logo

ఆరోగ్య సహాయకుల కౌన్సెలింగ్‌ ఉద్రిక్తం

రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలోని వైద్యఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకుడి కార్యాలయం వద్ద హెల్త్‌ అసిస్టెంట్ల(ఆరోగ్య సహాయకులు) కౌన్సెలింగ్‌లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది.

Published : 24 Mar 2023 04:36 IST

ఆర్డీ కార్యాలయం బయట ఉద్యోగుల ఆందోళన

రాజమహేంద్రవరం వైద్యం: రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలోని వైద్యఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకుడి కార్యాలయం వద్ద హెల్త్‌ అసిస్టెంట్ల(ఆరోగ్య సహాయకులు) కౌన్సెలింగ్‌లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. జోన్‌-2 పరిధిలోని(ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు) 38 మంది ఆరోగ్య సహాయకులకు హెల్త్‌ సూపర్‌ వైజర్లుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు గురువారం కౌన్సెలింగ్‌కు పిలిచారు. జీవో నంబరు.143 ప్రకారం పీహెచ్‌సీల్లో ముందుగా ఇవ్వాల్సిన ఎంపీహెచ్‌ఈవో, పీహెచ్‌ఎన్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా ప్రస్తుతం వెంటనే చేయాల్సిన అవసరం లేని ఆరోగ్య సహాయకుల కౌన్సెలింగ్‌ ఎందుకు నిర్వహిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఈయూ) నాయకులు ఆర్డీ పద్మాశశిధర్‌ను ప్రశ్నించారు. ఆర్డీ కార్యాలయం అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆరోగ్య సహాయకులకు కౌన్సెలింగ్‌కు ఏర్పాటు చేసేశారంటూ ఏపీజీఈయూ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆర్టీ కార్యాలయం అధికారులు కౌన్సెలింగ్‌ నిలిపివేశారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని మరోవైపు ఆరోగ్య సహాయకులు ఆర్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి రప్పించి కౌన్సెలింగ్‌ చేయకుండా రాత్రివరకు ఉంచారని ఆరోగ్య సహాయకులు వాపోయారు. దీనిపై జోన్‌-2 ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్‌ పద్మాశశిధర్‌ను వివరణ కోరగా ప్రస్తుతానికి కౌన్సెలింగ్‌ నిలిపివేశామన్నారు. విషయాన్ని వైద్యఆరోగ్యశాఖ సంచాలకుడి దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని