తీరిలా.. నీరెలా?
పురాతన పైపులైన్లతో లీకేజీలు.. సాఫీగా నీటి సరఫరాకు సాగని పూడికతీత పనులు.. పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు... ఖర్చు తడిసిమోపెడుఅవుతుండడంతో దరిచేరని కొళాయి నీరు... పూర్తిస్థాయిలో శుద్ధికాని జలాలే తాగాల్సిన దుస్థితి... ఇదీ ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్లు,పురపాలికల్లో తీరు.
పాతబస్టాండు ప్రాంతంలో నీటి కష్టాలు
పురాతన పైపులైన్లతో లీకేజీలు.. సాఫీగా నీటి సరఫరాకు సాగని పూడికతీత పనులు.. పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చని ప్రతిపాదనలు... ఖర్చు తడిసిమోపెడుఅవుతుండడంతో దరిచేరని కొళాయి నీరు... పూర్తిస్థాయిలో శుద్ధికాని జలాలే తాగాల్సిన దుస్థితి... ఇదీ ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్లు,పురపాలికల్లో తీరు. పెద్దాపురం, మండపేట మినహా అంతటా అవస్థలే. వేసవి వేళ పాలికల్లో మంచినీటి కష్టాలపై ‘న్యూస్‌టుడే’ కథనమిది.
శివారుకు ట్యాంకర్లతోనే..
బాలాజీచెరువు (కాకినాడ): కాకినాడ నగరంలో ఒక వ్యక్తికి 100 లీటర్ల చొప్పున అందిస్తున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉండటంతో శివారు ప్రాంతాలకు సక్రమంగా సరఫరా కావడం లేదు. ఇబ్బంది ఉన్న ప్రాంతాలకు రోజూ ఆరు ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సరఫరా లేక రిజర్వాయర్లు (ట్యాంకులు) పూర్తిగా నిండటంలేదు.
ఏం చేయాలి: సామర్లకోట, అరట్లకట్ట జలాశయాలను పూర్తి సామర్థ్యంతో నీటిని నింపాలి. ప్రస్తుతం సామర్లకోట జలాశయానికి తక్కువగా నీటిని గోదావరి కాలువ నుంచి సరఫరా చేస్తున్నారు. దీన్ని పెంచాలి. అరట్లకట్ట జలాశయంలో పూడికతీత పనులు త్వరగా పూర్తి చేసి, వేసవి చివరి వరకు ఇబ్బంది లేకుండా నీటితో నింపాలి. ఇక్కడ గోదావరి కాలువ నుంచి పంపింగ్ ద్వారా పైపులైన్ నుంచి వాటర్ వర్క్సుకు నీటిని తీసుకొస్తున్నారు. పూడికతీత పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి.
లీకులతో ఇబ్బంది
డబ్బాల్లో నిల్వ చేసుకున్న తాగునీరు
అమలాపురం పట్టణం:
పాలికలో 80 శాతం ప్రాంతానికే పైపులైను ఉంది. అదీ పాతదే. దీంతో నీటి సరఫరాలో లీకులు సరేసరి. 20 శాతం ప్రాంతానికి ట్యాంకర్లతో నీరిస్తున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ, చింతకుంట చెరువు, రావులచెరువు, దిగువసావరం, కార్మికనగర్, సామిల్లుకాలనీ, కొంకాపల్లి శివారుకు 2, 3 రోజులకు ట్యాంకర్లతో ఇస్తున్నారు.
ఏం చేయాలి: నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.20 కోట్లు ఇచ్చింది. నీటి శుద్ధి ప్లాంటు, యంత్రాలు, పైపులైను సమకూర్చాలి. గాంధీనగర్‌లో ఓహెచ్‌ఆర్ మినహా మిగిలిన పనులు మొదలుకాలేదు.
తరచూ మరమ్మతులే
ఏడు కాలువల ప్రాంతంలో ట్యాంకర్లతో సరఫరా
పిఠాపురం: పిఠాపురం పురపాలక సంఘంలో నిత్యం 50 ఏళ్ల క్రితం నాటి పైపులు మరమ్మతులకు గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాలు ఎత్తుగా ఉండడంతో పైపుల ద్వారా నీరు చేరడం లేదు. దాంతో శివారుకు తాగునీటి ఎద్దడి నెలకొంటోంది.
ఏం చేయాలి: శివారు ప్రాంతాలకు పైపులైన్ కొత్తగా ఏర్పాటు చేయాలి. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా నిత్యం ఉదయం, సాయంత్ర వేళల్లో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలి. పైపులైన్ వ్యవస్థను పూర్తిగా మార్పు చేయాలి.
అడపాదడపా మట్టి జలమే
తుని: తునిలో 5,618 ఇంటి, 316 వీధి కొళాయిలకు రోజూ శుద్ధి నీరిస్తున్నారు. కొన్నిచోట్ల కొళాయి నీరు మట్టితో కలిసివస్తోంది.
ఏం చేయాలి: అమృత్ పథకంలో రూ.10 కోట్లు రానున్నాయి. ఉప్పరిగూడెం వైఎస్‌ఆర్ కొత్తకాలనీ, డ్రైవర్స్ కాలనీ శివారులో రక్షిత తాగునీటి ప్రధాన పైప్‌లైన్లు వేయాలి. రక్షిత నీటి సరఫరా ట్యాంకులు సకాలంలో శుభ్రం చేసి, కలుషిత నీరు రాకుండా చూడాలి. పైప్‌లైన్ల లీకేజీ..కొళాయిలకు మూతలు ఏర్పాటు చేయాలి.
శుద్ధి గగనమే
సామర్లకోట: గోదావరి జలాలను గోదావరి కాలువ నుంచి ఉండూరు రోడ్డులోని ఎన్‌ఎఫ్‌సీఎల్ చెరువులో నింపుతున్నారు. గోదావరి కాలువ కట్టేస్తే చెరువులో నీరు నింపేందుకు ఇబ్బందే.
ఏం చేయాలి: ధవళేశ్వరం నుంచి దిగువ ప్రాంతాల గ్రామాలు, పరిశ్రమల వ్యర్థాలు, రసాయనాలు గోదావరి కాలువలో కలుస్తున్నాయి. కాకినాడ, పెద్దాపురం, సామర్లకోటకు పూర్తిగా శుద్ధి కాకుండా ఈ నీరే ఇస్తున్నారు. గోదావరి నుంచి ప్రత్యేక పైపులైను వేయడానికి రూ.90 కోట్లతో చేసిన ప్రతిపాదనలకు మోక్షం కలిగితే మేలు చేకూరే వీలుంది.
102 లీటర్లతో సరి
శిథిలావస్థకు చేరిన నీటి ట్యాంకు
నిడదవోలు: నిడదవోలు పట్టణంలో తలసరి నీటి సరఫరా పరిమాణం 130 లీటర్లు ఇవ్వవలసి ఉండగా, 102 లీటర్ల వరకు మాత్రమే అందిస్తున్నారు. పట్టణంలో తాగునీటికి అంతగా ఇబ్బందులు లేకపోయినా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ట్యాంకర్లను అద్దె ప్రాతిపదికన సిద్ధం చేశారు. పలు ప్రాంతాల్లో పురాతన పైపులైన్ల కారణంగా తరచూ లీకేజీలు ఏర్పడి తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులున్నాయి.
పనులు పూర్తయితేనే..
కొవ్వూరులో పైపులైను మరమ్మతులు
కొవ్వూరు: పట్టణంలో తలసరి నీటి సరఫరా పరిమాణం 135లీటర్లు సరఫరా ఇవ్వాల్సి ఉండగా సుమారు 110 లీటర్ల వరకూ అందిస్తున్నారు. పట్టణంలో శ్రీనివాసపురం, ఔరంగాబాద్ ప్రాంతాలకు తీవ్ర ఎద్దడి ఏర్పడే సమయంలో సరఫరాకు సుమారు రెండు ట్రాక్టర్లు సిద్ధం చేస్తున్నారు.
ఏం చేయాలి: ఏఐఐబీ(ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు) నిధులు సుమారు రూ.58 కోట్లతో రెండు ప్యాకేజిలుగా విభజించి పైపులైను పనులు చేసేందుకు ప్రణాళిక పూర్తి చేస్తున్నారు. ఇంకా సుమారు 50 కిలోమీటర్ల మేర పూర్తి చేయాల్సి ఉంది. పనులు త్వరితగతిన పూర్తయితే ఇబ్బందులు తొలగుతాయి.
రెండు పూటలా కొందరికే...
కోరుకొండ రోడ్డులో ఇటీవల పైపులైన్ లీకేజీ
టి.నగర్: రాజమహేంద్ర వరంలో సుమారు 97 వేల గృహాలున్నాయి. ప్రతి ఒక్కరికీ 185 లీటర్ల నీటిని నిత్యం అందజేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. కేవలం రెండు పూటలా తాగునీటి సరఫరా కొన్ని డివిజన్లకే పరిమితమైంది. శివారు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అవకాశం లేకపోవడంతో ట్యాంకర్లు ద్వారా సరఫరా చేస్తున్నారు.
ఏం చేయాలి: నగరంలో భూగర్భ పైపులైన్ వ్యవస్థ ఇప్పటి అవసరాలకు అనుగుణంగా పూర్తిగా మార్చాల్సి ఉంది. ప్రస్తుతం పాత పైపులైన్లు ఉండడంతో తరుచుగా లీకేజీలకు గురవుతున్నాయి. ఇప్పటికే కొత్త ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీతో కూడిన పైపులు వేస్తున్నారు. 2030 నాటికి అప్పటి తాగునీటి అవసరాలు తీర్చేందుకు గాను రూ.160 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును సిద్ధం చేసి, ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.
ఎద్దడి నివారణకు చర్యలు
వేసవి సీజన్‌లో నీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆయా పురపాలిక సంఘాలకు ఆదేశాలు జారీ చేశాం. వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. నీటి సరఫరా లోపాలు, లీకేజీలు, ట్యాంకుల శుభ్రత, పైపులైన్ల ఏర్పాటుకు సంబంధించి పనులు చేపడతాం. వేసవిలో నీటి సరఫరాకు ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.
సత్యనారాయణ, మున్సిపల్ ఆర్డీ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Politics News
భీమవరంలో ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను