logo

క్షయకు కళ్లెమేద్దాం

క్షయ.. దీని నివారణకు అనేక అవగాహన సదస్సులు, నివారణ కార్యక్రమాలు, వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక ల్యాబ్‌లు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన పౌష్టికాహారం వంటివి అందిస్తూ వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతున్నా అవగాహన లేమి, నిర్లక్ష్యం తదితర కారణాలతో జిల్లాలో టీబీ కేసులు బయట పడుతూనే ఉన్నాయి.

Updated : 24 Mar 2023 06:08 IST

వ్యాధిగ్రస్థురాలికి మందులు అందిస్తూ....

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

క్షయ.. దీని నివారణకు అనేక అవగాహన సదస్సులు, నివారణ కార్యక్రమాలు, వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక ల్యాబ్‌లు, వ్యాధిగ్రస్తులకు మెరుగైన పౌష్టికాహారం వంటివి అందిస్తూ వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతున్నా అవగాహన లేమి, నిర్లక్ష్యం తదితర కారణాలతో జిల్లాలో టీబీ కేసులు బయట పడుతూనే ఉన్నాయి. ‘టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది’ నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు,
బాధితులకు అందిస్తున్న చికిత్స, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కథనం.

జిల్లాలో టీబీ రోగులకు మెరుగైన చికిత్స అందించడంతోపాటు బాధితులకు ప్రధాన మంత్రి టీబీ ముక్తభారత్‌, నిక్షయ్‌పాత్ర కార్యక్రమాల్లో పౌష్టికాహారం అందజేస్తున్నారు. జిల్లాలోని 35 కేంద్రాల్లో క్షయ(కళ్లె) పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో సీబీనాట్‌ యంత్రంపై పరీక్షలు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి సైతం ఇక్కడ ఉచితంగా పరీక్షలు చేసి నివేదికలు ఇస్తారు.


12 చోట్ల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు

జిల్లాలోని ఆర్టీపీసీఆర్‌ క్షయ పరీక్షలను 12 చోట్ల చేస్తున్నారు. జిల్లాలోని మలకపల్లి, కానూరు, ధవళేశ్వరం పీహెచ్‌సీలు, గోపాలపురం, నిడదవోలు, కడియం, గోకవరం, అనపర్తి సామాజిక ఆసుపత్రులు, జీఎస్‌ఎల్‌ వైద్యకళాశాల, రాజమహేంద్రవరంలోని బృహన్నలపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఈ అత్యాధునిక పరీక్షలు చేస్తున్నారు. దీని ద్వారా ఒక గంట వ్యవధిలో టీబీని గుర్తించవచ్చు.


ఏటా 30 వేల నమూనాలు

క్షయ నివారణకు ప్రతి అనుమానితునికి పరీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏటా 30 వేల మందికి పరీక్ష చేసి నిర్ధారణ అయితే వారికి చికిత్స అందజేస్తున్నారు. 2022లో 30,971 మందికి పరీక్షలు చేయగా 1,621 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. 2023 మార్చి(15వ తేదీ వరకు)లో 5,903 మందికి పరీక్షలు చేయగా ఇప్పటివరకు 241 మందికి వ్యాధి సోకినట్లు గురించి చికిత్స అందిస్తున్నారు. దీంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, హెచ్‌ఐవీ రోగులు, రక్తపోటు, మధుమేహం, చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్నవారు, ధూమపానం, మద్యపానం చేసేవారికి టీబీ పరీక్షలు చేసి 24 గంటల్లో ఫలితం ఇవ్వడంతోపాటు వ్యాధి నిర్ధారణ అయిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు.


బాధితులకు ఆర్థిక సాయం

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిక్షయ్‌ మిత్ర పథకంలో భాగంగా టీబీ రోగులకు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలపాటు నగదు జమ చేస్తున్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్తభారత్‌ కార్యక్రమంలో భాగంగా పౌష్టికాహారం తీసుకోలేని పేద క్షయ రోగులకు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆరు నెలలపాటు పౌష్టికాహారం ఇచ్చేలా దాతలను ప్రోత్సహించి సహకారం అందజేస్తున్నారు. ఇప్పటివరకు 524 మందికి ఆరునెలలపాటు పౌష్టికాహారం అందజేసేలా దాతలను ప్రోత్సహించారు.


నివారణే లక్ష్యంగా చర్యలు

వచ్చే రెండేళ్లలో క్షయ వ్యాధి నివారణే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా పాఠశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, నోటి నుంచి రక్తంతో కూడిన కళ్లె పడడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలుంటే వెంటనే టీబీ పరీక్ష చేయించుకోవాలి. రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి, జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష, చికిత్స కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.

డాక్టర్‌ ఎన్‌.వసుంధర, జిల్లా క్షయ నివారణాధికారిణి, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు