logo

బాల్యానికి బంధం ఎలా..?

పేదరికం, నిరక్షరాస్యత, కట్టుబాట్లు తదితర కారణాలతో అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలను పణంగా పెడుతున్నారు.

Published : 26 Mar 2023 05:03 IST

న్యూస్‌టుడే, వెంకట్‌నగర్‌(కాకినాడ)

బాల్య వివాహాల నిరోధంపై కాకినాడలో అంగన్‌వాడీ కార్యకర్తల అవగాహన ర్యాలీ (పాతచిత్రం)

పేదరికం, నిరక్షరాస్యత, కట్టుబాట్లు తదితర కారణాలతో అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలను పణంగా పెడుతున్నారు. ఆధునిక నాగరికతలోనూ బాలికలకు పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నిస్తుండటం, అధికారులు వాటిని విఫలం చేసి కేసులు నమోదు చేస్తున్న ఘటనలు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం, ఆలస్యం చేస్తే మళ్లీ మంచి సంబంధం వస్తుందో లేదోనని కొందరు తల్లిదండ్రులు యుక్త వయసు రాకుండానే బాలికల మెడలో పసుపు తాడును వేయిస్తున్నారు. బాల్య వివాహాలు పెరిగేందుకు ఇవి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో కొన్ని సంఘటనలు అధికారుల దృష్టికి వస్తుంటే మరికొన్ని గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019 నుంచి 2021 వరకు 317 బాల్య వివాహాలను అడ్డుకోగా ఒక్క 2022 సంవత్సరంలోనే 91 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు బాలల పరిరక్షణాధికారి బి.రామకోటి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 బాల్య వివాహాలను అడ్డుకున్నామన్నారు.


* పెద్దాపురం పరిధిలో ఓ కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగోక 16 ఏళ్ల బాలికకు పెళ్లి చేసేందుకు ఇటీవల ఏర్పాట్లు చేశారు. బాల్య వివాహం చేయడం వల్ల కలిగే అనర్థాలను ఆమె తల్లిదండ్రులకు ఐసీడీఎస్‌ అధికారులు అవగాహన కల్పించి వివాహాన్ని నిలుపుదల చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో వెలుగుచూస్తూనే ఉంటున్నాయి.

బాల్య వివాహాలతో  కలిగే సమస్యలివీ..

*  వివాహ వయసు రాకుండానే పెళ్లి చేస్తే ఆ బాలికలు గర్భం దాల్చి త్వరగా బలహీనంగా మారతారు. పుట్టే బిడ్డకు జన్యుపరమైన సమస్యలతో పాటు పోషక లోపాలతో ఎదుగుదల లోపిస్తుంది.* అధిక సంఖ్యలో గర్భస్రావాలు, ఒక్కోసారి తల్లీబిడ్డ మరణం కూడా సంభవిస్తాయి.* దంపతుల మధ్య అవగాహన లోపంతో కుటుంబంలో కలహాలు రావడం, త్వరగా విడిపోయే ఆస్కారం ఉంది.* మానసిక పరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు పాల్పడతారు.

ఎవరికి సమాచారం ఇవ్వాలంటే...

ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులకు టోల్‌ఫ్రీ నంబరు 100, మహిళా శిశు సంక్షేమశాఖ సంచాలకులు, ఐసీడీఎస్‌, చైల్డ్‌లైన్‌కి 1098, తహసీల్దారు, సీడీపీవో, గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శులకు, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలకు సమాచారం అందించవచ్చు.


అభద్రతాభావం  విడనాడాలి..

వివాహం చేసే ఏ మత పెద్దలయినా కచ్చితంగా వధువు, వరుడు వివాహ వయసు తెలుసుకోవాల్సిందే. లేదంటే వారిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వివాహాలు ఎక్కువ జరుగుతున్నందున నిఘా పెంచాం. బాలిక మైనరు అయి వరుడు మేజర్‌ అయితే పోక్సో కేసులు నమోదు చేస్తున్నాం. పలువురు తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలకు భద్రత కల్పించలేమనే భావంతో వివాహ వయసు రాకుండానే పెళ్లి చేసేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం. ప్రతి గ్రామంలో 8 మంది సభ్యులతో కూడిన చైల్డ్‌ ప్రొటక్షన్‌ కమిటీలు ఏర్పాటుచేశాం.
కొండా ప్రవీణ, ఐసీడీఎస్‌ పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని