే తరగతులు ప్రారంభం కావల్సి ఉన్నా నేటికీ భవన నిర్మాణాలూ పూర్తికాని పరిస్థితి. కేంద్రం పదేళ్ల క్రితమే రూ.కోట్లతో పథకం మంజూరుచేసినా.. క్షేత్రస్థాయి అడ్డంకులతో అందని ద్రాక్షలా మారింది. కీలక కోర్సులతో ఎందరికో ఉద్యోగ-ఉపాధి అవకాశాలు దక్కేవీలున్నా నేటికీ అందుబాటులోకి రాని దుస్థితి. మూడేళ్లలో పూర్తికావల్సిన ఈ ప్రాజెక్టు.. పదేళ్లు దాటినా దిక్కులు చూస్తుండడంతో విలువైన విద్యా సంవత్సరాలు కరిగిపోతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ చొరవతో కాకినాడకు స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌(ఎస్‌ఐహెచ్‌ఎం) కేటాయించారు. మంజూరైన మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. తొలుత ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్‌-మూలపేట మధ్యలో సంస్థ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. సీఆర్‌జెడ్‌ నిబంధనలు అడ్డు రావడంతో నిర్మాణం సాధ్యపడలేదు. 2014లో యు.కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పక్కనే అయిదెకరాల ఖాళీ స్థలంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.50 కోట్లు వెచ్చించాక..  హైస్కూలు పిల్లల ఆటలకు నిర్దేశించిన ప్రాంతంలో నిర్మాణ పనులపై అప్పట్లో స్థానిక నాయకులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్లడంతో స్టే విధించింది. ప్రభుత్వం మారిన తర్వాత ఎంపీ వంగా గీత చొరవ చూపి నాయకులను ఒప్పించడంతో న్యాయపరమైన చిక్కులు తొలగాయి. నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది. ప్రస్తుతం పిల్లర్ల దశ దాటిన నిర్మాణం.. స్లాబు పనులకు సిద్ధమవుతోంది.


నిధులు కేటాయింపు ఇలా...

కేంద్రం మంజూరు చేసిన రూ.12 కోట్ల నిధులతో అయిదెకరాలకు తక్కువ కాకుండా అభివృద్ధి చేసిన స్థలంలో ఎస్‌ఐహెచ్‌ఎం ఏర్పాటు చేయాలి. సంస్థ భవనానికి రూ.8 కోట్లు, వసతి గృహ సముదాయానికి రూ.2 కోట్లు.. సామగ్రి, ఇతరత్రాలకు రూ.2 కోట్లు చొప్పున వెచ్చించాలి. పక్కనే పాఠశాల ఉండడంతో ఆట స్థలానికి కొంత భూమి కేటాయించి.. మిగిలిన దాంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు వసతులు సమకూరుస్తున్నారు. భవన నిర్మాణాలు.. తాగునీరు, విద్యుత్తు, మురుగు పారుదల వ్యవస్థ.. ఇలా అన్నీ పూర్తయితే తరగతుల నిర్వహణకు ఆటంకాలు తొలగినట్లే.


ఊరిస్తున్న కోర్సులు..

స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల బీఎస్సీ డిగ్రీతోపాటు.. ఆహార ఉత్పత్తి, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీసు, హౌస్‌ కీపింగ్‌, ఆఫీస్‌ ఆపరేషన్లలో ఏడాదిన్నర కాలం ట్రేడ్‌ డిప్లొమో కోర్సులూ ఉన్నాయి. డిగ్రీ కోర్సుకు 80 సీట్లు.. డిప్లొమో కోర్సులకు 40 చొప్పున వెరసి మొత్తం 280 సీట్లు భర్తీకి అవకాశం ఇచ్చారు. జాతీయ విద్యా/ప్రవేశ నిబంధనలను అనుసరించి.. కౌన్సిల్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ సంయుక్తంగా ప్రవేశ పరీక్షల ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించాలి. కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తి, తరగతుల నిర్వహణకు చొరవ చూపితే విద్యార్థులకు మేలు జరిగే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వం తాజా రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్‌ఐహెచ్‌ఎంకు రూ.20 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారో.. తరగతుల నిర్వహణకు వెచ్చిస్తారో స్పష్టత రావల్సిఉంది.


జూన్‌ నాటికి నిర్మాణాలు పూర్తి
- ఎం.వి.రాజారావు, ఈఈ, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)

యు.కొత్తపల్లిలో రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత.. పిల్లలకు ప్లే గ్రౌండ్‌ లేదని స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి. అడ్డంకులు తొలగడంతో నిర్మాణాలు ఇటీవల మొదలయ్యాయి. ప్రస్తుతం సెంటరింగ్‌ పనులు జరుగుతున్నాయి. జూన్‌ నాటికి నిర్మాణాలు పూర్తవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు