logo

హక్కుల సాధనకు బీసీలు పోరాడాలి: ఎంపీ

బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, అందరినీ కలుపుకొంటూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఎంపీ భరత్‌రామ్‌ అన్నారు.

Published : 24 Mar 2023 04:36 IST

చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎంపీ, బీసీ జేఏసీ ఛైర్మన్‌  తదితరులు

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం) :

బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి హక్కుల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉందని, అందరినీ కలుపుకొంటూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఎంపీ భరత్‌రామ్‌ అన్నారు. నగరంలోని హోటల్‌ ఆనంద్‌ రీజెన్సీలో గురువారం జరిగిన శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎంపీతోపాటు బీసీ జేఏసీ ఛైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గంలో ఉన్న ఐక్యత మిగిలిన బీసీ వర్గీయుల్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు.  మనలో ఏ ఒక్కరు ప్రజాప్రతినిధిగా ఉన్నా మరో పది మందిని పైకి తీసుకురావచ్చని, అంతేగానీ అసూయతో కాళ్లు పట్టుకుని కిందకు లాగేస్తే ఎప్పటికీ మన లక్ష్యాన్ని చేరుకోలేమన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు బీసీలకే ఇచ్చేలా అన్ని పార్టీలపై ఒత్తిడి చేయాలన్నారు. అనంతరం బీసీ సంఘీయుల్లో వివిధ రంగాల్లో ఉన్న పలువురిని ఎంపీ చేతుల మీదుగా సన్మానించారు.

పొగాకు రైతుల సంక్షేమానికి కృషి

గోపాలపురం: ఎన్‌ఎల్‌ఎస్‌ పొగాకు రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌ రైతులతో కొంతసేపు మాట్లాడుతూ పొగాకు రైతులు కోరుతున్న విద్యుత్‌ రాయితీ గురించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానన్నారు. గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో గురువారం ఆయన కొనుగోళ్లను ప్రారంభించారు. ముందుగా ఎంపీ, రైతులు పూజలు చేశారు. మొదటి రోజు 27 బేళ్లు వేలానికి రాగా, అత్యధికంగా కిలో పొగాకు ధర రూ.210 పలికింది. అన్ని బేళ్లను ఆయా కంపెనీల వారు అదే ధరకు కొనుగోలు చేశారు. పొగాకు బోర్డు రీజియన్‌ మేనేజర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో గురువారం కొనుగోళ్లు ప్రారంభమైనట్లు తెలిపారు. ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, వేలం నిర్వహణాధికారి ఆది శేషయ్య, రైతుసంఘ అధ్యక్షుడు పిన్నమనేని మధుమోహన్‌, పొగాకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని